హైదరాబాద్, నవంబర్ 29: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బగా తయారైంది. ఒకవైపు కొత్త కమిషనర్ సోమేశ్‌కుమార్ ప్రధాన కార్యాలయాన్ని కార్పొరేట్ తరహా ఆఫీసుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తుంటే, ఆయన కింది స్థాయి అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారని చెప్పవచ్చు. ఇందుకు శుక్రవారం ప్రధాన కార్యాలయంలో నాలుగైదు కోతులు సంచరిస్తూ సృష్టించిన హల్‌చలే కారణంగా చెప్పవచ్చు. ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో కోతులు, కుక్కల బెడద ఎక్కువైందంటూ ప్రజావాణి, ఫేస్ టు ఫేస్ కార్యక్రమాల్లో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా, బల్దియా అధికారులు మాత్రం కనీసం వాటిని పట్టుకునేందుకు కూడా చొరవ చూపటం లేదు. సర్కిళ్లు, జోనల్ విషయాల్లో కోతులు, కుక్కలను పట్టుకునే మాట దేవుడెరుగు గానీ, మొత్తం బల్దియాకే బిగ్ బాసు అయిన కమిషనర్, అలాగే బల్దియాలోని వివిధ విభాగాలధిపతులు విధులు నిర్వర్తించే ప్రధాన కార్యాలయంలోనే అరడజను కొద్ధీ కోతులు, కుక్కలు, పిల్లులు సంచరిస్తున్నా, అధికారులకు పట్టడం లేదు. గతంలో ఎం.టి.కృష్ణబాబుగా వ్యవహారించినపుడు మొదటి అంతస్తులో ఉన్న ఆయన ఛాంబర్‌లోకి కూడా కోతులు చొరబడి హల్‌చల్ చేశాయి. అప్పట్లో సంబంధిత వెటర్నరీ అధికారులకు కమిషనర్ అక్షింతలు వేసినా, పరిస్థితుల్లో మార్పురాలేదు. అంతేగాక, రెండురోజుల క్రితం ఈ నెల 28న జరిగిన స్థారుూ సంఘంలో కూడా కోతులు, కుక్కల బెడదకు సంబంధించి స్థారుూ సభ్యులు వాటిని పట్టుకుని, వాటికి స్టెరిలైజేషన్ చేయాలని స్పష్టమైన ఆదేశాలను జారీ చేసినా, అధికారులు మాత్రం అమలు చేయటం లేదు. అంతేగాక, ప్రతిరోజు డజన్ల కొద్ధీ కుక్కలను, కోతులను నగరంలోని వివిధ ప్రాంతాల్లో పట్టుకుని, వాటిని పాతబస్తీలోని బల్దియాకు చెందిన డాగ్ పాండ్, మంకీ పాండ్‌లలో ఉంచి, స్టెరిలైజేషన్ చేసి, తిరిగి వాటిని అడవుల్లో విడిచిపెడుతున్నామంటూ ఏటా అధికారులు లక్షల్లో బిల్లులు డ్రా చేస్తున్నారు.
వీటిలో ముఖ్యంగా కుక్కలను బల్దియాకు చెందిన వెటర్నరీ సిబ్బంది పట్టుకుంటున్నా, కోతులను పట్టుకునే వారిని ప్రత్యేకంగా రప్పించి ఒక్కో కోతికి చొప్పున వారికి ఛార్జీలు చెల్లిస్తున్నామంటూ లెక్కలు చూపుతూ, జేబులు నింపుకుంటున్నారు. అధికారులు నిజంగానే లక్షలాది రూపాయలు వెచ్చించి నెలకు వేల సంఖ్యలో కోతులను, కుక్కలను పట్టుకుని స్టెరిలైజేషన్ చేస్తే ప్రతిరోజు బల్దియా ప్రధాన కార్యాలయంలో డజన్ల కొద్ధీ కోతులు, కుక్కలు, పిల్లులు సంచరించేవా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. కొద్దిరోజుల క్రితం ఫేస్ టు ఫేస్ హాల్‌లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వచ్చి, అక్కడ తీవ్ర స్థాయిలో దుర్వాసన రావటాన్ని గమనించి, వెంటనే సమస్యను పరిష్కరించేందుకు పనులు చేపట్టాలని ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసిన కమిషనర్ ఇపుడు ప్రధాన కార్యాలయంలో రోజురోజుకి పెరిగిపోతున్న కుక్కలు, కోతల బెడదను నివారించేందుకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి!
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం పరిస్థితి పేరు గొప్ప
english title:
monkeys
Date:
Saturday, November 30, 2013