కళ్యాణదుర్గం, డిసెంబర్ 11: కుటుంబ కలహాల నేపధ్యంలో ఓ తల్లి పిల్లలపై కిరోసిన్‌పోసి నిప్పంటించి తానూ ఆత్మహత్యకు పాల్పడింది. ఓ పాప తప్పించుకుని పారిపోగా మరో ఇద్దరు పిల్లలు మృతి చెందారు. తల్లి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ సంఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో బుధవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కళ్యాణదుర్గం పట్టణంలోని వడ్డేకాలనీకి చెందిన నాగరాజు, భార్య శోభ దంపతులకు ముగ్గురు పిల్లలు. శోభను అత్తింటివారు తరచూ వేధించేవారని తెలుస్తోంది. మంగళవారం రాత్రి అత్త శోభను కొట్టినట్టు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో బుధవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో అంతా బయటకు వెళ్లినపుడు శోభ తన ముగ్గురు పిల్లలు హరిణి(6), ఐశ్వర్య(4), శ్రీనివాసులు(15 నెలలు)పై కిరోసిన్ పోసి తానూ పోసుకుని నిప్పంటించింది. వెంటనే తేరుకున్న ఐశ్వర్య కేకలు వేస్తూ బయటికి పరుగు తీయడంతో ప్రాణాలతో బయటపడింది. మంటల్లో చిక్కుకుని హరిణి అక్కడికక్కడే మృతి చెందగా శోభ(28), శ్రీనివాసులు(4) తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉండడంతో బెంగళూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో శ్రీనివాసులు మృతి చెందాడు. శోభ పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఎసిబి వలలో జివిఎంసి ఇఇ
విశాఖపట్నం, డిసెంబర్ 11: కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ మహావిశాఖ నగరపాలక సంస్థ (జివిఎంసి) తాగునీటి విభాగానికి చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఒకరు బుధవారం ఎసిబి అధికారులకు పట్టుబడ్డారు. బిల్లు చెల్లించేందుకు రూ 80వేలు లంచం డిమాండ్ చేసి, తొలి విడతగా రూ 30 వేలు తన కింద పనిచేస్తున్న ఉద్యోగి ద్వారా తీసుకున్న ఇఇ పివివి సత్యనారాణరాజును ఎసిబి అధికారులు బుధవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎసిబి అధికారుల కథనం ప్రకారం.. జివిఎంసి తాగునీటి సరఫరా విభాగంలో జి శ్రీనివాస్ సివిల్ కాంట్రాక్టు పనులు చేస్తుంటారు. రూ 20.8 లక్షల పనులను పూర్తి చేసినప్పటికీ, బిల్లు మొత్తంలో 4 శాతం లంచంగా డిమాండ్ చేయడంతో పాటు తొలివిడతగా 30 వేల రూపాయలు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ ఇఇ సత్యనారాయణరాజు డిమాండ్ చేశారు. దీంతో కాంట్రాక్టర్ శ్రీనివాస్ ఎసిబి అధికారులకు ఆశ్రయించాడు. ఎసిబి అధికారులు రూపొందించిన పథకం ప్రకారం లంచం సొమ్మును అదే విభాగంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఎం అప్పలరాజుకు బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో కాంట్రాక్టర్ శ్రీనివాస్ అందజేస్తుండగా పట్టుకున్నారు. అప్పలరాజు వాంగ్మూలం మేరకు ఇఇ సత్యనారాయణ రాజుపై కూడా కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. నిందితులను గురువారం న్యాయస్థానం ఎదుట హాజరుపరచనున్నట్టు ఎసిబి డిఎస్పీ నరసింహరావు తెలిపారు.
కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెనుముప్పు
ఆలేరు, డిసెంబర్ 11: సికిందరాబాద్-కాజీపేట్ జంక్షన్ల మధ్య గల ఆలేరు రైల్వే స్టేషన్ సమీపంలో కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలు బుధవారం ఉదయం పెను ప్రమాదం నుండి బయటపడింది. వివరాల్లోకి వెళ్తే 17406 నెంబర్ గల ఆదిలాబాద్ - తిరుపతి వెళ్తున్న కృష్ణా ఎక్స్‌ప్రెస్ ఆలేరు రైల్వే స్టేషన్ నుండి కాజీపేట వైపు వెళ్లే సమయంలో ఆలేరు స్టేషన్‌కు అతి సమీపంలో సాంకేతిక లోపంతో ఇంజన్ నుండి బోగీలు విడిపోయాయి. ఆ సమయంలో తక్కువ వేగంలో వెళ్తున్న కృష్ణా ఎక్స్‌ప్రెస్ నుండి పెద్ద శబ్ధం రాగానే డ్రైవర్ చాకచక్యంతో ట్రెన్‌ను అదుపులోకి తీసుకువచ్చాడు. వెనువెంటనే డ్రైవర్ సంబంధిత రైల్వే అధికారుల సహాయంతో బోగిలను ఇంజన్‌కు అమర్చుకొని తీసుకెళ్లాడు.
16 నుండి దేశవ్యాప్తంగా తిరుప్పావై ప్రవచనాలు
తిరుపతి, డిసెంబర్ 11: ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ఈనెల 16 నుండి జనవరి 14 వరకు టిటిడి ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 213 ప్రముఖ ఆలయాల్లో తిరుప్పావై ప్రవచనాలు నిర్వహిస్తున్నట్లు టిటిడి పిఆర్‌ఒ టి.రవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ పండితులతో ధార్మికోపన్యాసాలు కూడా నిర్వహిస్తారన్నారు. మహావిష్ణువును స్తుతిస్తూ 30 పాటలను ఈ తిరుప్పావై ప్రవచనాలలో ఆలపిస్తారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో రోజూ ఉదయం 6.30 గంటల నండి 8 గంటల వరకు ప్రొఫెసర్ లక్ష్మి తిరుప్పావై ప్రవచనాలను గానం చేస్తారన్నారు. తిరుపతిలోని వరదరాజస్వామి ఆలయంలోనూ, పద్మావతీపురంలోని రామాలయంలోనూ, తొండవాడలోని అగస్తీశ్వర స్వామి ఆలయంలోనూ ఈ ప్రవచనాలను వినిపిస్తారన్నారు. జనవరి 14న అన్నమాచార్య కళామందిర్‌లో గోదా కల్యాణం జరుగుతుందన్నారు.
వాయుగుండంగా మారనున్న ‘మాది’
విశాఖపట్నం, డిసెంబర్ 11: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన పెను తుపాను ‘మాది’ మరింత బలహీనపడి బుధవారం సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా మారి, రానున్న 12గంటల్లో వాయుగుండంగా మారుతుందని విశాఖపట్నంలోని వాతావరణ హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ఇది మచిలీపట్నాకి ఆగ్నేయంగా 400 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపారు. నైరుతి దిశగా పయనిస్తూ మరింత బలహీన పడే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాలో ఒకటి రెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
రూ. 90 లక్షల విలువైన ఎర్రచందనం పట్టివేత
పీలేరు, డిసెంబర్ 11: తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్న దాదాపు 90 లక్షల విలువైన ఎర్రచందనాన్ని అటవీ శాఖ అధికారులు బుధవారం పట్టుకున్నారు. చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట - మంగళం పేట మధ్యలో అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న ముఠాపై గాండ్లపల్లి దగ్గర అటవీ శాఖ అధికారులు దాడులు నిర్వహించి పట్టుకున్నారని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ డిఎన్‌కె ప్రసాద్ తెలిపారు. ఈ దాడుల్లో ఎఫ్‌ఎస్‌ఓ మునికృష్ణమరాజు, ప్రొడక్షన్ వాచర్లు పాల్గొన్నారన్నారు.
* ఇద్దరు చిన్నారుల మృతి
english title:
kids die
Date:
Thursday, December 12, 2013