కురుపాం, డిసెంబర్ 11: ప్రసవం కోసం ప్రభుత్వాసుపత్రిలో చేరిన ఒక మహిళ, బయటకు వెళ్లి రోడ్డుపై ప్రసవించిన సంఘటన విజయనగరం జిల్లా కురుపాంలో జరిగింది. స్థానికులు, బంధువులు అందించిన వివరాల ప్రకారం కొమరాడ మండల మర్రిగూడకు చెందిన పాలక ప్రమీల పురిటినొప్పులతో ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం రాత్రి చేరింది. వెంటనే వైద్యాధికారి డాక్టర్ రవికుమార్ వైద్యసేవలందించారు. సరైన సమయంలో నొప్పులు రాకపోవడంతో ప్రసవం కాలేదు. బుధవారం ఉదయం నొప్పులు ఒక్కసారిగా రావడంతో భరించలేక ఎవరికి చెప్పకుండా ఇంటికి బయలుదేరింది. ఆసుపత్రి దాటి శివన్నపేటకు చేరుకోగానే నొప్పులు అధికమై ప్రసవం జరిగింది. రోడ్డుమీదనే ప్రసవం కావడంతో స్థానికులు సాయపడి పక్కకు చేర్చి ఆసుపత్రికి తెలియజేశారు. వెంటనే సిబ్బంది వెళ్లి చికిత్స అందించి తిరిగి ఆసుపత్రికి తీసుకువచ్చారు. మూడు రోడ్ల కూడలిలో ప్రసవం జరగడం కలకలం రేపింది. ఆసుపత్రిలో జరగాల్సిన ప్రసవం ఇలా రోడ్డుపై కావడంతో పలువురు చలించిపోయారు. ఈ విషయంపై వైద్యాధికారి డాక్టర్ రవికుమార్‌ను ప్రశ్నించిగా ప్రసవం కోసం తగిన చర్యలు తీసుకున్నామని, వేరొక కేసు వద్దకు వెళ్లే సరికి ఆమె ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయిందన్నారు. ప్రస్తుతం తల్లిబిడ్డ క్షేమంగా ఉందన్నారు.
ప్రసవం కోసం ప్రభుత్వాసుపత్రిలో చేరిన ఒక మహిళ,
english title:
delivary
Date:
Thursday, December 12, 2013