జహీరాబాద్ , డిసెంబర్ 11: హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కాశీ జగద్గురు డాక్టర్ చంద్రశేఖర శివాచార్య మహాస్వామి పిలుపు నిచ్చారు. జహీరాబాద్‌లోని బాగారెడ్డి స్టేడియంలో బుధవారం విశ్వమానవ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన అధ్యాత్నిక సభలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసం గించారు. 30 కుల సంఘాలు ఓకే చోట కలవడం సంతోషకర మన్నారు. ప్రజలు దేశ సంస్కృతిని గౌరవించాలన్నారు. దేశ సంస్కృతు లన్నింటిలో భారత దేశానిదే శ్రేష్టమైనదన్నారు. ప్రతి వ్యక్తి ధర్మ రక్షణకు పాటు పడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మన దేశంలో అనేక కుల మతాలున్నా, భగవంతుడిని వివిధ రూపాల్లో భిన్న రకాలుగా కొలిచినా దేవుడు ఒక్కడేనన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించా లన్నారు. సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయని వాటన్నింటిలో మానవ జన్మ ఉత్కృష్టమైన దన్నారు. మనిషి మనిషిలా ప్రవర్తించాలేకాని పశువులా కాదన్నారు. ప్రాచీన వ్యవస్థను మార్పుచేయడం కోసమే మఠాలు, సాధు, సంతులున్నారన్నారు. ఎన్ని సంపద లున్నా ఆధ్యాత్మిక చింతనతోనే శాంతి చేకూరుతుం దన్నారు. పాపాలు చేస్తే నరకం, పుణ్యాలు చేసిన వారు స్వర్గాన్ని పొందుతారన్నారు. మానవ జన్మను సార్థకం చేసుకోవాలన్నారు. డాక్టర్ సిద్దేశ్వర స్వామి మాట్లా డుతూ, కాశీకి పోయినా కాశీ జగద్గురువు కనిపించక పోవచ్చుకాని ఆయనే ఇప్పుడు స్థానికులకు దర్శన మివ్వడం పూర్వజన్మ సుకృతమన్నారు. సత్యంలేని ధర్మం లేదన్నారు. మానవులంతా సమానులేనని, ఒకురు గొప్ప, ఒక్కరు తక్కువ ఎన్నటికి కాదన్నారు. పరమాత్ముడిని చేరుకునేందుకు పాప పుణ్యాలే కారణంకాని మతాలు కాదన్నారు. ఓంకారేశ్వర పీఠాధి పతి దక్షిణామూర్తి దీక్షితులు మాట్లాడుతూ, మనిషి ఆత్మలోనే పరమాత్మ ఉన్నాడన్నారు. అందరూ ఒక్కటై ధర్మాన్ని పరిరక్షించుకోవాలన్నారు. కార్యక్రమంలో గంగాధర శివాచార్య మల్కేడ్, నీరకంఠ శివాచార్య స్వామి పెద్ద మఠం సదాశివపేట, కాశీనాథ్ శివాచార్య బేమళ్‌ఖేడ్ (కర్ణాటక), వీరేశ్వర శివాచార్య స్వామి హిరేమఠ్ ధనాసిరి, రాజశేఖర శివాచార్య గోర్టా (కర్ణాటక), దేవగిరి మహారాజ్ ముంగి, మఠం రాచయ్య స్వామి ధనాసిరి, ప్రముఖులు సాయిరెడ్డి విఠల్‌రెడ్డి, అల్లాడి వీరేశంగుప్తా, అవధూతగిరి మహారాజ్ ఈ ప్రాంతానికి చెందిన 38 కులసంఘాల నాయకులు, విద్యార్థులు, భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాశీ జగద్గురువును పట్టణ ప్రముఖులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం జగద్గురు వివిధ సంఘాల నాయకులు, పట్టణ ప్రముఖులను సన్మానించారు.
కాశీ జగద్గురు చంద్రశేఖర శివాచార్య పిలుపు
english title:
dharma rakshana
Date:
Thursday, December 12, 2013