కృష్ణా గోదావరి చమురు క్షేత్రాల నుంచి ‘రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్’-రిల్- తవ్వుకుంటున్న అవినీతికరమైన లాభాలను నిరోధించడం కేంద్ర ప్రభుత్వానికి ఇష్టం లేదని మరోసారి ధ్రువపడింది! కృష్ణా గోదావరి క్షేత్రంలోని డి6 బొరియనుంచి ఉత్పత్తి చేసే ఇంధన వాయువును ముఖేశ్ అంబానీ నాయకత్వలోని ‘రిల్’ రెట్టింపు ధరలకు అమ్ముకోవడానికి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ ఉపసంఘం గురువారం మార్గాన్ని సుగమం చేసింది. ఈ వ్యవహారం మొత్తం ఐదేళ్ళకు పైగా అవినీతి దుర్గంధాన్ని వెదజల్లుతోంది కాబట్టి, ఈ దుర్గంధ ప్రకంపనాలు మరోసారి పార్లమెంటును కుదుపకుండా ప్రభుత్వం జాగ్రత్తలు సైతం తీసుకుంది. ఈ జాగ్రత్తలలో భాగంగానే పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన తరువాత ‘రిల్’ గ్యాస్ ధరలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2008లో కృష్ణా గోదావరిలో తవ్వి తీసే ఇంధన వాయువును ‘రిల్’వారు ‘గంగాళం’ నూట ఇరవై రూపాయల చొప్పున విక్రయించవలసి ఉండేది. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలకు సరఫరా చేయవలసి ఉండేది. ఈ ధరను 2009లో ప్రభుత్వం దాదాపు రెట్టింపు చేసింది. గంగాళం- మిలియన్ బ్రిటిష్‌థర్మల్ యూనిట్- ఎమ్‌బిటియు- ధరను రెండు వందల పది రూపాయలకు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. ‘రిలయన్స్’ గ్యాస్ ధరలు పెరుగుదలతో పాటు పారిశ్రామిక ఇంధన వాయువు ధరలు మాత్రమే కాక వంట ఇంటిలోని గ్యాస్ బండ ధర కూడా పెరగడం ప్రభుత్వం వారు నడిపిస్తున్న విపరిణామ క్రమం. ఆధార్ గుర్తింపు, పత్రం తో వంట ఇంధనం సరఫరాను ముడి పెట్టిన వెంటనే ఈ ఏడాది మే జూన్ నెలల్లో వంటగ్యాస్ సిలిండర్ ధర దాదాపు నూట యాబయి రూపాయల మేర పెరిగింది. రిలయన్స్ వారి ధరను ప్రభుత్వం పెంచిన వెంటనే అన్ని రకాల గ్యాస్ ధరలు వాటంతట అవే పెరగడం నడుస్తున్న చరిత్ర. ఈ అక్రమ లాభాలలో అధికశాతం మాత్రం ‘రిల్’ వారు మూటకట్టుకుంటున్నారు. 2014 ఏప్రిల్ నుంచి ‘రిల్’ వారు తమ గ్యాస్‌ను ‘గంగాళం’ ఐదువందల నాలుగు రూపాయల చొప్పున అమ్ముకొనడానికి గురువారం మంత్రివర్గం అనుమతిచ్చింది. దేశంలో అతిపెద్ద ప్రభుత్వేతర చమురు ఇంధన వాయు ఉత్పాదక వ్యవస్థగా పేరు మోసిన ‘రిల్’కు ప్రధాన మంత్రి కార్యాలయం వారి అండదండలు మెండుగా ఉండడం వల్లనే ఈ సంస్థ ఆడింది ఆటగా మారిందన్నది బహిరంగ రహస్యం. మూడేళ్ళపాటు వివిధ ఉత్పాదక సంస్థలు విక్రయించే ఇంధన వాయువు ధరలను పెంచరాదని గత జూలైలో ఆర్థిక మంత్రిత్వశాఖ వారు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన మేరకు 2014 ఏప్రిల్ తరువాత కూడ మూడేళ్ళపాటు ‘రిల్’ సంస్థవారు గంగాళం ఇంధన వాయువును రెండువందల యాబయి రెండు రూపాయలకు విక్రయించాలి. ప్రభుత్వం ఇలా నిర్ధారించినట్టయితే రిల్ సంస్థవారు నోరెత్తడానికి వీలు లేదు. ఎందుకంటే, ఇంధన వాయు నిక్షేపాలు జాతీయ సంపద కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిర్ధారించే ధరల విధానం ఇంధన వాయు విక్రయానికి వర్తిస్తుందని సర్వోన్నత న్యాయస్థానం 2010 మే నెలలో స్పష్టం చేసింది. అందువల్ల ధరల నిర్ణాయక అధికారంలో ప్రభుత్వేతర సంస్థలకు ఎలాంటి భాగస్వామ్యం లేదన్నది న్యాయ నిబంధన. కానీ ముఖేశ్ అంబానీ యాజమాన్యంలోని సంస్థ ఇప్పుడు ధరలను నిర్దేశించగలిగింది. ప్రభుత్వ విధానాన్ని రూపొందించగలిగింది. ప్రపంచీకరణ లోని ఒక ప్రధానమైన అంశం సార్వభౌమ ప్రభుత్వాల విధానాలను బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు నిర్ధారించడం...కనీసం నియంత్రించడం!
