హైదరాబాద్, నవంబర్ 29: ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికపై మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేడు మహా చర్చ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రవీంద్రభారతిలో మధ్యాహ్నం పనె్నండు గంటల నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు నిర్వహించనున్న ఈ మహాచర్చలో తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ లింబాద్రి, జాతీయ ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు వడ్డేటి దేవేందర్, రావుల అంజయ్యతో పాటు వివిధ ఎస్సీ, ఎస్టీ సంఘాలకు చెందిన ప్రతినిధులు, మేధావులు ఈ చర్చలో పాల్గోనున్నట్లు నిర్వాహకులు, మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బత్తుల రాంప్రసాద్, గౌరవ సలహాదారు నిమ్మబాబురావులు తెలిపారు. ముఖ్యంగా ఈ ఉపప్రణాళికకు సంబంధించి భారత ప్రణాళిక సంఘం ఇచ్చిన సూచనలు, మార్గదర్శకాల అమలు తీరుపై చర్చ జరగనున్నట్లు వారు వెల్లడించారు. ఈ ఉపప్రణాళిక ప్రకారం ఎస్సీల జనాభా ప్రకారం 16.2శాతానికి గాను రాష్ట్ర ప్రభుత్వం సుమారు 6.6శాతం నిధులు కేటాయించి, వెచ్చించాల్సి ఉంది. జనాభా లెక్కల ప్రకారం మొత్తం రూ. 9626 కోట్లు కేటాయించాల్సి ఉండగా, రూ. వెయ్యి 48 కోట్ల నిధులను కోత విధిస్తూ రూ. 8578 కోట్లను కేటాయించినట్లు, ప్రణాళిక వచ్చిన తర్వాత కూడా అనధికారికంగా ఇలాంటి కోతలెందుకు అమలవుతున్నాయన్న విషయంపై చర్చించి తీర్మానాలు చేయనున్నట్లు వారు వివరించారు.
అంతేగాక, ఎస్టీల జనాభా ప్రకారం 6.6శాతం అంటే రూ. 3921 కోట్లు కేటాయించాల్సి ఉండగా, రూ. 255 కోట్ల కోత విధించి, రూ. 3666 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇలా కేటాయించిన నిధుల్లో నుంచి చట్టంలోని నాన్ డివిజనబుల్ క్లాజ్ క్రింత రూ. 329 కోట్లు ఎస్టీలకు సంబంధం లేని ఆరు రంగాలకు చట్టవిరుద్దంగా దారి మళ్లించి మరీ కేటాయింపులు చేశారని తెలిపారు. ఎస్సీ కులాలు, ప్రజలకు, వారి కుటుంబాలకు ప్రత్యేక్షంగా లబ్ది చేకూర్చే పథకాలు మాత్రమే ఈ ప్రణాళిక కింద కేటాయించాలన్న డిమాండ్‌ను కూడా ఈ మహాచర్చ ద్వారా విన్పించనున్నట్లు రాంప్రసాద్ తెలిపారు.
ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం ప్రభుత్వం
english title:
sc, st sub plan
Date:
Saturday, November 30, 2013