* వర్ణ (బాగోలేదు)
తారాగణం:
అనుష్క, ఆర్య తదితరులు
సంగీతం: హారిస్ జైరాజ్
నిర్మాత: ప్రసాద్ వి.పొట్లూరి
దర్శకత్వం: సెల్వరాఘవన్
పిచ్చి ముదిరింది, రోకలి తలకు చుట్టమన్నాడని సామెత. దర్శకుడు సెల్వరాఘవన్ పరిస్థితి అచ్చం ఇలాగే వుంది. చోళులు, పాండ్యులు, ఎక్కడో వారి వారసులు బతికి వుండడం, పగతీర్చుకోవడం, పిచ్చి పిచ్చి భాష, హావభావాలతో ‘యుగానికి ఒక్కడు’ తీసి జనం మతిపోగొట్టాడు అతగాడు కొన్నాళ్ల కిందట. ఆ సినిమా క్లయిమాక్స్ చూసిన జనాలు ఇప్పటికీ గుర్తుకొచ్చినపుడల్లా తల పట్టుకుని బాధపడతారు. అయినా, ఆ సంగతి తెలిసి కూడా, మరోసారి జనంపై తన కసి తీర్చుకోవాలని డిసైడైపోయి, ‘వర్ణ’అంటూ మరో ఫాంటసీతో వచ్చాడు సెల్వ. భూలోకం, మరోలోకం, రెండు చోట్లా హీరో హీరోయిన్ల డబుల్ రోల్, లాజిక్‌కు అందని వ్యవహారాలు, అర్థం కాని, చూడ్డానికి అవకాశం ఇవ్వని స్క్రిప్ట్‌తో ప్రేక్షక జనం కకావికలై థియేటర్లోంచి బయటకు పరుగులు తీసేలా చేసాడు. ఇందుకోసం ఏకంగా ఒకటి కాదు, రెండు కాదు, 60కోట్లు నిర్మాత చేత ఖర్చు చేయించేసాడు. తనేమిటో, తన కథేమిటో, దానికి వున్న పైత్యమేమిటో అర్థం కాక, జనం జుట్టుపీక్కోవాల్సిందే.
ఇంతకీ ఇంత అద్భుతరాజమైన కథ ఏమిటీ అంటే.. విశాల విశ్వంలో భూమిలాంటి మరో గ్రహం. అక్కడ ఇంకా స్ర్తికి అగౌరవమే. ప్రేమంటే తెలియని వ్యవహారం. మరి అక్కడ ప్రేమ ఎలా మొగ్గతొడికి, పుష్పించాలి? అదే ఆ గ్రహం మీద వున్న దేవత ఆలోచన. అందుకే భూమీద ప్రేమించుకుంటున్న జంట (మధుబాలకృష్ణ-రమ్య) విడిపోతుంది. ప్రియురాలు చనిపోతుంది. ప్రియుడు కొత్త గ్రహం మీదకు చేరుకుంటాడు (ఎలా అని అడక్కండి..ఇది ఫాంటసీ సినిమా). చిత్రమేమిటంటే, ఇలాంటి రూపురేఖలు వున్న జంటే (మహేంద్ర-వర్ణ) కొత్త గ్రహం మీద కూడా వుంటుంది.
మరి ఇంతకీ కొత్త గ్రహం మీద ప్రేమ పుట్టిందా..ప్రియురాలి కోల్పోయిన మధు ఏమయ్యాడు..ఇత్యాది వ్యవహారాలన్నీ, ధైర్యం చేసి సినిమా చూస్తే తెలుస్తాయి. ప్రేమలేని లోకంలో ప్రేమను పుట్టించాలన్నది బేసిక్‌గా దర్శకుడి ఆలోచన. బహుశా ఇదే సింగిల్ లైన్ కథగా నిర్మాతకు చెప్పి ఒప్పించి వుంటాడు. కానీ ఆ వ్యవహారం చేయడానికి ఎన్ని గింగిరాలు తిరగాలో, అన్నీ తిరిగాడు. సినిమా చూసి బయటకు వచ్చిన ప్రేక్షకుడి మదిలో సవాలక్ష సందేహాలు మిగిలిపోతాయి. అసలు వేరే గ్రహంలో ప్రేమ పుట్టించడానికి, ఈ గ్రహంలో జంటను విడదీయడం ఎందుకో? పోనీ ఆ ప్రేమ ఎలా పుట్టిందో? జనాల నడుమ అనుబంధాలు ఓ మెరుపులా ఎలా పుట్టుకువచ్చాయో? అసలు రెండు జంటలు ఒకే రూపులో వుండాల్సిన పరమార్థమేమిటో? ఇలా రకరకాల అనుమానాలు వెంటాడుతాయి.
