రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజుల పాటు సమావేశమైతే, అందులో ఐదు నిమిషాలే సభ జరిగింది. అది కూడా నిరసనల హోరుతో అసెంబ్లీ మార్మోగింది. ఇదేమి సభ అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇది కేవలం మొదటి అద్యాయం మాత్రమే. ఈ నెల 12న అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు ఏకకాలంలో ప్రారంభమయ్యాయి. 12 నుంచి 19వ తేదీ వరకు అసెంబ్లీ ఉభయ సభలూ ఆరు రోజుల పాటు జరిగినా, మొదటి రోజు మండేలా మృతికి సంతాపంతో వాయిదా పడ్డాయి. అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు రోజున అంటే 11వ తేదీన స్పీకర్ నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బిఎసి) సమావేశమై చర్చించింది. ఈ నెల 20వ తేదీ వరకూ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. సభ ప్రారంభమైన రోజే సాయంత్రం రాష్టప్రతి తన వద్ద ఉన్న బిల్లును కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి ద్వారా హైదరాబాద్‌కు పంపించారు. సదరు అధికారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆ బిల్లును అందజేసి, దాని ప్రతులను అసెంబ్లీ కార్యదర్శికి, గవర్నర్ కార్యాలయంలో అందజేసి తిరిగి వెళ్ళిపోయారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆ బిల్లును 13వ తేదీన అసెంబ్లీకి పంపిస్తారని సభ్యులంతా ఆకాంక్షించారు. కానీ మధ్యాహ్నం వరకూ ఆ బిల్లు దాఖలాలు లేవు. ఉభయ సభలూ మధ్యాహ్నం వాయిదా పడిన తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి తీరిగ్గా ఆ బిల్లు అసెంబ్లీ కార్యదర్శి సదారామ్‌కు చేరింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి వ్యూహాత్మకంగా ఆ బిల్లును అసెంబ్లీకి చేరకుండా జాప్యం చేయించారన్న ప్రచారం జరిగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ఆ బిల్లును తన వద్దే ఉంచుకుని, అసెంబ్లీని అగౌరపరిచారని తెలంగాణకు చెందిన అన్ని పార్టీల ఎమ్మెల్యేలు సిఎస్‌పై స్పీకర్‌కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. 12నే బిల్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చేరుకున్నందున ఆ బిల్లును సభలో ప్రతిపాదించాలంటూ అన్ని పార్టీల తెలంగాణ ఎమ్మెల్యేలు డిమాండ్ చేయడం, స్పీకర్ సభను అర నిమిషంలోనే వాయిదా వేయడం జరిగింది. ఇలా రెండు పర్యాయాలు వాయిదా వేసి, మూడో సారి సోమవారానికి వాయిదా వేశారు. సోమవారం రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లును సభ్యుల బల్లల (లేయిడ్ ఆన్ టేబుల్)పై ఉంచారు. ఆ బిల్లుకు సంబంధించిన కవరింగ్ లేఖను అసెంబ్లీ కార్యదర్శి సదారామ్ సభలో చదివారు.
ఆ రోజు నుంచి టి.బిల్లుపై చర్చ చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు, తెలంగాణకు చెందిన కాంగ్రెస్, టిడిపి ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి డిమాండ్ చేయగా, అదే సమయంలో సీమాంధ్రకు చెందిన ఎమ్మెల్యేలు సమైక్య తీర్మానం చేయాలంటూ నినాదాలు చేయసాగారు. దీంతో నాటి నుంచి మూడు రోజుల పాటు (గురువారం సభ వాయిదా పడేంత వరకు) సభ ఒకటి, రెండు నిమిషాలకు మించి సాగలేదు. స్పీకర్ సభాధ్యక్ష స్థానంలోకి రావడం, సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరడం, దానిని ఇరు ప్రాంతాలకు చెందిన వారు లెక్క చేయకపోవడంతో సభను వాయిదా వేయడం పరిపాటయ్యింది. చివరకు ఈ నెల 20వ తేదీ వరకు నిర్వహించాలనుకున్న సభను 19నే వాయిదా వేసి, వచ్చే నెల 3వ తేదీన తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు.
రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై సభలో ఆరు వారాల పాటు చర్చించి అభిప్రాయాలు పంపించాల్సిందిగా రాష్టప్రతి ఆ లేఖలో పేర్కొనగా, టి. ముసాయిదా బిల్లును ప్రతిపాదించిన మొదటి విడతలో ఐదు రోజులు సభ జరగ్గా, మొత్తంమీద ఐదు నిమిషాలే సభ జరిగింది. అయిదు రోజు లు అంటే ప్రతి రోజూ సుమారు ఐదు గంటల పాటు చర్చ జరిగినా 25 గంటల పాటు చర్చ జరిగి ఉండేది. కానీ పరిస్థితులు చర్చ జరగడానికి ఆస్కారం కల్పించలేదు. సమైక్య తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయగా, టి.ముసాయిదా బిల్లుపై చర్చ జరగకుండా టిడిపి, కాంగ్రెస్ పార్టీల సీమాంధ్ర ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేస్తున్నారు. సభ వచ్చే నెల (జనవరి) 3వ తేదీకి వాయిదా పడింది. 3న ప్రారంభమయ్యే సభ 10వ తేదీన వాయిదా పడుతుంది. సంక్రాంతి పండుగ సెలవుల అనంతరం సభ తిరిగి 16న ప్రారంభమవుతుంది. ఈ లెక్కన ఆరు వారాల్లో చర్చించాల్సిన టి. ముసాయిదా బిల్లు తుది గడువు 23వ తేదీ సమీపిస్తుంది. కేవలం 14 రోజులు చర్చకు అవకాశం ఉంది. ఈ మిగిలి ఉన్న రోజుల్లో ప్రతి రోజూ ఐదు గంటల చొప్పున చర్చ జరిగినా సుమారు కొద్దిగా అటు-ఇటుగా 60 నుంచి 65 గంటలు మిగిలి ఉన్నట్లే. అది కూడా చర్చ సజావుగా జరిగితేనే. చర్చ జరగకుండా సభ ప్రారంభంకాగానే మళ్లీ సమైక్యాంధ్ర తీర్మానం చేయాలని సీమాంధ్ర ఎమ్మెల్యేలు పట్టుబట్టినా, తెలంగాణ ముసాయిదా బిల్లుపై వెంటనే చర్చ చేపట్టి, సభ్యుల అభిప్రాయాలను రాష్టప్రతికి పంపించాలని టి.ఎమ్మెల్యేలు డిమాండ్ చేసినా ఫలితం ఉండదు. చర్చ సాఫీగా జరిగితేనే రాష్ట్ర విభజనకు ఎందుకు అడ్డుపడుతున్నామనేది చెప్పేందుకు అవకాశం ఉంటుందన్న అభిప్రాయాన్ని మెజారిటీ ఎమ్మెల్యేలు వ్యక్తం చేస్తున్నారు. చర్చ సాఫీగా సాగితే సంక్రాంతి పండుగ సెలవుల తర్వాత టి.బిల్లుపై మరింత గడువు కావాలని రాష్టప్రతిని కోరేందుకు ముఖ్యమంత్రికి అవకాశం ఉంటుంది. సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగించడం వల్ల ప్రజాధనం దుర్వినియోగమైనట్టే. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ప్రతి నిమిషానికి లోగడ 8,867 రూపాయల వ్యయం కాగా పెరిగిన ధరలను బట్టి ఇప్పుడు 10 వేలకు పైగానే ఉంటుంది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకుని విజ్ఞులైన ఎమ్మెల్యేలు ఆలోచనతో ప్రవర్తిస్తారని ఆశిద్దాం.
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజుల పాటు సమావేశమైతే, అందులో ఐదు నిమిషాలే సభ జరిగింది.
english title:
rachabanda
Date:
Saturday, December 21, 2013