వేలూరి శివరామశాస్ర్తీ కథ
(రెండవ భాగం)
రచన: వేలూరి
శివరామశాస్ర్తీ
వెల: రూ.125/-
ప్రతులకు:
విశాలాంధ్ర బుక్‌హౌస్
అన్ని శాఖలు.
అగ్ర పంక్తిని అలంకరించిన
తొలి తరం తెలుగు
కథకుల్లో వేలూరి
శివరామశాస్ర్తీ ఒకరు.
అవధానం, కవిత, నవల,
నాటకం, విమర్శ,
అనువాదం ఇత్యాది
ప్రక్రియల్లో సిద్ధహస్తుడైనా
ఆయన కథాసృజన
వైలక్షణ్యం
సంతరించుకుంది.
వస్తువు, నిర్మాణం, శైలి,
పాత్ర చిత్రణ మొదలైన
వాటిలో వేలూరి వారు
ప్రదర్శించిన కౌశలం
కథలకు ఎంతో వనె్న
చేకూర్చింది. ప్రస్తుత
గ్రంథం ఆయన కథల
రెండవ సంపుటం.
ఇందులో ఏడు
కథలున్నాయి. ఇవి
ఆయన బహుముఖీన
ప్రతిభకు దర్పణాలుగా
నిలుస్తాయి. వస్తువైవిధ్యం
వీటి ప్రత్యేకత. నిడివిలో
కూడా ప్రత్యేకత
గోచరిస్తుంది. ఒకటి తప్ప
అన్నీ శిష్టగ్రాంథికంలో
వున్నాయి. వాచవిగా:
‘‘ఉపకలాపుఁడు
గృహోన్ముఖుఁడాయెను.
ఆకాశము అతనికి
ఆశాముఖ మండలము
చూపఁగాఁబోలు చంద్రదీప్త
మెత్తెను. అతని హృదయ
రంగమున ఒక నటి
హల్లీసక
మాడుచుండెను.’’ లలిత
పద విన్యాసంలో
కవితాత్మకంగా భాసిల్లే
వాక్యాలు చాలా తావుల్లో
అలరిస్తాయి. మచ్చుకు:
‘‘ఆ మోము మాటలు
నేర్చిన చందమామ. ఆ
చూపులు
మంత్రములుచ్చరించు
తూపులు. ఆ నవ్వు
వాడని పువ్వు. ఆ
పాదములు నడయాడు
పద్మములు. ఆ మాట
పాడని పాట.’’
అక్కడక్కడా
సంభాషణల్లో
పాత్రోచితంగా
వ్యావహారికం వాడారు.
ఒక ఉదాహరణ: ‘‘నేను
కాపీ గినె్నలు తొలుస్తా
దాన్ని మానిపించి రోజూ
నాకు కాపీ పోస్తావా?’’
ఈ కథల రచనా కాలం
1928-49 సం.ల మధ్య.
ఆయా కాలాలనాటి
సామాజిక స్థితిగతులు,
ఆచార వ్యవహారాలు,
నమ్మకాలు, అలవాట్లు,
ప్రజల మనోభావాలు,
సమస్యలు, పరిపాలన
ప్రభావం, విద్యారంగం
వైనం మొదలైన అంశాల
పట్ల రచయిత ఈ కథల్లో
చూపిన విశేషావగాహన
ఆశ్చర్యపరుస్తుంది.
కాలానుగుణ
పరిణామక్రమం
గోచరిస్తుంది. ఇతర
అంశాలతోపాటు శీర్షికలు,
సంవిధానం దీనిని
నిరూపిస్తున్నాయి.
కథల విహంగ వీక్షణం:-
‘పౌఢాపరివ్రాజక
వివాహము’ (1928)
మొదటి కథ. ఆశ
పసితనంలోనే తల్లిలేని
పిల్ల అయింది. తండ్రి
గోవిందుని పెంపకంలో
పెరుగుతోంది. కుమార్తెను
మేనరికం ముకుందునితో
పెళ్లిచేసేందుకు
సిద్ధమయ్యాడు.
‘‘సంఘమున వెలి
వచ్చుతో రానిమ్ము నేను
కోరుకొనునది రక్షకుఁడైన
తండ్రియొక్క ఒక్క ప్రేమ
కిరణమే’ అని ఆశ పెళ్లి
రద్దుచేయించింది.
