..................
ఆంధ్రభూమి కథల పోటీలో ఎంపికైన రచన
................
‘‘స్వంతలాభం కొంత మానుకొని.. పొరుగువానికి తోడుపడవోయ్..’’ మహాకవి కవితాత్మకంగా చెప్పిన ఈ మాటల్ని నా జీవితంలోకి తెచ్చుకోవాలని ఎప్పుడూ తపన పడుతుంటాను.
‘‘ఈసురోమని జనం ఉంటే దేశమేగతి బాగుపడునోయ్...’’ ఈ మాటా నిజమే!
నా భోజనం క్యారేజీలో నేను ‘మిగిల్చేసిన’ పదార్థాలను ఆత్రంగా ఎగబడి.. పోటీపడి... వాటాలేసుకొని మరీ తీసుకెళ్లి తినే పిల్లలని చూశాక, వాళ్ళ కోసం.. వాళ్ల తల్లిదండ్రుల కోసం ఏదైనా చేయాలనిపించింది.
నేను పనిచేసే ఊరిలో మూడు పాఠశాలలు ఉన్నాయి. ఆ చివరో పాఠశాల, ఈ చివరో పాఠశాల, మధ్యలో ఓ పాఠశాల.
అలవాటు ప్రకారం మధ్యలో ఉన్న పాఠశాలలో అగ్రకులాలు, ఉన్నత వర్గాలు, బలహీన వర్గాల పిల్లలు చదువుతుంటే, ఆ చివరా, ఈ చివరా పాఠశాలల్లో షెడ్యూలు కులాల పిల్లలు చదువుకునేవాళ్ళు.
‘‘నేను పనిచేస్తున్నది ‘ఈ చివర’ పాఠశాలలో.
ఓపిగ్గా లెక్కపెడితే అగ్గిపెట్టెలో యాభై పుల్లలు ఉండొచ్చేమో గానీ, ఎన్నిసార్లు లెక్కపెట్టినా నలభై ఆరు ‘గడపలు’ మాత్రమే ఉన్న చిన్న పేట నా పాఠశాలున్న ప్రాంతం.
అటూ ఇటూ పొలాలు... ఆ పొలాల్ని ఇళ్ళనీ విడదీస్తూ మట్టిరోడ్డు. ఓ మూలన ఇళ్ళమధ్యలో పొలానికి ఆనుకొని, ఎప్పుడో ఎవరో మహానుభావుడు దయతలచి కాస్త స్థలమిస్తే రేకు పైకప్పుతో చిన్న పాఠశాల ఒకే ఒక గదితో ఏర్పడింది.
ఆ ఒక్క గదిలోనే మొత్తం ఐదు తరగతులూ!
నేను కొత్తగా ఉపాధ్యాయ ఉద్యోగంలోకి అప్పుడే చేరాను.
ఏ మాత్రం ఆలస్యం లేకుండా వెంటనే పెళ్లీ అయిపోయింది.
ఈ దేశంలో నిరుద్యోగం చాలా విశాలమైంది కనుక, ‘ఇంటికి రెండు ఉద్యోగాలు’ ఉంటే, ఆ నిరుద్యోగం మరింత విశాలమై వర్థిల్లుతుందనే భయంతో ఉద్యోగినినే చేసుకొనే అవకాశం ఉన్నా, నేనలా చేయలేదు. గృహిణిగా ఉంటే చాలనుకున్నాను.
నాకు సంబంధం తెచ్చిన పేరయ్య ‘అలాంటి సంబంధమేనని’ చెబితే, పెళ్లిచూపులకు వెళ్ళాక తెలిసింది ఆమె ఏదో చిరుద్యోం చేస్తూ తండ్రికి సాయపడుతోందని
నా అభిప్రాయం చెప్పాను. ఆమె.. మెరిసే కళ్ళతో నా వంక చూసింది.
అమ్మాయి తండ్రి ‘‘ఏదో వేణ్ణీళ్ళకు చన్నీళ్ళ సాయం’’ అన్నారు.
నేను నవ్వి... ‘‘వేణ్ణీళ్ళు బాగా వేడిగా ఉంటే, ఎన్ని చన్నీళ్ళు అందులో పోస్తే చల్లబడతాయి. అలాగే, చన్నీళ్ళు బాగా చల్లగా ఉంటే, ఎన్ని వేణ్ణీళ్ళు అందులో కలిపితే వేడెక్కుతాయి...’’ అని అడిగాను.
