చాంద్రాయణగుట్ట, నవంబర్ 29: మహిళల సమస్యలు అధికమైనందున అందుకనుగుణంగా సత్వర తీర్పు కోసం మహిళా కోర్టులతోపాటు క్షేత్రస్థాయిలో మహిళలకు అందుబాటులో వుండేలా మహిళా పోలీసుస్టేషన్లను పెంచాలని శాసనసభ్యురాలు జయసుధ అభిప్రాయం వ్యక్తం చేసారు. రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో ఈనెల 25 నుంచి డిసెంబర్ 10 వరకు మహిళల భద్రతపై నిర్వహిస్తున్న ‘నిశ్శబ్దాన్ని ఛేదిద్దాం’లో భాగంగా ప్రియదర్శిని ఆడిటోరియంలో శుక్రవారం ఐదవరోజు ‘మహిళా గృహహింస’ అంశంపై జరిగిన సదస్సులో ఆమె మాట్లాడారు. తాను సినిమాల్లో నలభై ఏళ్లు మహిళ ప్రాధాన్యతగల పాత్రలు పోషించినా చివరికి ముగింపు సంతోషంగా చూపిస్తారని, నిజజీవితంలో అలాంటి సంతోషం మనం చూడడంలేదన్నారు. నిర్భయ లాంటి చట్టాలు వచ్చినా భయం లేకుండా నేరాలు జరుగుతున్నాయని అన్నారు.
ఒక కుటుంబంలో హింసను ఎదుర్కొనే మహిళ పరువుకోసం సాధ్యమైనంతవరకు భరించి ఆ తర్వాతనే ఫిర్యాదు చేస్తుందని అయినా కుటుంబసభ్యులు, భర్త నుంచి హింసను భరిస్తుందని అన్నారు. నేడు చైతన్యం, ఆర్థిక స్థోమత కలిగిన మహిళలు ఫిర్యాదు చేయడానికి ముందుకు వస్తున్నారని అలా బహిర్గతం చేస్తేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. కట్నం తీసుకోవడం గౌరవంగా భావించవద్దని, గృహహింసలో ఎక్కువ శాతం కట్నం ఆశించడంవల్లనే జరుగుతున్నాయని అన్నారు. మహిళల్లో మార్పు రావాలి, అవగాహన పెరగాలంటే ప్రభుత్వం వున్న చట్టాలను హోర్డింగ్‌లు, కళాకారులు, మీడియాద్వారా ప్రచారం చేయాలన్నారు. మహిళలు వారికున్న శక్తిని సమాజం కోసం సద్వినియోగం చేయాలన్నారు. డిసిపి సిసిఎస్ పాల్రాజు మాట్లాడుతూ, తన అనుభవంలో మహిళల సమస్యలు తనను కలచివేసాయని ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా పరిస్థితి అలాగే వుందన్నారు. సమాజంలో చట్టాలపై అవగాహన పెంచి వాటిని ఖచ్చితంగా అమలయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. సదస్సుకు అధ్యక్షత వహించిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్ త్రిపురాన వెంకటరత్నం మాట్లాడుతూ, మహిళకు ఇల్లు రక్షణగా వుండాలని, అక్కడినుంచే హింస మొదలైతే వారు ఎక్కడికెళ్లాలన్నారు. ఆడపిల్లంటే అక్కడిపిల్లగానే భావిస్తూ పుట్టకుండా చేస్తూ, చదివించినా కట్నం కూడా ఇవ్వాల్సి వస్తుందని, జన్యుపరంగా బిడ్డ ఆడ- మగ అనేది తండ్రి నుంచే వస్తుందని, దానిని మగవాళ్లు తెలుసుకుని అఘాయిత్యాలకు పాల్పడవద్దన్నారు.
మహిళల సమస్యలు అధికమైనందున అందుకనుగుణంగా
english title:
women police stations
Date:
Saturday, November 30, 2013