కరాచీ, డిసెంబర్ 3: మాజీ క్రికెటర్లు మహమ్మద్ యూసుఫ్, షోయబ్ అక్తర్ తనపై చేసిన విమర్శలను పట్టించుకోనని, వారు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా స్పందించాల్సిన అవసరం తనకు లేదని పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షహీద్ అఫ్రిదీ స్పష్టం చేశాడు. యూసుఫ్, అక్తర్‌లను అతను కార్టూన్ పాత్రలు ‘హెకెల్ అండ్ జెకెల్’తో పోల్చాడు. దక్షిణాఫ్రికా టూర్‌లో పాకిస్తాన్ జట్టు, ప్రత్యేకించి అఫ్రిదీ వైఫల్యాలను ఎండగడుతూ యూసుఫ్, అక్తర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అఫ్రిదీని జట్టుకు ఏమాత్రం ఉపయోగం లేని భారంగా పేర్కొన్నారు. అతను తక్షణమే జట్టు నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. కెప్టెన్ మిస్బా ఉల్ హక్‌కు వ్యతిరేకంగా ఆటగాళ్లను కూడగట్టుకొని, పాక్ జట్టులో క్రీడాస్ఫూర్తిని, ఐకమత్యాన్ని దెబ్బతీస్తున్నాడని ఆరోపించారు. కాగా, ఈ విమర్శలను తాను లక్ష్యపెట్టనని మంగళవారం విలేఖరులతో మాట్లాడుతూ అఫ్రిదీ స్పష్టం చేశాడు. ఏం మాట్లాడుతున్నారో తెలియని స్థితిలో ఉన్న వ్యక్తులు చేసే విమర్శలకు, వ్యాఖ్యలకు విలువ ఉండదని అన్నాడు. వారివి పిల్ల చేష్టలని, వాటి గురించి ఎక్కువగా ఆలోచించడం వృథా అని అన్నాడు.
టి-20లోనూ ఆడాలని ఉంది: మిస్బా
యువ ఆటగాళ్లకు అవకాశం లభించాలన్న ఉద్దేశంతోనే తాను టి-20ల నుంచి వైదొలిగానని, అయితే, ఇప్పటికీ ఆ ఫార్మెట్‌లో ఆడాలన్న ఉత్సాహం తనలో ఉందని పాకిస్తాన్ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ తెలిపాడు. దేశవాళీ పోటీల్లో తాను ఇప్పటికీ టి-20 మ్యాచ్‌లు ఆడుతున్నానని అన్నాడు. సెలక్టర్లు అవకాశం ఇస్తే, ఈ ఫార్మెట్‌లో మళ్లీ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. తనపై నమ్మకం ఉంచి, నాయకత్వ బాధ్యతలను అప్పగించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారులకు అతను కృతజ్ఞతలు తెలిపాడు. కొంత మంది మాజీ క్రీడాకారులకు తనపై చేసిన విమర్శలపై స్పందించడానికి మిస్బా నిరాకరించాడు. పాక్ జట్టుకు శక్తివంచన లేకుండా ఉత్తమ సేవలు అందించడమే తన లక్ష్యమని, ఈ క్రమంలో ఎవరేమన్నా తాను పట్టించుకోనని చెప్పాడు.
యూసుఫ్, అక్తర్ విమర్శలపై అఫ్రిదీ
english title:
afridi
Date:
Wednesday, December 4, 2013