ఒంగోలు, డిసెంబర్ 11: అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణా బిల్లును అడ్డుకుంటామని వైఎస్‌ఆర్‌సిపి చీఫ్ విప్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఇక్కడ విలేఖరులతో ఆయన మాట్లాడుతూ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సమైక్యవాదా లేక విభజనవాదా అన్నది స్పష్టం చేయాలన్నారు. టిడిపి ఎంపీలు ఢిల్లీలో సమైక్యాంధ్రాకు మద్దతు ప్రకటిస్తుంటే చంద్రబాబు నాయుడు మాత్రం సమన్యాయమని అనడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. కేంద్రంలో పార్టీలకు అతీతంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడటం శుభపరిణామమన్నారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇవ్వడంతో కాంగ్రెస్ అధినాయకత్వం ఆత్మ పరిశీలనలో పడిందన్నారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కొంతమంది ఎంపీలు అవిశ్వాసానికి దూరంగా ఉన్నారని, అలాంటి వారు చరిత్ర హీనులుగా మిగిలిపోతారన్నారు.
ఎవరెన్ని కుట్రలు చేసినా సమైక్యంగానే రాష్ట్రం
* నారా లోకేష్
తిరుపతి, డిసెంబర్ 11: ఎవరెన్ని కుట్రలు చేసినా రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని, చంద్రబాబు హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని నారా లోకేష్ అన్నారు. బుధవారం తిరుపతి వచ్చిన ఆయన యువతతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని యువత ప్రస్తుతం టిడిపి వైపు చూస్తోందన్నారు. చంద్రబాబు అయితేనే రాష్ట్రంలో పాలన సవ్యంగా సాగుతుందని యువత నమ్ముతోందన్నారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందన్నారు. టిడిపి హయాంలోనే హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు లభించిందన్నారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో చరిత్రాత్మక పాలన సాగుతుందన్నారు. టిడిపి ఎప్పుడూ ఒక విజన్‌తో పని చేస్తుందని, కాంగ్రెస్ మాత్రం రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలా అని ఆలోచిస్తుందన్నారు. టిడిపిది విజన్ 2020 అయితే జగన్‌ది విజన్ 420 అన్నారు. జగన్‌తో కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తోందని, ఈ విషయాలన్నీ ప్రజలు గ్రహించారన్నారు. రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన యువత యుపికి అఖిలేష్.. ఏపికి లోకేష్ అంటూ నినాదాలు చేశారు.