ఈ రిలయన్స్ సంస్థ వారు అక్రమ పద్ధతులకు పాల్పడుతున్నట్టు 2008 నుంచి కూడ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పనిగట్టుకొని ‘కృష్ణా గోదావరి’ క్షేత్రంలో ఇంధన వాయువు ఉత్పత్తులను ప్రతి ఏడూ మునుపటి ఏడాది కంటె తగ్గించివేయడం ద్వారా ‘రిల్’ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు కేంద్ర ఇంధన తైల, వాయు మంత్రిత్వశాఖవారు 2009 నుంచీ ఆరోపిస్తూనే ఉన్నారు. ఇలా ఉత్పత్తులను తగ్గించడం ద్వారా నష్టాలు వస్తున్నట్టుగా నాటకమాడడం ధరలు పెంచుకునే వ్యూహంలో భాగం. ఇలా ఉత్పత్తులను దురుద్దేశ పూర్వకంగా తగ్గించినట్టు నిర్ధారించిన చమురు మంత్రిత్వశాఖ గత ఏడాది మే నెలలో రిల్‌కు ఐదువేల కోట్ల రూపాయలకు పైగా జరిమానా విధించింది కూడ. రిల్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని సామాజిక ఉద్యమకారుడు అరవింద కేజ్రీవాల్ గత ఏడాది నవంబర్‌లో కోరాడు. రిల్ యజమాని ముఖేశ్ అంబానీ అక్రమాల చిట్టాలను బయటపెట్టాడు. నలబయి మూడు వేల కోట్ల రూపాయల అదనపు అక్రమ లాభం సంపాదించుకొనడానికి వీలుగా గ్యాస్ ధరలను పెంచడానికి నిరాకరించిన కేంద్ర మంత్రి ఎస్.జైపాల్ రెడ్డిని పెట్రోలియం శాఖ నుంచి రిల్ బదిలీ చేయించిందని కూడా కేజ్రీవాల్ ఆరోపించాడు. కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా ప్రధానమంత్రి కార్యాలయ నిర్వాహకులు ఈ ఆరోపణలను ఖండించలేదు, అంగీకరించలేదు.
చమురు ఇంధన వాయువుల రంగాన్ని తమ కుటుంబ సామ్రాజ్యంగా మార్చుకొనడానికి ముఖేశ్ అంబానీ, ఆయన సోదరుడు అనీల్ అంబానీ యత్నించడం అవినీతి చరిత్రలో మరో అధ్యాయం. 2009లో గ్యాస్ ధరను ప్రభుత్వం దాదాపు రెట్టింపు చేసిన తరువాత, తనకు మాత్రం పాత ధరలకే రిల్ గ్యాస్‌ను సరఫరా చేయాలని అనిల్ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్ నాచురల్ రిసోర్సెస్ లిమిటెడ్ - ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్- వారు పట్టు బట్టారు. మిగిలిన సంస్థల నుండి గంగాళం గ్యాస్‌కు రెండువందల పది రూపాయల చొప్పున వసూలు చేసినప్పటికీ, తమకు మాత్రం నూట ఇరవై రూపాయలకే విక్రయించాలని ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్ పేచీ పెట్టింది. కోర్టు కెక్కింది. అయితే జాతీయ సంపదను కుటుంబ ఆస్తిగా మార్చుకొని పంపకాలు చేసుకొనడానికి సుప్రీం కోర్టు అంగీకరించలేదు. కృష్ణా గోదావరి క్షేత్రంలో నిబంధనావళికి విరుద్ధంగా రిల్‌కు తవ్వకాల అనుమతిని ఇవ్వడం ద్వారా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్-డిజిహెచ్-వారు ఆ సంస్థకు అక్రమ లాభాలను సమకూర్చి పెట్టినట్టు ఆదాయ వ్యయ నియంత్రణ, సమీక్షా సంచాలక-కాగ్-కార్యాలయం వారు 2011లో నిర్ధారించారు. కేంద్ర ప్రభుత్వాన్ని అభిశంసించారు. ఈ నిర్ధారణ ప్రాతిపదికగా 2011 సెప్టెంబర్‌లో సిబిఐ దర్యాప్తును కూడ ప్రారంభించిందట. కానీ ఈ కొండను తవ్వే యత్నం కూలబడి పోవడానికి ప్రధాన మంత్రి కార్యాలయాన్ని రిల్ నిర్దేశించగలుగుతుండడం కారణం..
జైపాల్‌రెడ్డి పెట్రోలియం మంత్రిత్వశాఖకు ఆధ్వర్యం వహిస్తుండిన తరుణంలో సిఎజీ నివేదిక ఆధారంగా మొదలైన చర్య లు ఆయనను ఆ మంత్రిత్వశాఖ నుంచి తప్పించడంతో చప్పబడిపోయాయి. పర్యావరం మంత్రిత్వశాఖ నుండి జైరామ్ రమేశ్‌ను వెళ్ళగొట్టిన ప్రపంచీకరణ దుస్త్రంతానికి జైపాల్‌రెడ్డిని తప్పించడం కొనసాగింపు మాత్రమే. ఇప్పుడు కథ పూర్తిగా మారిపోయింది. రిల్ జరిమానాను ఆర్థిక హామీగా మార్చి వేశారు. దురుద్దేశంతో ఉత్పత్తులను ఆపలేదని రిల్ నిరూపించుకొనే వరకు అనుమతి ఇవ్వరాదన్న విధానం మారింది. ఈ నిరూపణతో సంబంధం లేకుండా వచ్చే ఏప్రిల్ నుండి రిల్ గ్యాస్ ధరలను పెంచవచ్చు. ఆరోపణ ఋజువు అయితే..రిల్ సమర్పించే ఆర్థిక హామీ-బ్యాంక్ గ్యారంటీ- పత్రంలోని డబ్బును ప్రభుత్వం జమకట్టుకుంటుందట. ఆరోపణ బహుశా ఋజువు కాదు..
కృష్ణా గోదావరి చమురు క్షేత్రాల నుంచి ‘రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్’
english title:
rill
Date:
Saturday, December 21, 2013