నా వాదానికి ఆయన అయోమయంగా చూసినా, నా వంక ఇంకా అలాగే మెరిసే కళ్ళతో చూస్తూండిపోయిన ఆమెతో నా వివాహం అయిపోయింది.
అప్పట్నుంచీ నా అభిప్రాయాలను గౌరవించడంవల్ల నాతో సంపూర్ణంగా సహకరిస్తూంది కూడా.
నేను డ్యూటీకి వెళ్ళాక.. తనకి తోచుబాటు కాకపోతే, కుట్లు... అల్లికలు వంటివి ఆమెలాంటి ఇంటిపట్టునుండే గృహిణులకు ఉచితంగా నేర్పే పనిని స్వీకరించింది.
ఉదయం, సాయంత్రం వేళల్లో చుట్టుప్రక్కల పేద, మధ్యతరగతి కుటుంబాల్లోని పిల్లలకు ఫ్రీ ట్యూషన్ క్లాసులుని తనలా చదువుకున్న మరో ఇద్దరు ముగ్గుర్ని కలుపుకొని మా వరండాలో నిర్వహించేది.
***
నా పాఠశాలలో నేను ఒక్కడ్నే టీచర్ని. అంటే ప్రభుత్వం వారి భాషలో సింగిల్ టీచర్నన్నమాట. నా పని అన్ని తరగతులకూ బోధించడం. అన్ని పనులూ చేయడం. బెల్లూ.. బిల్లూ.. చదువూ..ఆటలూ.. అన్నీ!
ఒకటినుండి ఐదు తరగతుల్లో ఉన్న పిల్లలు ఇరవై మూడు మంది. అందులో తొమ్మిది మంది ఆడపిల్లలు.. మిగిలిన పధ్నాలుగురూ మగ పిల్లలు.
ఒకటో తరగతిలో ముగ్గురు, రెండో తరగతిలో నలుగురు, మూడులో ఐదుగురు, నాల్గులో ఆరుగురు, ఐదులో ఐదుగురు. నేనా పాఠశాలలో చేరేనాటికి ఇదీ రోల్. వీళ్ళలో సక్రమంగా పాఠశాలకు వచ్చేవాళ్ళు పనె్నండు మందే!
మిగిలిన పదకొండుమంది పిల్లలూ బడి ఎగవేయడానికి రకరకాల కారణాలున్నాయి. ఎవరికుండాల్సిన ఇబ్బందులు వాళ్ళకున్నాయి.
తల్లిదండ్రుల్లో అధిక శాతం నిశానీలే కావడంవల్ల, చదువు విలువ వారికి తెలిసేది తక్కువ.
‘చదువుకుని బాగుపడిందెవ్వరన్నది’ వాళ్ళ నిశ్చితాభిప్రయం.
పదేళ్ళు కూడా నిండని ఆడపిల్లలకి పైట వేయించి, కూలి పనుల్లోకి తమ వెంట తీసుకెళ్లిపోవటం.. మగ పిల్లల్నయితే ఏ కిరాణా కొట్లోనో, సైకిల్ రిపేరు షాపులోనో, కాఫీ హోటల్లోనో పనిలో పెట్టడం చేస్తుంటారు.
పేటలోని దాదాపు అందరూ పిల్లలు ఐదో తరగతి దాటగానే, ప్రక్క ఊర్లో ఉన్న హైస్కూలుకి పంపకుండా చేసే పని ఇదే. పోనీ, ఐదులోపు తరగతులు చదువుతున్న పిల్లల్లయినా సక్రమంగా బడికి పంపుతారా.. అంటే అదీ కష్టమే.
పనుల్లోకి వెళ్తూ.. బాగా చిన్నపిల్లల్ని ఇంటి దగ్గర ఆడించడం కోసం.. ముసలివాళ్ళకు ఆసరాగా ఉండడం కోసం.. వాళ్ళని పురమాయించి ఇంటి వద్దే ఉంచేస్తారు.
నేను ఆ పాఠశాలకు వెళ్ళాక పిల్లలందర్నీ బడివేళలో, బడిలోనే ఉండేట్టు చేయడానికి చాలా శ్రమ పడాల్సి వచ్చింది. ఆ క్రమంలో బడికి సక్రమంగా రాని పిల్లల తాలూకు ఇల్లిల్లూ తిరిగి, పెద్దవాళ్ళకి నచ్చచెప్పే పనిని చేపట్టాను.
అంతేకాకుండా.. ఐదో తరగతి దాటి, హైస్కూలు మెట్లెక్కకుండా పనుల్లోకి ‘నెట్టబడిన’ పిల్లల తల్లిదండ్రుల్ని కలిసాను.
