Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఎన్నికల హామీలపై చర్చ జరగాలి

$
0
0

‘గత 15 సంవత్సరాలలో మీరెదుర్కొన్న ఇబ్బందులేమిటి’ అని ఓడిపోయిన షీలా దీక్షిత్‌ను మీడియా ప్రశ్నించినప్పుడు- బిజెపి చేతిలో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ వుండడమని, దీంతో మురికి కాల్వల, రోడ్ల నిర్వహణ లాంటి సమస్యల్ని అధిగమించలేకపోయామని, శాంతి భద్రతలు కూడా కేం ద్ర ప్రభుత్వం చేతిలో వుండడంతో నిర్భయలాంటి అత్యాచార సంఘటన ఫలితాల్ని మూటకట్టుకోవాల్సి వచ్చిందని ఆమె సమాధానం. ఇందులో వాస్తవం వుండే వుండవచ్చు! బిజెపి ప్రతినిధి అరుణ్ జైట్లీని ఆమ్‌ఁ ఆద్మీ పార్టీపై స్పందించమనగా, ఆచరణ సాధ్యంగాని హామీలనిచ్చి ఎన్నికల్లో సీట్లు సంపాదించి, ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయకుండా తప్పించుకుంటున్నదని వ్యాఖ్యానించారు.
షీలా దీక్షిత్ మాటలను బట్టి మొత్తంగా ‘ఒకే రాజకీయ పార్టీ అన్ని స్థాయిల్లో అధికారంలో వుంటేనే సుపరిపాలన (good goverence) సాధ్యమని. ఇదే వాస్తవమైతే, ఇలాంటి పరిస్థితులున్న రాష్ట్రాలు, రాజధానులు చాలా వున్నాయి. హైదరాబాదే దీనికి ఉదాహరణ. హైదరాబాద్ సుపరిపాలన అందరికీ తెలిసిందే! మరి ఢిల్లీ మున్సిపల్ తమ ఆధీనంలో లేదని తెలిసి, ఏ హామీలు నెరవేరుస్తానని ఆమె నాల్గోసారి ఎన్నికల బరిలో దిగింది? ఓ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఎన్నిసార్లు నిలబడవచ్చు? ఎంత వయస్సు దాకా రాజకీయాలు చేయవచ్చు? ఎప్పుడైనా ఈ దేశంలో చర్చ జరిగిందా? గత 15 ఏళ్లుగా (ఎన్‌డిఎ కాలం నుంచి) ఆమె ముఖ్యమంత్రిణిగా ఏం చేసిందో, ఎందుకు చేయలేదో శే్వతపత్రాన్ని విడుదల చేస్తే ఆమె రాజకీయం తెలుస్తుంది.
ఇక జైట్లీ వ్యాఖ్యానం ప్రకారం- ఏ జాతీయ పార్టీ అయినా, దేశంలోని ఏ ప్రాంతీయ పార్టీ అయినా ఆరోగ్యకరమైన హామీలనిస్తున్నాయా? అని.. బిజెపి పాలిత రాష్ట్రాల్లో (మధ్యప్రదేశ్ /చత్తీస్‌గఢ్ పాటు తిరిగి రాజస్థాన్‌లో గతంలో కర్ణాటకలో) ఇలాంటి హామీలతోనేగా అధికారంలోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి బాధ్యతల్ని చేపట్టిన మరుక్షణమే శివరాజ్ సింగ్ చౌహాన్ కిలో రూపాయి బియ్యం పథకాన్ని (ఇప్పటిదాకా కిలో 2 రూపాయల బి య్యం పథకం అమల్లో ఉంది) వచ్చే జనవరినుంచి ప్రవేశపెడుతూ సంతకం పెట్టాడు. బహుశ ఇది చంకలు చరుచుకునే పథకంలా బిజెపితో సహా వివిధ రాజకీయ పార్టీలకు తోయవచ్చు! అప్రతిహతంగా కొనసాగుతున్న ఇలాంటి రాజకీయ లబ్దిదారుల పథకాలను ఏ ప్రజానీకం కోరడంలేదు. పోనీ, ప్రజల సంక్షేమ పథకంగా దీన్ని భావిస్తే- మిగతా దినసరి సరకుల సంగతేంటి? కిలో రూపాయి బియ్యం చాలక, స్వేచ్ఛా విపణిలో బియ్యం ధరలు ఎంతనో ఈ రాజకీయ పార్టీలకు తెలియవా..? సబ్సిడీ బియ్యానికి-గోధుమలకు 20-30 శాతం తేడాతో మార్కెట్లో ధరలుంటే- సామాన్యుడి పరిస్థితి ఏంటి? దఫదఫాలుగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తున్న రాజకీయ పార్టీలకుగాని, రాజ్యాధి నేతలకుగాని ఈ దరిద్రులు ఇంకా ఎందుకు దరిద్రంగా విరాజిల్లుతున్నారో తెలియదా? ప్రజల కొనుగోలు శక్తికి, ధరల నియంత్రణకు పొంతన ఎందుకుండడంలేదు?
