న్యూఢిల్లీ, డిసెంబర్ 3: మైనారిటీలకు దాడులనుంచి రక్షణ కల్పించే ఉద్దేశంతో తీసుకు రావాలనుకుంటున్న వివాదాస్పద మతహింస నిరోధక బిల్లును గురువారంనుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టడానికి ముందే కాంగ్రెసేతర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటుగా ప్రధాన ప్రతిపక్షమైన బిజెపి తీవ్రంగా వ్యతిరేకిస్తుండడంతో ఆదిలోనే చుక్కెదురైనట్లయింది. ప్రతిపాదిత బిల్లుపై ఏకాభిప్రాయాన్ని సాధించే ప్రభుత్వ యత్నంలో భాగంగా హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ఆదేశాల మేరకు హోం కార్యదర్శి అనిల్ గోస్వామి మంగళవారం అన్ని రాష్ట్రాల హోం కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేసారు. బిల్లులోని వివిధ నిబంధనలపై కాంగ్రెసేతర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు మంగళవారం తీవ్ర అభ్యతరం తెలియజేసారు. బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా ఉన్నాయి. మత పరమైన లేదా భాషాపరమైన మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీలను లక్ష్యంగా చేసుకుని మూకుమ్మడి దాడులకు పాల్పడడాన్ని అరికట్టడానికి నిష్పాక్షికంగా, విచక్షణకు తావు లేని విధంగా తమ అధికారాలను ఉపయోగించని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపైన, వాటి అధికారులపై జరిమానాలను విధించడానికి ఈ బిల్లును ప్రతిపాదించారు. అలాగే ఈ చట్టం కింద లభించిన అధికారాలను ఉపయోగించుకోవడానికి, నిర్దేశించిన విధులను నిర్వర్తించడానికి మత సామరస్యం, న్యాయం, సన్నాహం కోసం ఒక జాతీయ అథారిటీని కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. అయితే ఇలాంటి పర్యవేక్షక అథారిటీని ఏర్పాటు చేయడాన్ని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి.
మైనారిటీలకు దాడులనుంచి రక్షణ కల్పించే ఉద్దేశంతో
english title:
bill
Date:
Wednesday, December 4, 2013