అందరిదీ ముక్తకంఠంతో ఒకటే మాట.. ‘రెక్కాడితే తప్ప, మా డొక్కలు నిండవు బాబూ... మమ్మల్నేటి సేయమంటారూ..’ అని.
నిజమే! వాళ్ళుండే నివాసాలు.. వాళ్ళు ధరించిన దుస్తులు.. అక్కడి వాతావరణం చూశాక, వాళ్ళ బాధ అర్థమయ్యింది.
నేను చెబుతున్న పాఠ్యపుస్తకంలోని గేయాన్ని వాళ్ళకి వినిపించాను.
‘‘చదువుకో నా తల్లి.. చదువుకో నా తండ్రి... చదువుకుంటే నీకు సౌఖ్యమబ్బేను.. చదువువల్లే నీకు కీర్తి కలిగేను...’’
వాళ్ళు నా వంక ఆసక్తిగా చూస్తున్నారు.
గతంలో ఎప్పుడో బడికొచ్చి, తన పనేదో చూసుకెళ్లిపోయిన మాస్టార్లని ఎందర్నో చూస్తున్న వాళ్ళు, ఇలా తమ దగ్గరకొచ్చి మాట్లాడుతూన్న నన్ను వింతగా చూస్తున్నారు.
‘‘బడి వయస్సు పిల్లలంతా బడిలోనే ఉండాలని, బాలల్ని కార్మికులుగా చేయడం నేరమని, ఆరు నుండి పధ్నాలుగు సంవత్సరాలు వయస్సున్న పిల్లలందరికీ... మతం, కులం, ఆదాయంతో సంబంధం లేకుండా అందరికీ.. ఉచిత పాఠ్యపుస్తకాలు, దుస్తులు, మధ్యాహ్న భోజనం, వైద్య సదుపాయం అందిస్తున్నారని చెప్పాను.
అదే ఆడపిల్లలకయితే ఇంటర్మీడియెట్ వరకూ ఉచితవిద్య ఉందని వివరించాను.
‘‘మీకు చదువుల్లోనే కాదు, ఉద్యోగాల్లోనూ రాయితీలు, రిజర్వేషన్లు ఉన్నాయని, వాటిని వినియోగించుకోకపోతే మీరే నష్టపోతారని, మీకున్న సౌకర్యాలను మురగబెట్టుకోవద్దని’’ హితవు పలికాను.
నేను ఎంత చెప్పినా ఎంతగా వాళ్ళని మార్చాలని ప్రయత్నించినా వాళ్ళది మళ్లీ ఒకటే మాట.
‘‘ఎక్కడో మబ్బుల్లో నీళ్లున్నాయని మమ్మల్నిప్పుడు ముంతొలగబోసుకోమంటారా మాట్టారూ.... సదివితే ఎప్పుడో ఉద్దోగాలొస్తాయని, ఇప్పుడు పస్తులు పడుకోమంటారా..’’
వాళ్ళు అంటున్న దాంట్లో వాస్తవం ఉందనిపించింది.
అందరూ ఏదో పనిచేస్తూ కష్టపడితేనే, ఎంతోకొంత సంపాదిస్తేనే ఇల్లు గడుస్తుంది.
మరి! పిల్లలందరూ చదవాలి... ఉన్నతంగా ఎదగాలి.. అనే ప్రభుత్వ లక్ష్యం ఎలా నెరవేరుతుంది?
ఇక్కడి పిల్లలంతా చదవాలి.. వాళ్ళు జీవితంలో ఏదైనా సాధించాలి.. అంటే, నేనేం చేయాలో ఆలోచిస్తుంటే, నాన్నగారు గుర్తుకొచ్చారు.
నేను ఉపాధ్యాయుడ్ని కావడానికి ఆయనే కారణం.
పాఠశాల, కళాశాల వయస్సులో రకరకాల సాహితీ ప్రక్రియలు, కళలతో మమైకం అవుతూ తిరుగాడుతున్న నన్ను పట్టుకొని, పట్టుపట్టిమరీ టీచర్ ట్రైనింగ్ చేయించారు.
నీ సృజనా, ఆశయాలూ చెల్లుబాటు అయ్యేది పాఠశాలల్లోనే అనేవారు ఆయన. ఇదే కాకుండా, నాన్నగారు తను చేసిన వృత్తిలో ఎందరికో అందించిన సాయం కూడా నాలో స్ఫూర్తిని నింపింది.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో నాన్నగారిది ఆఫీసరు కేడరు. అయినా, పని చేస్తున్న చోట అందరిలో మమేకం అయిపోయి.. వారికి తలలో నాల్కలా ఉండేవారు.
