విశాఖపట్నం, డిసెంబర్ 11: పార్టీలో ఉంటూ అధిష్ఠానాన్ని ధిక్కరించే ధోరణిలో వ్యాఖ్యలు చేయడం క్రమశిక్షణ ఉల్లంఘన కిందకే వస్తుందని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి పి బాలరాజు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీపై అనంతరపురం జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జెసి దివాకరరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. విశాఖ నగరంలో బుధవారం బాలరాజు విలేఖరులతో మాట్లాడుతూ నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి అనంతరం జెసి వ్యాఖ్యలు సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ పనైపోయింది.. అధినేత్రి సోనియాగాంధీ తప్పుకోవాలంటూ జెసి వాఖ్యానించడం క్రమశిక్షణ రాహిత్యమే అవుతుందన్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ అధిష్ఠానాన్ని, పార్టీ నేతలను విమర్శించాలనుకుంటే, పార్టీని విడిచిపెట్టి బయటకు వెళ్లి మాట్లాడాలన్నారు. పార్టీలో ఉండడం ఇబ్బందికరంగా ఉంటే, వేరే దారి చూసుకోవాలన్నారు. పిసిసి అధ్యక్షునిపై విమర్శలు చేయడం ఎంతమాత్రం తగదన్నారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారు ఎంతటి వారైనా వారిపై చర్యలు తీసుకోవలసిందేనన్నారు. పార్టీ తరపున పోటీచేసి గెలుపొంది పదవులు పొందిన వారంతా ఇప్పుడు పార్టీ నిర్ణయాలను, అధినేత్రిని ధిక్కరించే విధంగా మాట్లాడటం క్షమార్హం కాదన్నారు. వీరిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి పాలైనంతమాత్రాన కాంగ్రెస్ పని అయిపోయినట్టుగా భావించరాదన్నారు. గతంలో ఇటువంటి ఓటములు ఎదురైనప్పటికీ పార్టీ తిరిగి సత్తాచాటిన సందర్భాలెన్నో ఉన్నాయన్నారు. ఓటమికి కారణాలు అనే్వషించుకుంటూనే భవిష్యత్‌లో సాధించాల్సిన విజయాలకు పక్కా ప్రణాళిక రూపొందించుకుంటామని అన్నారు. రాష్ట్ర విభజన అంశానికి సంబంధించి తన అభిప్రాయాలను అసెంబ్లీలో చర్చ సందర్భంగా వెల్లడిస్తానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
జెసి వ్యాఖ్యలపై మంత్రి బాలరాజు ఆగ్రహం
english title:
balaraju
Date:
Thursday, December 12, 2013