ఇటీవల భారతీయ మహిళా బ్యాంకును ప్రారంభించటం ఎంతో శుభపరిణామం. ఇది మహిళలకు ఎంతో శ్రేయస్కరం. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో బ్యాంకుల్లో లావాదేవీలు జరుపుతున్నది ఎక్కువగా మహిళలే అనటం అతిశయోక్తికాదు. వ్యాపార రంగంలోను వివిధ ఉద్యోగాల్లోను మహిళలు రాణిస్తున్నారు. ఇలాంటి వారికి తప్పనిసరిగా బ్యాంకుల్లో ఖాతాలు తెరవటం వంటివి ఎన్నో లావాదేవీలుంటాయి. అంతేకాక ప్రభుత్వపరంగా మహిళలకు స్వయం సహాయక మహిళా సంఘాలు ఇందిరమ్మ ఇళ్ళు వంటివి ఏర్పడ్డాయి. అంతేకాక పింఛన్లు కూడా బ్యాంకుల ద్వారా ఇస్తామంటున్నారు. వాళ్ళు తప్పనిసరిగా బ్యాంకుల్లో ఖాతాలు తెరవాలి. అలాగే స్కాలర్‌షిప్ వంటివి పొందడానికి విద్యార్థులు బ్యాంకుల్లో ఖాతాలు తెరవాలి. ఈ నేపథ్యంలో బ్యాంకుల్లో అడపాదడపా మహిళలను అధికారులు అవమానించటం, దురుసుగా ప్రవర్తించటం అసభ్యంగా ప్రవర్తించటం వంటి గొడవలను వింటుంటాము. దీనికి పరిష్కారంగా మహిళా బ్యాంకులను తెరవటం హర్షదాయకం. ఇక నుంచి మహిళల పట్ల జరుగుతున్న దుశ్చర్యలను అరికట్టవచ్చునని భావించవచ్చు. కొద్దిగానైనా.
- షహానాజ్, అనంతపురం
భయపెడుతున్న రిజర్వ్ బ్యాంకు
ప్రజలను భయభ్రాంతులను చేసే పాలన ఏదీ చిరకాలం మనజాలదు! అంటాడు కౌటిల్యుడు.మరిప్పుడిదే. పోయేకాలమో అర్ధంకావటమే లేదు. ప్రభుత్వమూ దానికి సంబంధించిన అన్ని శాఖలూ ఏదో ఒక వంక, ఒక కొర్రీ వేస్తూ నిమిష నిమిషానికీ ప్రజలను అర్ధంకాని అయోమయానికీ, భయానికీ గురిచేయటం, చేస్తూ వుండడం శోచనీయం. ‘కరెన్సీ నోట్లపై వ్రాతలుంటే 2014 జనవరి 1నుండే ఆ నోట్లు ఇక చెల్లవు’ అంటూ రిజర్వ్ బ్యాంకు ప్రకటించడమూ ఆ కోవలోనిదే కావటం గమనార్హం.నిజమే- వ్రాయరాదు. అది ‘చీటీకాదు’. కానీ ఎవరో వ్రాస్తే, గీస్తే వచ్చిన ‘కరెన్సీని’ ఈ రోజుటికీ అనేక బ్యాంకుల నుండే ప్రజల చేతులకందట. విస్మరించరాదు. స్వయంగా బ్యాంకు అధికారులే అంకెల మొత్తాన్ని బరబరా నోట్లకట్ట మొదటి నోటుపై ‘బరకటం’ నిత్యమూ మనం గమనించే అంశం. ఇలాంటి పరిస్థితులలో ఉన్నపళాన అవి చెల్లవూ అంటే సామాన్యులూ, మధ్యతరగతి జీవులు, గ్రామీణ కర్షకులూ, కూలీలూ వాళ్ల దగ్గరవి వుంటే- వుండితీరతాయి కూడా- ఏం కావాలి!వీళ్లందరూ నష్టపోవాల్సిందేనా? నియమం నిబంధించేముందు కాస్త ఆలోచనా, వ్యవధీ రెండూ గమనిస్తే మంచిది!
- దినకర్, నంద్యాల
అందుబాటులో లేని ఉల్లి రేట్లు
ఉల్లి హత్యలుడబ్బు కోసమో, బంగారం కోసమో దొంగతనాలు జరుగుతున్నాయి. అడ్డువచ్చిన వారిని హతమారుస్తున్నారు. ఇప్పుడిది మరో రూపాంతరం సంతరించుకున్నది. ఉల్లి రేటు సామాన్య ప్రజల స్తోమతుకు మించి పలుకుతున్నది. వీటిని కూడా దొంగిలించి సొమ్ముచేసుకోవాలనే దుర్బుద్ధి పుట్టడంవల్ల ఉల్లి లారీని అడ్డగించి, డ్రైవరును, క్లీనరును హత్యచేసి ఉల్లిగడ్డలను అపహరించారు. మరో ఆశ్చర్యకరమైన వార్తేమిటంటే కాపలాదారుని చంపి ఉల్లి బస్తాలను ఎత్తుకుపోయారుట. భవిష్యత్తులో నీళ్ళ బిందెలను, బీరువాలోని బట్టలను, ఇంట్లోని వెచ్చాలను కూడా దొంగిలించే వారొస్తారేమో! ప్రతిఘటించిన వారి అంతు చూస్తారేమో!
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
చేనేత కార్మికులను ఆదుకోవాలి
చేనేత సహకార సంఘాలు, అసంఘటిత రంగాల ద్వారా వేలాదిమంది కార్మికులు చేనేతను నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ఏటా కోట్లాది రూపాయల వస్త్రాలను క్రయవిక్రయాలు చేస్తున్న ఆప్కో విక్రయాలు ఈమధ్యకాలంలో మందగించడంతో దాన్ని నమ్ముకుని నడుపుతున్న సంఘాలు ఆర్థికంగా ఇబ్బందుల పాలవుతున్నాయి. ఫలితంగా కార్మికుల ఉపాధి అవకాశాలకు భారీగా గండిపడి కుదేలయ్యే పరిస్థితి దాపురించింది. నిల్వ ఉండిపోయిన కోట్ల రూపాయల విలువైన వస్త్రాలను వివిధ ప్రభుత్వ సంస్థల సిబ్బందికి, ప్రభుత్వ వసతి గృహాల విద్యార్థులకు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో దుప్పట్లు, వస్త్రాలు తదితరాలకు తప్పనిసరిగా ఆప్కో ద్వారా కొనుగోలుచేయాలని ప్రభుత్వ ఉత్తర్వులు జారీచేసి, వాటిని కచ్చితంగా అమలుచేస్తే చేనేత సహకార సంఘాలు అనతికాలంలోనే బలోపేతమవుతాయి. అసంఘటిత రంగంలో ఉన్న నేతన్నలకుకూడా ఉపాధి అవకాశాలు విరివిగా లభ్యమవుతాయి. ప్రభుత్వం ఈ దిశగా సత్వరం ఆదేశాలిచ్చి చేనేతకారుల ఉపాధి లేమిని తొలగించి, వారి జీవనాన్ని సంరక్షించాలి.
- పట్టెం వెంకట నాగేశ్వరరావు, చెరుకుపల్లి
ఇటీవల భారతీయ మహిళా బ్యాంకును ప్రారంభించటం ఎంతో శుభపరిణామం.
english title:
uttarayanam
Date:
Saturday, December 21, 2013