పదో తరగతి ‘మంచి మార్కులతో’ పాసై కూడా, అవగాహన లేక.. ఏవేవో చిన్న చిన్న పనుల్లోకి చేరిపోయిన కుర్రాళ్ళని చేరదీసి, వాళ్ళని తను పనిచేసే ప్రభుత్వ రంగ సంస్థలో ‘రోజువారీ మస్తరు’ పనివాళ్ళుగా ముందు ప్రవేశింపచేసి, అక్కడే వాళ్ళు అంచెలంచెలుగా పదోన్నతులు పొందేలా వెన్నుదన్నులు అందించేవారు.
‘మనకు తెలిసిన మంచిని అది మాటయినా, పని అయినా.. ఏదైనా పదిమందికీ పంచాలి.. అందరూ బాగుంటే సమాజం బాగుంటుంది’ అనేవారాయన ఎప్పుడూ.
నా పాఠశాల ప్రాంతంలోని జనవాసాల్లో నాన్న ఆదర్శానే్న ఆచరణలోకి తెచ్చే పనిని ప్రారంభించాను.
ప్రొద్దుటే పొట్ట చేత్తోపట్టుకుని చద్దనం క్యారియర్‌లో సర్దుకొని సుదూర ప్రాంతాలకు పనులు వెదుక్కుంటూ వెళ్ళే ఆ జనాలకు.. వాళ్ళు ఇంటిపట్టున ఉండే పనిచేసుకొని, ఆదాయాన్ని పొందేలా చేయగలిగాను.
అదెలాగంటే...
మా గ్రామంలోనూ, పరిసర గ్రామాలోలనూ జనపనార (గోగునార) పంటని సమృద్ధిగా పండిస్తారు.
అలా పండించిన పంటని కోసిన తర్వాత నానబెట్టి, క్యూరింగ్ చేసి, బేళ్లుగా తయారుచేసే పని ఫ్యాక్టరీ వాళ్ళది.
కోత పూర్తయిన తర్వాత పొలాల్లో చాలా చోట్ల ప్రోగుపడ్డ గోగునార కాడల్ని రైతులు అలాగే వదిలేస్తారు. అవి అలా మరో పంట కాలంవరకూ ఎండకు ఎండి, వానకు నాని పాడవ్వడమో, లేకపోతే ఏరుకున్న వాళ్ళ ఇళ్ళలో వంట చెరకు అవ్వడమో జరుగుతుండేది.
ఇక్కడ నేను చేసిందేమిటంటే మా పేటలోంచి ప్రొద్దుటే పనులు వెదుక్కుంటూ వెళ్ళేవాళ్ళని ఆపి మగాళ్ళతో ఆ కాడల్ని ఏరించి ఒకచోట ప్రోగేయించడం- అలా ప్రోగయిన వాటిని నీటి తొట్టెల్లో వేసి నానబెట్టించే పనిని ఆడవాళ్ళతోనూ చేయించాను.
మర్నాడు కూడా మళ్లీ అదే పని.
మా పేటలోని వాళ్ళకి ముందు ఇదంతా వింతగా, తర్వాత తర్వాత క్రొత్తగా, పోను పోను ఆసక్తిగా అనిపించినా.. నాతో సహకరిస్తూ అలవాటుగా చేసుకుపోతున్నారు.
ఏరోజు కారోజు సాయంత్రం కాగానే కూలి డబ్బులు నా జీతం ప్లస్ పొదుపు ఖాతాలోంచి తీసిస్తున్నానేమో, నేను ఏది చెబితే అది, ఎలా చెబితే అలా పనిని చకచకా కానిస్తున్నారు.
వాళ్ళ చేత నానిన గోగునార కర్రల్నుంచి నారను వేరు చేయించి, ఎండలో బాగా ఆరబెట్టించి, ఆనక ఆ నారని బాగా సాఫుచేయించి ప్రోగుల్ని చక్కగా వేరు చేయించి స్టోర్ చేయించాను.
నా శ్రీమతి సులోచనకి వ్యర్థ పదార్థాలతో కళాకృతులను తయారుచేసే కళ గురించి బాగా తెలుసు. ఆమె చేత మా పేటలోని ఆడవాళ్ళకి గోగునారతో వస్తువులు తయారుచేసే విధానంపై శిక్షణ ఇప్పించడం ప్రారంభించాను.
