నక్కలగుట్ట, డిసెంబర్ 1: తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను వ్యూహాత్మకంగా కాంగ్రెసే అడ్డుకుంటోందని బిజెపి జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు ధ్వజమెత్తారు. ఆదివారం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సిడబ్ల్యుసిలో హైదరాబాద్‌తో కూడిన 10జిల్లాల తెలంగాణపై నిర్ణయం తీసుకున్నామని చెప్పి, ఇప్పుడు రాయల తెలంగాణ అని లీకులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తెలంగాణపై నిర్ణయం జరిగిపోయిందని చెబుతుంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు సమైక్యాన్ని కోరుతున్నామని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరితో రాష్ట్ర ప్రజలు అయోమయంలో పడ్డారని అన్నారు. ఈ ద్వంద్వ వైఖరి వ్యూహరచన ఢిల్లీలో సోనియాగాంధీ నేతృత్వంలోనే జరుగుతుందని తెలిపారు. సందిగ్ధ పరిస్థితులను కల్పించి తెలంగాణను అడ్డుకునే ప్రయత్నం కాంగ్రెస్‌లోని ఢిల్లీ పెద్దలే చేస్తున్నారని విమర్శించారు. సిడబ్ల్యుసి నిర్ణయాన్ని అమలు చేయలేని, చేతకాని, చావురాని పార్టీ కాంగ్రెస్ అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ తెలంగాణ నాయకులు తెలివి ఉంటే తెలంగాణకోసం త్యాగం చేసిన 1200మంది త్యాగమూర్తులకు గుడి కట్టాలని తెలిపారు. సోనియాగాంధీ బతికి ఉండి వీరి చావుకు కారణమయిందని అన్నారు. ఢిల్లీలో అన్ని పార్టీలు తమ అభిప్రాయాలను చెప్పినందున, ప్రజల మనోభావాలు వెల్లడయినందున తక్షణమే యుద్ధప్రాతిపదికన తెలంగాణ బిల్లును పార్లమెంటులో పెట్టాలని డిమాండ్ చేశారు. భద్రాచలం లేని తెలంగాణను, రాయల తెలంగాణను బిజెపి వ్యతిరేకిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈనెల 20వ తేదీలోగా తెలంగాణ బిల్లు పార్లమెంటులో పెట్టకపోతే కాంగ్రెస్ పార్టీ, బిల్లు రాకుండా చేసిన తెలుగుదేశం పార్టీలు తెలంగాణలో కనుమరుగు అవుతాయని బిజెపి అధికార ప్రతినిధి నరహరి వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా ఈనెల 29వ తేదీన వరంగల్‌లో దళిత సదస్సును, జనవరి ఐదవ తేదీన మానుకోటలో గిరిజన సదస్సులను నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామని ఎడ్ల అశోక్‌రెడ్డి చెప్పారు.
* బిజెపి నేతల మండిపాటు
english title:
bjp
Date:
Monday, December 2, 2013