విశాఖపట్నం, డిసెంబర్ 11: రాష్ట్ర విభజన విషయంలో ప్రజాభీష్టానికి కట్టుబడి వ్యవహరిస్తామని దేవాదాయశాఖ మంత్రి సి రామచంద్రయ్య స్పష్టం చేశారు. సింహాచలం దేవస్థానంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో బుధవారం పాల్గొన్న ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన బిల్లును అసెంబ్లీలో వ్యతిరేకించి తీరుతామని ఉద్ఘాటించారు. దీనిపై ఇప్పటికే కాంగ్రెస్ వర్గాలు ఒక నిర్ణయానికి వచ్చాయన్నారు. విభజన విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం అనుసరించిన విధానం సరిగాలేదని ఆయన అన్నారు. అటు ప్రజాభీష్టానికి ఇటు పార్టీ నిర్ణయానికి మధ్య కేడర్ నలిగిపోతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజల మనోభావాలకు అనుగుణంగానే రాజకీయ పార్టీలు, నాయకులు పనిచేయాల్సి ఉందని అన్నారు. ఈకారణంగానే విభజన బిల్లుకు వ్యతిరేకంగా తాము ముందుకు వెళ్తామన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై మాట్లాడుతూ గెలుపోటములు సహజమని అన్నారు. ఈ ఎన్నికల్లో ఓటమితో కాంగ్రెస్ పనైపోయిందని భావించాల్సిన పనిలేదన్నారు.
ఇక దేవాదాయశాఖపై ప్రభుత్వం ఉదాశీనంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ప్రాధాన్యత లేని విభాగంగా దేవాదాయశాఖను చూస్తున్నారన్నారు. దేవస్థానాల్లోను, దేవాదాయశాఖలోను పోస్టుల భర్తీ ఎంతోకాలంగా నిలిచిపోయిందన్నారు. పోస్టులు భర్తీ కాకపోవడం వల్ల పర్యవేక్షణ కొరవడుతోందన్నారు. పోస్టుల భర్తీపై ప్రభుత్వ ఆంక్షలున్నందున చర్యలు తీసుకోలేకపోతున్నామన్నారు.
విభజన బిల్లును అడ్డుకుంటాం * మంత్రి రామచంద్రయ్య స్పష్టీకరణ
english title:
ramachandraiah
Date:
Thursday, December 12, 2013