రాజమండ్రి, డిసెంబర్ 11: రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం వ్యవహరిస్తున్న తీరును జీర్ణించుకోలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఉండవల్లి అరుణ్‌కుమార్ ఇక ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజనకు అనుకూలంగా సిడబ్ల్యుసి తీర్మానం చేసిన తరువాత ప్రజాభీష్టం మేరకు లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన తెలంగాణ నోట్‌పై కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసినపుడు తీవ్ర మనస్తాపానికి గురై పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన సంగతి విదితమే. అప్పటి నుండి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ, ఢిల్లీలోనే మకాం చేసి, రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు సీమాంధ్ర ఎంపిలతో కలిసి సమాలోచనలు సాగిస్తున్న ఉండవల్లి, అనూహ్యంగా ఆరుగురు సీమాంధ్ర ఎంపిలతో కలిసి అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభ స్పీకర్‌కు నోటీసు ఇచ్చారు. క్రమశిక్షణ గల కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడని ఉండవల్లి ఇంతగా తెగించటం పార్టీ వర్గాలతో పాటు, ఇతర రాజకీయ వర్గాలకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. అవిశ్వాసం నోటీసు ఇచ్చిన కాంగ్రెస్ ఎంపిలపై ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారన్న వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో, అసలు ఉండవల్లి రాజకీయ భవిష్యత్తేమిటి? ఆయన వ్యూహమేమిటన్న అంశంపైనే సర్వత్రా చర్చ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయటం లేదా బహిష్కరించటం వంటి చర్యలను ఎదుర్కోక తప్పని పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ఉండవల్లిపైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.
అధిష్ఠానం ఆగ్రహంతో ఉన్నా లేక కఠిన చర్యలు తీసుకున్నాగానీ, అన్నింటినీ ఎదుర్కొనేందుకు సిద్ధపడిన ఉండవల్లి తీరు చూస్తుంటే, భవిష్యత్తులో ఇక ప్రత్యక్ష రాజకీయాలకు ఆయన గుడ్‌బై చెబుతారని తెలుస్తోంది. ఏ రాజకీయ పార్టీలోను చేరకుండా, ఎన్నికల్లో పోటీచేయకుండా రాజకీయాలకు దూరంగా ఉండాలన్న మనసులోని మాటను ఇప్పటికే తన సన్నిహితుల వద్ద ఉండవల్లి చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర విభజన పరిణామాలు చోటుచేసుకున్నాయి. దాంతో ఏకంగా రాజకీయాలకే దూరంగా ఉండాలన్న నిర్ణయానికి ఉండవల్లి వచ్చారు. అందుకే రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కూడా కాదన్న తెగింపునకు వచ్చారు. ఆ తెగింపుతోనే యుపిఎ ప్రభుత్వంపై అవిశ్వాస నోటీసును ఇచ్చారు. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు చివరి క్షణం వరకు పోరాడతానన్న ఉండవల్లి, ఎవరూ ఊహించని విధంగా అవిశ్వాస నోటీసును ఇచ్చారు. ఇంత కాలం నోరు మెదపకుండా ఉన్న ఆయన, వ్యూహాత్మకంగా నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పొందిన సమయంలో అదును చూసుకుని మిగిలిన ఎంపిలతో కలిసి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు. సీమాంధ్రకు చెందిన ప్రతిపక్ష పార్టీలు ఎవరూ చేయని సాహసాన్ని చేయటం ద్వారా ఇంత కాలం పోగొట్టుకున్న ప్రజామద్దతును ఇపుడు మళ్లీ కూడగట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకున్నా ఉండవల్లికి ఏమీ నష్టం లేదు.
అందుకే ఇంత తెగింపు
english title:
undavalli
Date:
Thursday, December 12, 2013