చాంద్రాయణగుట్ట, నవంబర్ 29: అక్రమ నీటి కనెక్షన్లు కలిగి ఉన్నట్లు తేలితే వెంటనే కనెక్షన్‌ను తొలగించి సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదు చేయాలని, సకాలంలో నీటి బిల్లులు చెల్లించని మొండి బకాయిదారులను గుర్తించి నోటీసులు జారీ చేసి వెంటనే కనెక్షన్‌ను తొలగించాలని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ జె.శ్యామలరావు ఆదేశాలు జారీ చేశారు. జలమండలి పరిధిలోని నీటి కనెక్షన్లు కల్గిన వారు తప్పకుండా మీటర్లు పెట్టుకోవాలని, లేనిపక్షంలో నోటీసులు జారీ చేసి కనెక్షన్‌ను తొలగించేందుకు సైతం వెనుకాడవద్దని ఎండి హుకుం జారీ చేశారు. జలమండలి పరిధిలోని మెయింటనెన్స్ విభాగానికి చెందిన అన్ని సర్కిళ్లు, డివిజన్ స్థాయి చీఫ్ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్‌లతో హైదర్‌నగర్‌లోని జలమండలి ఎంఎస్‌టిసి కాన్ఫరెన్స్ హాల్‌లో శుక్రవారం జరిగిన రెవెన్యూ సమీక్ష సమావేశం నిర్వహించారు. నీటి కనెక్షన్లకు సంబంధించి బహుళ అంతస్తుల కనెక్షన్లపై ఆధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. నీటి బిల్లులు చెల్లించనివారిపై కఠినంగా వ్యవహరించాలని, రెడ్ నోటీసులను జారీ చేస్తూ ఆర్‌ఆర్ యాక్ట్ కింద చర్యలు తీసుకోవాలని సూచించారు. జలమండలి పరిధిలోని అన్ని డివిజన్‌లలో ఉన్న నీటి కనెక్షన్లను డిప్యూటీ జనరల్ మేనేజర్, సెక్షన్ స్థాయి అధికారులు తనిఖీ చేసి మీటర్లు ఉన్నయ లేవా, ఉంటే అవి పనిచేస్తున్నాయా పరిశీలించి మీటర్లు లేనివాటికి నోటీసులు జారీ చేసి అవసరమైతే కనెక్షన్ తొలగించాలని ఆదేశించారు. ముందుగా ప్రతి వినియోగదారుడు నీటి మీటర్లు అమర్చుకునేలా వారిని చైతన్యవంతులను చేయాలని, సెక్షన్‌ల వారీగా స్పెషల్ డ్రైవ్‌లను నిర్వహించాలని అధికారులకు సూచించారు. సమీక్షా సమావేశంలో బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా.ఎం.జగన్‌మోహన్, టెక్నికల్, ఆపరేషన్స్, రెవెన్యూ, పర్సనల్ విభాగం డైరెక్టర్లు శెట్టిపల్లి ప్రభాకర్ శర్మ, పి.మనోహర్ బాబు, డా.పి.సత్యసూర్య నారాయణ, డి.సుందర రామిరెడ్డి పాల్గొన్నారు.
అత్యద్భుతం జెఎన్ ప్రసాద్ గాత్రం
ముషీరాబాద్, నవంబర్ 29: మైనె హుస్నా కా వాదా కియా, యె మహుబత్ కె ఫల్.. తదితర ఆనాటి ఆ పాత హిందీ సినీ గీతాలాపనలో ప్రఖ్యాత గాయకుడు జెఎన్ ప్రసాద్ (సౌత్ ఇండియన్ కిశోర్‌కుమార్) ఆహుతుల ప్రశంసలు అందుకున్నారు. తేజ అకాడమీ కల్చరల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం త్యాగరాయ గానసభ ఆడిటోరియంలో గ్రాండ్ మ్యుజికల్ నైట్ కార్యక్రమం జరిగింది. ‘యాదేన్ కిశోర్‌కి’ శీర్షికన జరిగిన కార్యక్రమంలో జెఎన్ ప్రసాద్ తనదైన గాత్రంతో మాధుర్య స్వరంతో ఆహుతులను మది దోచేశారు. కార్యక్రమంలో దేవిరెడ్డి వెంకట రమణారెడ్డి సమన్వయం చేశారు.
రచ్చబండ లబ్ధిదారులకు రేషన్‌కూపన్ల పంపిణీ
బాలానగర్, నవంబర్ 29: రెండో విడత రచ్చబండలో రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకొన్న లబ్ధిదారులకు మూడోవిడత రచ్చబండలో కూపన్లు పంపిణీ చేయగా మిగిలిన వాటిని తిరిగి పంపిణీ చేయనున్నట్టు బాలానగర్ పౌరసరఫరాల అధికారి కె.శ్రీనాథ్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ కూకట్‌పల్లి సర్కిల్‌లో 12890 రేషన్ కూపన్లకు లబ్ధిదారులను ఎంపిక చేయగా రచ్చబండకు 7077 మంది లబ్ధిదారులకు కూపన్లు ఇప్పటికే పంపిణీ చేశామన్నారు. మిగిలిన వారికి శుక్ర, శనివారం పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. జయనగర్, భరత్‌నగర్ లైబ్రరీ భవనంలో, బాలానగర్ గ్రంథాలయ భవనంలో, కెపిహెచ్‌కాలనీ రమ్యగ్రౌండ్ కార్యాలయంలో, భరత్‌నగర్ లైబ్రరీ హస్మత్‌పేట్ వార్డు కార్యాలయంలో అందజేస్తున్నట్లు తెలిపారు.