‘ఇస్తే తాము మాత్రమే హామీలు ఇవ్వాలి- చేస్తే తాము మాత్రమే పాలన చేయాలనే..’ దురహంకార స్వభావం ఈ దేశాన్ని ఈ దుస్థితికి తెచ్చాయి. కేజ్రీవాల్ పెట్టిన 18 షరతులు తరచి చూస్తే ఆచరణ సాధ్యం కానివంటూ ఏమీ లేవు. అందులో ముఖ్యమైనవి- ప్రతీ వ్యక్తికి 220 లీటర్ల చొప్పున ఒక్కో కుటుంబానికి 700 లీటర్ల నీటిని రోజు సరఫరా చేయడం. ఢిల్లీ పట్టణం య మునా నది ఒడ్డున వుంది. హిమాలయాల్లో యమునోత్రిలో పుట్టిన యమునా నది వర్షాకాలంలో వర్షం నీటితో, వేసవిలో మంచు కరిగి పారే ఓ జీవనది. పైగా వర్షాకాలంలో వచ్చే వరద నీటిని పెద్ద పెద్ద తటాకాలకు (టాంక్స్)కు మళ్లించి సద్వినియోగం చేస్తే- ఢిల్లీ వాసులకు నీటి కొరత వుండదు. దీనికో పంచవర్ష ప్రణాళిక సరిపోతుంది. భూగర్భ జలంకూడా పెరుగుతుంది. శాశ్వత పరిష్కారం లభిస్తుంది. పైగా నీటిని పొందే హక్కు ప్రకృతి సహజమైనదే కాకుండా రాజ్యంగ ప్రసాదితం కూడా! రెండవది- వివిధ ఆవాస ప్రాంతాల్లో నాణ్యతతో కూడిన విద్యనందించడానికై 500 ప్రభుత్వ పాఠశాలల్ని తెరవడం, ఫీజుల్ని నియంత్రించి, డొనేషన్లు లేకుండా చేయడం. ఇదీ రాజ్యాంగబద్ధమే కాకుండా, విద్యా హక్కు చట్టం- 2009కు లోబడినదే. మూడవది- అన్ని సౌకర్యాలతో ఉచిత ప్రభుత్వ వైద్యశాలల్ని ప్రారంభించడం. ఇది కూడా రాజ్యాంగ పరిధిలోనే కాకుండా- ప్రభుత్వం ప్రైవేట్ / కార్పొరేట్ హాస్పిటల్స్‌కు రాయితీల రూపం లో ఇస్తున్న కోట్లాది రూపాయలతో సులభంగా ప్రభుత్వ వైద్యాన్ని అందించవచ్చు! పోతే, కార్పొరేట్ విద్యా సంస్థల్ని, హాస్పిటల్స్‌ని, నీటి ప్లాంట్లని నడుపుతున్న దోపిడీ రాజకీయ నాయకులకు ఇవన్నీ విచిత్రాలుగా కనపడడం ఓ విచిత్రం! నాల్గవది- కేసులకు అనుగుణంగా సత్వర న్యాయం అందించడానికై కోర్టుల ఏర్పాటు, అయిదోది- కాంట్రాక్టు పద్ధతిన పనిచేసే ఉద్యోగుల్ని రెగ్యులర్ ఉద్యోగులుగా మార్చడం- ఇదీ రాజ్యంగబద్ధమే- ఇలాంటి కొన్ని డిమాండ్లు తప్ప మిగతా డిమాండ్లు/ హామీలు ఆర్థికపరమైనవేమి కావు.