కథనే ఇంత అసంబద్ధంగా తయారుచేసుకున్న దర్శకుడు ఇక స్క్రిప్ట్‌ను అంతకన్నా తలతిక్క వ్యవహారంగా మార్చుకున్నాడు. సినిమా ప్రథమార్థంలో కథ ముందుకు నడవకుండా, పాకుతూ, డేకుతూ వుంటుంది. ద్వితీయార్థంలో ఏం జరుగుతోందో అర్థం కాదు. వేరే గ్రహం అని చెప్పి, విదేశీ జనాలకు మేకప్ లు వేసి చూపించడం, లొకేషన్లకు రంగులు పులివేయడం తప్పిస్తే, దర్శకుడి క్రియేటివిటీ ఏమీ కనిపించదు. తాను సైతం హాలీవుడ్ లెవెల్ సినిమాలు తీయగలను అన్న యావ తీర్చుకోవడానికి సినిమా తీసినట్లుంది తప్ప, ఓ మంచి అంతర్జాతీయ స్థాయి సినిమా తీసే ప్రయత్నం చేసినట్లు లేదు. ఎవరైనా సరే తమ స్టామినా చూపించే ప్రయత్నం చేయడం వేరు, ఎదుటివారిని దాటాలనే పోటీ కోసం పనిచేయడం వేరు అని దర్శకుడు తెలుసుకోవాలి.
సాంకేతికంగా అద్భుతాలు అవసరమైన ఈ సినిమాకు సంగీతం పెద్ద మైనస్. హారిస్‌జైరాజ్ పాటల సంగతి పక్కనపెడితే, అనిరుధ్ నేపథ్య సంగీతం ఘోరాతి ఘోరం. ఒకే ఒరవడిలో సాగుతుంది. ఎడిటర్లను తమ పని తాను చేయనివ్వని దర్శకుల్లో ఒకడిగా మిగిలిపోతాడు ఈ దర్శకుడు కూడా. రామ్ జీ ఛాయాగ్రహణం కూడా ఏమంత అద్భుతంగా లేదు. సిజి పనితనమే ఎక్కువగా కనిపిస్తుంది.
నటీనటులు ప్రతిభ కూడా అంతంత మాత్రమే. ప్రధాన పాత్రలు నాలుగింటి చుట్టూనే కథ అంతా తిరుగుతుంది. దాంతో మిగిలిన పాత్రలన్నీ ఎగస్ట్రా రోల్స్ కింద మారిపోయాయి. ఈ నాలుగింటిని పోషించిన ఇద్దరు నటులు (ఆర్య-అనుష్క) పెద్ద గొప్పగా చేసిందేమీ లేదు. అందునా ఓ పాత్రకు అనుష్క మేకప్ చూస్తే, ఆంటీ అనిపిస్తుంది తప్ప, హీరోయిన్ అనుకోరు. రెండో పాత్రకు ఆమె చేసిందేమైనా వుంటే, అది మొహం చిరాగ్గా పెట్టడం తప్ప మరొకటి కాదు. ఇక ఆర్య వ్యవహారం మరీ చిత్రం. ఆ గెటప్పులేమిటో, ఆ వైనమేమిటో?
60కోట్లు ఖర్చు పెట్టి తీసిన ఈ సినిమాను చూస్తే బాధేస్తుంది. సినిమాను కూడా కేవలం ఓ వ్యాపారంగా చూసి, అక్కడేం జరుగుతోందో పట్టించుకోకుండా పెట్టుబడి పెట్టే స్థితికి నిర్మాణం అన్నది దిగజారిపోయింది. నిర్మాత అంటే కేవలం క్యాషియర్ కాదని, దర్శకుడు ఏం చెప్పాడు..అది ప్రేక్షకులకు రీచ్ అవుతుందా అవదా..అసలు చెప్పిందే, స్క్రీన్ మీదకు సరిగ్గా వస్తోందా అన్నది చూసుకోవాల్సిన బాధ్యత కూడా వుందని గుర్తించని రోజులు వచ్చేసాయి. అందుకు అద్భుతమైన ఉదాహరణే వర్ణ. అసలు కథ చెప్పినదగ్గరే నిర్మాత వెనుకడుగు వేయాలి. ఇలాంటి కానె్సప్ట్ జనాలకు ఎక్కదని. లేదూ, కొత్తదనం కోసం ధైర్యం చేయాలి అనుకున్నపుడు, స్క్రిప్ట్ సక్రమంగా వుందో లేదో చూడాలి. అలా చేయకుంటే, ఇలాంటి దర్శకులు తమ వ్యవహారాలు ఇలా సాగిస్తూనే వుంటారు.