ఆకివీడు, డిసెంబర్ 11: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ సీమాంధ్రలో ఆందోళనలు జోరందుకున్నాయ. పశ్చిమ గోదావరి జిల్లాలో వినూత్న నిరసనలతో నిత్యం వార్తల్లో కొనసాగే ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు బుధవారం మరో వినూత్న నిరసన చేపట్టారు. సమైక్య నినాదాన్ని చాటుతూ 35 అడుగుల ఎత్తున్న కాటన్ స్థూపంపై ఒంటి కాలిపై నిలబడి నిరసన తెలిపారు. మూడు గంటల పాటు నిరసన కొనసాగిన అనంతరం పోలీసులు ఎమ్మెల్యేను వారించి ఆందోళనకు తెరదించారు. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల సరిహద్దుప్రాంతమైన ఉప్పుటేరు వంతెన సమీపంలో ఉన్న కాటన్ పార్కులో ఈ ఆందోళన జరగడంతో కృష్ణా జిల్లా కైకలూరు ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ వచ్చి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
‘కృష్ణా’లో ట్రాక్టర్ల సమైక్య ప్రదర్శన
మచిలీపట్నం: కృష్ణా జిల్లాలో బుధవారం పలుచోట్ల ట్రాక్టర్లతో భారీగా ర్యాలీలు నిర్వహించి నిరసన తెలిపారు. మైలవరం నియోజకవర్గ వైకాపా కన్వీనర్లు జోగి రమేష్, జ్యేష్ఠ రమేష్‌బాబు ఆధ్వర్యంలో వేర్వేరుగా భారీ ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. అవనిగడ్డ నియోజకవర్గంలో యాసం చిట్టిబాబు ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన, సింహాద్రి రమేష్ ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో ప్రదర్శన జరిపారు. కంచికచర్ల, కైకలూరులో కూడా రైతులు ట్రాక్టర్లతో భారీ ప్రదర్శన చేశారు. నూజివీడులో విద్యార్థులు మానవహారం ఏర్పాటు చేయగా, కలిదిండి మండలంలో సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
గుంటూరులో..
గుంటూరు: సమైక్యాంధ్రను కోరుతూ వైసిపి రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం గుంటూరు నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నగర కమిటీ కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్తలు షేక్ షౌకత్, నసీర్ అహమ్మద్ నేతృత్వంలో ఈ ర్యాలీ జరిగింది. బ్రహ్మానందరెడ్డి స్టేడియం నుండి లాడ్జిసెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు బైకులు నడుపుతూ సమైక్యాంధ్ర మద్దతుగా నినాదాలు చేశారు. డప్పు వాయిద్యాలతో నగర వీధుల గుండా ప్రదర్శన నిర్వహించారు. అలాగే గురువారం రహదారుల దిగ్బంధన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.
కడపలో కదం తొక్కిన రైతులు
కడప: సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా వైకాపా అధిష్ఠానం ఇచ్చిన పిలుపు మేరకు రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీతో కడప జిల్లా మోత మోగింది. ప్రొద్దుటూరు, కడప, బద్వేల్, రాజంపేట, రైల్వేకోడూరు తదితర అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ట్రాక్టర్ ర్యాలీలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున నియోజకవర్గ కేంద్రాలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా విభజనతో రైతాంగానికి జరిగే తీవ్ర నష్టాలను వైకాపా నేతలు ఏకరువు పెట్టారు. ఇదిలావుండగా జెఎసి ఆధ్వర్యంలో కడప, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో ఉద్యోగులు చేపట్టిన సమైక్య దీక్షలు కొనసాగుతున్నాయి. వైకాపా ఆధ్వర్యంలో పలు చోట్ల నిరసన ప్రదర్శనలు జరిగాయి.
(చిత్రం) కాటన్ స్థూపంపై ఒంటి కాలిపై నిలబడి నిరసన తెలుపుతున్న ఉండి ఎమ్మెల్యే శివరామరాజు
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ సీమాంధ్రలో ఆందోళనలు
english title:
jorugaa
Date:
Thursday, December 12, 2013