పైగా వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల సందర్భంగా ఇస్తున్న హామీలన్నీ ఆర్థికపరమైనవే కాకుండా రాజ్యాంగ విరుద్ధంగా నడుస్తున్నవే! రాజకీయ దళారుల కోసం ప్రవేశపెట్టిన ఆయా పథకాలు పెట్టుబడిదార్లను, గూండాలను, వీరిని నమ్ముకున్న రాజకీయ నాయకుల్ని పెంచి పోషిస్తున్నాయి తప్ప- ప్రజల్ని మాత్రం నిరంతరం దరిద్రుల్నిగానే వుంచుతున్నాయి. నేటికి దేశంలోని ఏ ప్రజానీకంగాని, విద్యార్థిలోకంగాని రాజకీయ పార్టీలు ఇస్తున్న హామీలను కోరలేదు. డిమాండ్ చేయలేదు. ప్రజలు కోరుతున్నదల్లా, ఉపాధి కావాలని, ఉద్యోగం కావాలని, కుల వృత్తులు ఆరోగ్యకరంగా కొనసాగాలని, వీటికి అనుకూలమైన విద్య కావాలని, ప్రకృతి వనరులు రక్షించబడాలని, వాటిని అనుభవించే అధికారం కావాలని, దున్నుకోవడానికి భూమి, సాగుకు నీటిని, పంటలకు రక్షణ, గిట్టుబాటు ధర ఇస్తే ప్రభుత్వానికే సబ్సిడీకింద ధాన్యాన్ని ఇవ్వగలమని. చేనేత, ఇతర కులవృత్తుల పరిస్థితి ఇదే! మార్కెటు మద్దతునిస్తే, సౌకర్యాలు అందిస్తే- తాను బతుకుతూ, కొంతమందికి ఉపాధిని అందించగలవు. దీనికి భిన్నంగా రాజకీయ పార్టీలు పోటీపడి ప్రణాళికారహితమైన హామీలనిస్తూ- ప్రజల, ప్రకృతి సంపదల్ని హరించివేస్తూ దేశాన్ని మొత్తంగా దివాళా తీయించారు.
కేజ్రీవాల్ ప్రతిపాదించిన మిగతా విషయాలు ప్రజాహితమైనవే కాకుండా ఆర్థికపరమైన భారం లేకుండా నెరవేరవేవే! దీనికి చిత్తశుద్ధి, నిజాయితి కావాలి. పరిపాలన సాగించడానికి, అసెంబ్లీలో బలం కావాలి. ముఖ్యంగా ఆమ్‌ఁ ఆద్మీ పార్టీ ఎంఎల్‌ఏల / మంత్రుల ఆరోగ్యకరమైన ఆలోచనా విధానం కావాలి. బహుశా ఇది కష్టసాధ్యమైతే- మిగతా రాజకీయ పార్టీల గతే ఆమ్‌ఁ ఆద్మీ పార్టీకి పడుతుంది. కాబట్టి ఇప్పుడు చర్చ జరగాల్సింది ఈ నెరవేర్చలేని హామీల గూర్చి, నిజాయితీ లేని రాజకీయ పార్టీల గూర్చి, నాయకుల గూర్చి! గడిచిన 12 పం చవర్ష ప్రణాళికా కాలంలో ఇచ్చిన హామీలు, నెరవేర్చిన పనులను మొత్తంగా సమీక్షిస్తే, అసలు రాజకీయాలు తేలుతాయి. నిజమైన లబ్ధిదారులు బయటపడుతారు. అప్పుడు ఈ హామీలు ఎంత మోసపూరితమో, ఎవరికోసం నడుస్తున్నాయో తెలుస్తుంది.