ఇప్పుడు మగవాళ్ళు గోగునార కర్రల్ని ఏరడం దగ్గర్నుంచి, నారని సాఫు చేసి... స్టోర్ చేసే పనివరకూ అన్నీ చేస్తుంటే, ఆడవాళ్ళు సులోచన ఇచ్చే శిక్షణని ఉత్సాహంగా అందుకుంటున్నారు.
పనికి పనీ జరుగుతోంది.. దూరాభారం పోయిరాకుండానే కూలి డబ్బూ చేతికి అందుతోంది.. పనిలో పనిగా క్రొత్తపనీ తెలుస్తోంది. ఈవిషయమై మా పేట మొత్తం మంచి సందడిగా ఉంటే, గ్రామం గ్రామం అంతా ఆసక్తిగా మమ్మల్ని గమనిస్తోంది.
పర్యావరణానికి హాని చేసే ప్లాస్టిక్, పొలిథీన్ క్యారీ బ్యాగుల స్థానంలో గోగునారతో పలుచటి చేతి సంచులను తయారుచేయడం ముందుగా వాళ్ళకి నేర్పింది సులోచన.
కళాకృతులుగా టీపాయ్, డైనింగ్ టేబుళ్ళమీద పరిచే క్లాత్‌లతో పాటు, ద్వారబంధాల అలంకరణలు, హ్యాండు బ్యాగులు, పూలసజ్జలు, టీవీ కవర్లు, డోర్ మ్యాట్‌లు, ఆట వస్తువులు, అలంకరణ వస్తువులు ఇలా ఎన్నో...
ఇదివరకు వంటచెఱకుగా తామంతా ఉపయోగించే ఈ గోగునార కర్రలోంచి ఇంత పనిని, పనితనాన్ని చూపించినందుకు సులోచన అందరి అభిమానాన్ని పొందింది.
తమ పిల్లల చదువులు సక్రమంగా జరగడానికి, తామందరికీ ఒక క్రమ పద్ధతిలో శాశ్వతమైన ఒక వ్యాపకాన్ని ఇంటిపట్టున ఉండి చేసుకునేలా చేసినందుకు వాళ్ళంతా నన్ను అపురూపంగా చూశారు.
పిల్లలెవరూ బడి మానడంలేదు. బాల కార్మికులుగా మారడంలేదు. అయిదో తరగతి చదివి ఆగిపోయిన వాళ్ళంతా ఉన్నత పాఠశాలల్లోకి వెళ్తున్నారు.
యాభై కూడా గడపల్లేని ఆ చిన్నపేట ఇప్పుడు గ్రామం మొత్తానికి తలమానికం అయ్యింది. చుట్టుప్రక్కల గ్రామాలూ విషయం తెలిసి తామూ నేర్చుకుంటామని వస్తుంటే, సులోచన ప్రమేయం లేకుండా వాళ్ళే నేర్పిస్తున్నారు.
క్రమంగా మా ఆశయం వృక్షమై ఎందరికో ఆశ్రమయమిచ్చింది.
ఇక్కడి వాళ్ళు చేస్తున్న గోగునార కళాకృతులకు, వస్తువులకు మార్కెట్లో మంచి స్థానం, డిమాండ్ రెండూ ఏర్పడ్డాయి.
ఒకప్పుడు ఐదో తరగతి దాటి చదివెరుగని మా పేట జనాలు ఇప్పుడు తమ పిల్లల్ని ఎంతవరకైనా, ఎక్కడయినా చదివించడానికి తగిన ఆర్థిక స్వాతంత్య్రాన్ని పొందుతున్నారు.
ముద్దుగా నేర్పితే ఎలాంటివాళ్ళయినా బుద్ధిగా నేర్చుకొని, ఆశించిన ప్రగతిని సాధించి చూపుతారనడానికి మా పేట జనాలే సాక్ష్యం!
‘నేను సైతం ప్రపంచాగ్నికి సమిథనొక్కటి ఆహుతిచ్చానన్న’ మహాకవి కవితా వాక్యాన్ని మా చిన్నపేట జనం నిజం చేశారు.
నాన్న వారసుడిగా నా జన్మకిది చాలనిపించింది.
*..........
-యన్.కె.నాగేశ్వరరావు,
శ్రీసాయబాబా గుడి వద్ద, పెనుగొండ- 534320, పశ్చిమగోదావరి జిల్లా.
ఫోన్: 9346720641, 9030360988
..........
‘‘స్వంతలాభం కొంత మానుకొని.. పొరుగువానికి తోడుపడవోయ్..’’
english title:
story
Date:
Saturday, December 21, 2013