ముకుందునికి ఆశ
మిత్రురాలు హరిణతో
వివాహమవుతుంది. ఆశ
ప్రౌఢగా మారుతుంది.
తర్వాత ఉపకలాప అనే
పరివ్రాజకునిపై ఆశ ప్రేమ
పెంచుకుంది. అతనూ
అంతే. ఇరువురికి
వివాహమవుతుంది.
‘సదాచారుడు’ (1928) కథ
ఇంగ్లీషు చదువుపై
వ్యామోహం చుట్టూ
అల్లినది. చంద్రుడు ముఖ్య
పాత్ర. సంప్రదాయ విద్య,
వైద్యం అతనికి గిట్టవు.
ఇంగ్లీషు వైద్యుడు వచ్చి
జ్వరం తగ్గిస్తాడు.
తల్లిదండ్రులు ఇంగ్లీషు
చదువుకు సమ్మతిస్తారు.
పెద్ద నవలకు సరిపడే
ఇతివృత్తం ఒదిగివున్న
కథ ‘ఓబయ్య’ (1932).
ఇందులో అనేక
పాత్రలున్నాయి. ముఖ్య
పాత్ర ‘అహోబలుడు’.
అందరూ ‘ఓబయ్య’
అంటారు. తల్లి వీర
వెంకమ్మ. ఓబయ్యకు
చదువుమీద ఎక్కువ
ఆసక్తిలేదు. కైలాసరావు
కుమార్తె వసుమతితో
చిన్ననాటనే వివాహం
జరిపించారు. వసుమతి
చదువులో దిట్ట. ఎలాగో
ఓబయ్య కళాశాల
స్థాయికి వచ్చాడు. గాంధీ
పిలుపు ఆకర్షించింది.
వసుమతితో కాపురం
సరిగా సాగలేదు. ఓబయ్య
శివాగ్రహారంలో
గ్రామాభ్యుదయ
కార్యక్రమంలో
నిమగ్నమవుతాడు. తల్లి
కుమారునికి మారు
వివాహం చేయాలని
యత్నిస్తుంది. రచయిత
ఆనాటి గ్రామాల స్థితిని
వర్ణించిన తీరు
విస్మయపరుస్తుంది.
చివరకు
ఓబయ్య-వసుమతి
ఏకమవుతారు. ఇది 80
పుటల కథ. ‘చీకటి తప్పు’
(1934) బాల వితంతవు
చూడమ్మ కథ. ఆమెను
ప్రేమించిన సుబ్బారావు
తండ్రి, చూడమ్మ తండ్రి
లోగడ వ్యాపారంలో
భాగస్థులు. ఈస్టిండియా
కంపెనీ కాలంలో
ఎగుమతి దిగుమతులు,
వెండి నాణేల
వ్యవహారంలో నష్టం
వస్తుంది. నష్టం
పంచుకోని సుబ్బారావు
చూడమ్మను నమ్మించి
మోసంచేస్తాడు. చీకటి
తప్పుచేశావని ఆమెను
వివాహమాడేందుకు
తిరస్కరించడంతో కథ
ముగుస్తుంది. సంవాద
రూపంలోవున్న
‘అమ్మనమ్ముకుందాం’
(1935)లో భూదేవి తన
మనోవేదనను
ప్రకటిస్తుంది. రైతుల
బాధలు, రాజుల ప్రాబల్యం,
వ్యాపారుల ఆగడాలు,
పెద్ద ఆసాముల స్వార్థం
వగైరాలు నిశితంగా
చిత్రించారు. భూదేవి
చివర్లో ‘నాయనా
మిగిలింది కూడా
అమ్ముకోండి’ అంటుంది.
శరత్‌బాబు బెంగాలీలో
రచించిన ‘అరక్షణీయ’
ఆధారంగా రచించిన కథ
‘కట్టుతప్పిన పిల్ల’ (1946),
తరచు అత్తవారింట్లో
వుండే అల్లుడు కేంద్ర
బిందువుగా వున్న చివరి
కథ ‘చదరంగము’ (1949).
ఈ కథాసంపుటి
కథకులకు,
పరిశోధకులకు,
సాహితీవేత్తలకు, కథా
ప్రియులకు విలువైన
కానుక.