కేజ్రీవాల్ వీటన్నింటినీ కచ్చితంగా అమలుచేసి చూపుతాననే బింకానికి పోకుండా, చేయడానికి చేతులు కలుపుదామని అంటున్నాడు. చేస్తానని ముందుకువస్తే (చస్తే ఏ రాజకీయ పార్టీ రాదు) సహకరించడానికి సిద్ధంగా వున్నాడు. అందుకే, ప్రభుత్వం ఏర్పాటుకు సహకరిస్తే- మొట్టమొదటగా, రాంలీలా మైదానంలో అసెంబ్లీని (ప్రజల సమక్షంలో) ఏర్పాటుచేసి ముందుగా లోక్‌పాల్ బిల్లును ఆమోదించి, కాంగ్రెస్, బిజెపి, రాజకీయ నాయకుల అవినీతిపై విచారణను చేపడదామని, దీనికి సహకరించాలని డిమాండ్ చేస్తున్నాడు. కాంగ్రెస్‌గాని, బిజెపిగాని ప్రజాస్వామ్యంపై నమ్మకం వుంటే ఇందుకు సహకరించాలి. సహకరించినా, కేజ్రీవాల్ చేయకపోతే, అన్ని పార్టీల్లాగే ఆమ్‌ఁ ఆద్మీ పార్టీ చతికిలపడుతుంది.
అందుకే కొందరు ఈ హామీలను నెరవేర్చడానికై రాజకీయ పార్టీ సహకారం తీసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు కదా.. అని అంటున్నారు. కాని, ఆమ్‌ఁ ఆద్మీ పార్టీకి 2/3 వంతుమెజారిటీ కాకున్నా సగం సభ్యులు కూడా లేనప్పుడు ఇతరుల సహకారంతో ఏర్పాటుచేస్తే ఏం జరుగుతుందో పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ఉమ్మడి రాజకీయ ప్రభుత్వాలకై ఆలోచించడం అంటే, ఆమ్‌ఁ ఆద్మీ పార్టీని ఆదిలోనే పాతరవేయాలనే! ఆమ్‌ఁ ఆద్మీది ఓ ప్రయోగం! ప్రయో గం విఫలం కావచ్చు! సఫలం కూడా కావచ్చు! ప్రయోగమే వద్దనడం పెట్టుబడి దారి మనస్తత్వం అవుతుంది.
ఒకవేళ హామీలు ఆచరణ సాధ్యం కావనుకుంటే- రాజ్యాంగ స్ఫూర్తితో, చట్టబద్ధంగా రాజకీయ పార్టీలు ఎన్నికల బరిలో దిగాలి. హామీలకు చట్టబద్ధత వుండేలా ఎన్నికల నియమావళి రూపొందాలి. హమీలను నెరవేర్చని రాజకీయ పార్టీలకు తగు శిక్షలు(తిరిగి కొంతకాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా) వుండాలి. మెజారిటీ ఏ రాజకీయ పార్టీకి రానప్పుడు, అధిక సీట్లు వచ్చిన పార్టీ (్ఢల్లీలో బిజెపి) ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలనే చట్టం రావాలి (50 శాతంకన్నా తక్కువ ఓట్లు వచ్చిన వారు గెలుస్తున్నారు). కాదంటే- ద్విపార్టీ సిద్ధాం తం (అమెరికా / ఇంగ్లాండ్‌లా) ఏర్పాటుకై రాజ్యాంగ సవరణ తేవాలి. కాదూ, కూడదంటే- ఎవరికి మెజారిటీ లేనప్పుడు తిరిగి అయిదు సంవత్సరాలదాకా ఎన్నికలు నిర్వహించకూడదు (ప్రజాపాలనతో ప్రజలకు ఒరిగేది ఏం లేనప్పుడు).
కాబట్టి, హామీలపై, ఎన్నికల విధానంపై చర్చ జరగాలి. అవసరమైతే రాజ్యాంగ సవరణ చేయాలి. అంతేగాని, గుడి ఎజెండాలతో, విగ్రహాల ఎజెండాలతో, ఉచిత హామీలతో ముందుకు వస్తే మూలనున్న చీపుర్లు కూడా తిరగబడతాయని గ్రహించాలి!

‘గత 15 సంవత్సరాలలో మీరెదుర్కొన్న ఇబ్బందులేమిటి’ అని ఓడిపోయిన షీలా దీక్షిత్‌ను మీడియా ప్రశ్నించినప్పుడు
english title: 
main
author: 
- జి.లచ్చయ్య (సెల్ : 94401 16162)

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>