ముంబయి, డిసెంబర్ 3: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ప్రజల మద్దతు పుష్కలంగా ఉన్నట్టు స్పష్టమైంది. ఎల్‌జి పీపుల్స్ చాయిస్ అవార్డును అందుకున్నాడు. 2010లో ఈ అవార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెండూల్కర్‌కు లభించగా, 2011, 2012 సంవత్సరాల్లో శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర గెల్చుకున్నాడు. పీపుల్స్ చాయిస్ అవార్డుకు ఎంపికైన క్రికెటర్లలో మూడోవాడిగా, భారతీయుల్లో రెండో వాడిగా ధోనీ గుర్తింపు సంపాదించాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ మైఖేల్ క్లార్క్, ఇంగ్లాండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్, దక్షిణాఫ్రికా క్రికెటర్ ఎబి డివిలియర్స్, భారత యువ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ ఈ అవార్డు కోసం తీవ్రంగా పోటీపడినప్పటికీ, ధోనీ వైపే ఎక్కువ మంది మొగ్గు చూపారు. ధోనీ ప్రస్తుతం దక్షిణాఫ్రికా టూర్‌లో ఉన్నందున, ఎల్‌జి ఎలట్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్ డైరెక్టర్ హోమ్ ఎంటర్‌టైనె్మంట్ హొవార్డ్ లీ నుంచి అతని తరఫున భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) కార్యదర్శి సంజయ్ పటేల్ అవార్డును స్వీకరించాడు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 1,88,000 మంది క్రికెట్ అభిమానులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. పలువురు క్రికెటర్ల పేర్లు పరిశీలనకురాగా, భారత మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే నాయకత్వంలోని ప్యానెల్ ఐదుగురి పేర్లను ఖాయం చేసింది. ఈ ప్యానెల్‌లో అలెక్ స్టివార్ట్ (ఇంగ్లాండ్), కాథెరిన్ క్యాంప్‌బెల్ (న్యూజిలాండ్), వకార్ యూనిస్ (పాకిస్తాన్), గ్రేమ్ పొలాక్ (దక్షిణాఫ్రికా) సభ్యులుగా వ్యవహరించారు. ప్రతిపాదనకు వచ్చిన పేర్లను పరిశీలించి, ఆయా క్రికెటర్ల ప్రతిభ ప్రాతిపదిక మీద ధోనీ, క్లార్క్, కోహ్లీ, అలిస్టర్ కుక్, ఎబి డివిలియర్స్ పేర్లను ఖాయం చేశారు. ఈ ఐదుగురి మధ్య జరిగిన పోటీలో ఎక్కువ ఓట్లు ధోనీకి లభించాయి.
ఎల్‌జి పీపుల్స్ చాయిస్ అవార్డుకు ఎంపిక
english title:
people's choice
Date:
Wednesday, December 4, 2013