ఇటీవల వార్తల్లో ‘హైకమాండ్’, ‘అధిష్ఠానం’అనే మాటలు తరచుగా వస్తున్నాయి. ఆ మాటలకు అర్థమేమిటి? అవేమైనా ప్రజల చేత ఎన్నుకోబడిన పదవులా? ‘‘విభజన ఆగదు’’అని నాయకులు చెపుతున్నారు. అది ఒక వ్యక్తి తీసుకోవలసిన నిర్ణయమా? మనది ప్రజాస్వామ్య దేశంకదా! విభజన కావాలో, సమైక్యం కావాలో ఓటింగ్ పెట్టండి. మెజారిటీ ప్రజలు కోరుకున్నట్లు చేయండి. అప్పుడు ప్రజాస్వామ్యాన్ని గౌరవించినట్లు అవుతుంది.
- జి.మురళీకృష్ణ, రేపల్లె
విభజనను రద్దు చేయండి
గీ.మాలిక॥ పార్టీ ఉనికిని కాపాడు పట్టుదలకు
పదునుపెట్టిన ‘కాంగ్రెసు’ అదునుజూసి
రాష్ట్ర విభజన జేబూన పూనుకొనగ
మనదు సీమాంధ్ర మెల్లయు మసకబారు..
అనుచు సకల జనాళి! తా! ప్రతిన బూని
యిట్టి దుర్నిర్ణయంబును ఎట్టి స్థితిని
సాగనీయకూరూర సభలు జరిపి
ఉద్యమించఁ సమైక్యాంధ్ర సాధనకును
ఢిల్లీ పెద్దలు ఇకనైన తెలుగువారి
వాడి నాడిని గ్రహించి వల్లె! యనుచు
రాష్ట్ర విభజన ప్రకటన రద్దుజేసి
యావదాంధ్రుల మనముల నలరుగాక!!
- గొల్లపూడి శివయ్య, అంగలకుదురు
నగదు బదిలీ వద్దు
కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్‌పై సబ్సిడీ పొందడానికి ఆధార్ కార్డులను బ్యాంక్‌లతో ముడిపెట్టి ప్రజలందరినీ నానా కష్టాల్లోకి నెట్టింది. తద్వారా సామాన్యులు పడే అవస్థలను అర్ధంచేసుకుని (సుప్రీం) హైకోర్టులు గ్యాస్‌కు ‘ఆధార్’ లింకు వద్దని తీర్పు చెప్పడం, హర్షిస్తూ.. కోర్టులకు ప్రజలందరం కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ప్రజాసంక్షేమ పధకాలలో ప్రభుత్వ సబ్సిడీ భాగస్వామ్యం.. ఇంత ఉందనే ప్రచారంతో ప్రజల్లోకి తీసుకెళ్లి.. కేంద్రంలో మళ్లీ తమ ప్రభుత్వమే రావాలనే దుర్బుద్ధితో నగదు బదిలీ పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకంవల్ల ప్రజలు ప్రయోజనం పొందకపోగా కష్టనష్టాలే ఎక్కువవుతాయి. కాబట్టి నగదు బదిలీ పథకం ఆంక్షలను రద్దుపరిచి పూర్వ స్థితిలో ఇచ్చినట్టే సంక్షేమ పథకాలు అమలుచేయగలరు.
- ఎన్.నరసింహారెడ్డి, రుద్రారం
మహిళా బ్యాంకువల్ల ఒరిగేదేంటి?
మహిళా బ్యాంకులు మహిళా సాధికారతకు చిహ్నాలు అంటూ మరీ ఎక్కువగా పొగడటం అనవసరం. ప్రస్తుతం బ్యాంకుల్లో మహిళలు కూడా పనిచేస్తున్నారు. మగ సిబ్బందితోబాటు వీరు కూడా పనిపట్ల నిర్లక్ష్యం, కస్టమర్లపట్ల చిన్నచూపు ప్రదర్శిస్తున్నారు. అయితే జాతీయ బ్యాంకుల్లో నెల మొదటివారం, చివరి వారం జంకు లేకుండా స్వయం సహాయక సంఘాల గ్రామీణ మహిళలు సందడి చేస్తూనే ఉన్నారు. మగవాళ్లు పనిచేసే బ్యాం కులకు వెళ్లడానికి వెనుకంజ వేయడం లేదు. అలాంటప్పుడు మహిళా బ్యాంకులవల్ల ప్రత్యేకంగా ఒరిగేది ఏముంది?
- చంపక్, కాకినాడ
రాహుల్ ఆత్మస్తుతి
సమాజంలోని పేదలు, బలహీనవర్గాల సంక్షేమంకోసం పాటుపడేది ఒక్క కాంగ్రెస్ పార్టీయేనని ఎన్నికల ప్రచార సభలలో ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆత్మస్తుతి చేసుకోవడం చాలా వింతగా వుంది. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత అధికకాలం కాంగ్రెస్ పార్టీయే కేంద్రం లో అధికారంలో వుంది. రాహుల్ చెప్పినట్లుగా, పేదలకోసం నిజంగా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేసినట్లయితే ఈపాటికి దేశంలో పేదరికం మటుమాయం అవ్వాలి కదా? రాహుల్‌జీ! ఏమంటారు? పేదరికం తగ్గకపోగా... మరింత విస్తృతం అవుతున్నదేమిటి? ఇది కాంగ్రె స్ ఏలుబడి ఫలితం కాదా? ఆత్మశోధన చేసుకోండి..
- గుర్రం శ్రీనివాస్, చెరుకుపల్లి
సహజీవనం నేరమే
వివాహం కాకుండా స్ర్తిపురుషులు కలసి జీవించడం నేరం కాని, పాపం కాని కాదని యిచ్చిన సుప్రీంకోర్టు తీర్పు ఏమాత్రం మన సంస్కృతి సంప్రదాయాలకు సమ్మతం కాదు. సహజీవనంవల్ల కలిగే పిల్లలకు రక్షణకోసం చట్టం చేయమని సూచించడం సముచితం. అంతేకాని సంప్రదాయాలను మంటగలపవద్దు. ఇలాంటి ఆలోచనలు న్యాయ కోవిదులకు కలగడం విచారకరం. ఈ అసహజ జీవనాల మీద సినిమాలు కూడా వస్తే యువత పెడదారులు పడిపోయే ప్రమాదం కలుగుతుంది.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్