‘‘కాంగ్రెసు సంస్కృతి చాలా ఉన్నతమైంది. అతి పురాతనమైంది. వారి సంస్కృతి భారతీయ సంస్కృతికి అద్దంపడుతోంది. ఈ పరంపర తరతరాలుగా కొనసాగుతోంది’’. ఈ పరంపరను ఇలాగే కొనసాగించటం రాజకీయ అవసరం మాత్రమే కాదు. ఆధ్యాత్మిక అవసరం కూడా. ‘అమ్మ’ను పూజించటం భారతీయ సంస్కృతిలో ప్రధాన భాగం. ఈ సంస్కృతిని కాంగ్రెసువారు బాగా వంట పట్టించుకున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌వారు. కాంగ్రెసువారంతా అప్పట్లో ఇందిరమ్మను, ఇప్పుడు సోనియాగాంధీని తమ కన్నతల్లికన్నా మిన్నగా భావించి పూజిస్తున్నారు.
అప్పుడప్పుడూ బిడ్డలు తప్పుచేయటం సహజం. అమ్మ వారిని క్షమించటం కూడా అంతే సహజం. అలాంటి క్షమాగుణం సోనియమ్మలో మస్తుగా ఉంది కనుకనే కాంగ్రెసు వాళ్లంతా ఫ్లయిట్లెక్కి వీలైనన్ని ఎక్కువసార్లు ఢిల్లీ యాత్ర చేసి అమ్మను దర్శించుకుని, భజన చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అప్పుడప్పుడూ అల్లరెక్కువ చేసిన వాళ్లపై అలక చూపి దర్శనం ప్రసాదించదు. అమ్మకు అది సహజమే కదా! ఐనా సర్వసమర్పణ భావంతో పూజించి పాదాభివందనం చేసుకుంటే ఓసారికాకపోతే మరోసారైనా కరుణించక మానదు. ఆ విశ్వాసమే కాంగ్రెసు వాళ్లలో భక్తి తత్వాన్ని నిరంతరం పెంపొందింపచేస్తుంది.
గిట్టనివాళ్లు వీళ్లను భజనపరులని విమర్శించుదురు గాక! భజన చేయకపోతే ఫలితం ఎలా దక్కుతుంది? భక్తులకు మోక్షమార్గం ఎలా లభిస్తుందో, భజన పరులకు ‘అమ్మ’ భజనతో రాజకీయ పీఠం అలానే లభిస్తుంది. తద్వారా ఫలితమూ సిద్ధిస్తుంది. ఒకరిద్దరికి ఏదో కారణంగా ఫలితం లభించకపోవచ్చు. అంత మాత్రాన భజన వ్యర్థం అనుకుంటే ఎలా? ఫలితం అనేది వారివారి అదృష్టాన్నిబట్టి ఉంటుంది. ఎవరో విమర్శించారని అమ్మను పూజించటం మానేస్తామా? అమ్మపై ఈగ వాలితే మనం సహిస్తామా? పార్టీలో ఉన్నంత సేపయినా క్రమశిక్షణగా ఉండాలి కదా! దీర్ఘకాలంగా చేసిన తప్ఫఃలాన్ని ఏదో కారణంగా వదులుకుంటామా, చెప్పండి!
అమ్మకు అతిగా భజన చేయటమే విభజనకు దారితీసిందని కొందరి వాదన. విపక్షాలవారు, పత్రికలూ అమ్మ ఆలోచనను అర్థం చేసుకోలేక పోతున్నారు. ‘‘విభజన జరిగితే రెండువైపులా భజన సమానంగా జరుగుతుందనేది’’ అమ్మ భావం. రెండువైపులా భజన పోటాపోటీగా జరిగినపుడే అభివృద్ధి సాధ్యం. అది పార్టీకే కాదు. దేశానికి కూడా అవసరం. అందుకే అమ్మ విభజించాలనుకుంది. ఈ సూత్రాన్ని అర్థం చేసుకోలేకపోవటం ప్రజల పొరపాటు. విభజించినంత మాత్రాన అమ్మను భజించటం మానేస్తామా? మనకు భుజించటం ఎంత ముఖ్యమో, భజించటం కూడా అంతే ముఖ్యం. ఈ నిజాన్ని సీమాంధ్ర నాయకులు ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం అర్థం చేసుకుంటున్నారు. అందుకే నిత్య భజనకు ఏ లోపం జరుగకుండా చూసుకుంటున్నారు. కాకపోతే తెలంగాణవారు కాస్త ముందున్నారు. వారి మాతృభక్తి గుర్తింపు పొందుతోంది.
నిజానికి అమ్మ తలుచుకుంటే దేశాన్ని ముక్కలుచేసినా తప్పుపట్టకూడదు. అమ్మ మనసు గాయపడితే మాత్రం అమ్మను దూషించినంత దోషం కలుగుతుంది. మన మాతృభక్తికి కళంకం అంటుతుంది. అందుకే అమ్మకు కష్టం కలగకుండా భజన చేయటం మాత్రం మానకూడదు. ఆంధ్రప్రదేశ్ ఇవ్వాళ ఉంటుంది, రేపు పోతుంది. అమ్మ రెండు రాష్ట్రాల్ని రెండు కళ్లలా చూసుకుంటుంది. అంతకుమించి సమైక్యత అంటూ గొంతు చించుకుంటే లాభమేముంది? విడివిడిగా ఉంటేనేం.. భజన మాత్రం సామూహికంగా, చేయవచ్చు. అమ్మను ఒక రాష్ట్రం వారే కాకుండా రెండు రాష్ట్రాలవారు పూజించటం గొప్ప విషయం కదా! పాపం! ప్రజలు దీనిని అర్థం చేసుకోలేకపోతున్నారు. మన సంస్కృతిని మనం కాపాడుకొని మాతృభక్తి ప్రదర్శించటం ముఖ్యం కదా! అది మనందరి కర్తవ్యం.
‘‘కాంగ్రెసు సంస్కృతి చాలా ఉన్నతమైంది.
english title:
bazana
Date:
Saturday, December 21, 2013