వచ్చే జనవరి 17వ తేదీన అఖిల భారత కాంగ్రెస్ సమావేశం జరగబోతున్నది. అందరూ అనుకుంటున్నట్టుగానే..పార్టీ తరపున ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీని ఈ సమావేశాల్లో ప్రకటించే అవకాశాలున్నాయి. ఒకవేళ ఆవిధమైన ప్రకటన వస్తే..ప్రధాని అభ్యర్థి విషయంలో పార్టీ గతంలో అనుసరించిన వైఖరికి ఇది పూర్తి భిన్నం కాగలదు. దేశానికి ప్రధమ ప్రధానిగా వ్యహరించిన జవహర్‌లాల్ నెహ్రూ కాలంలో అసలు ప్రధాని అభ్యర్థి ఎవరన్న ప్రశే్న ఉదయించలేదు. ఎప్పటికప్పుడు నాటకీయమైన మార్పులతో కూడిన రాజకీయ జీవితాన్ని గడిపిన ఇందిరాగాంధీ-తొలినాళ్ళలో ‘మాటలు రాని బొమ్మ’ మాదిరిగా ఉండేది. అటువంటి ఆమె 1971లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో విజయం సాధించడం, బంగ్లాదేశ్ ఆవిర్భావం వంటి పరిణామాలతో, ఒక్కసారిగా ‘అపర దుర్గ’గా వినుతికెక్కింది. మళ్ళీ 1975లో విధించిన అత్యవసర పరిస్థితి పుణ్యమాని, ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. కానీ 1980 జనవరిలో జరిగిన సాధారణ ఎన్నికల్లో అసాధారణ మెజార్టీ సాధించి అధికారంలోకి వచ్చింది-్భవిష్యత్తు రాజకీయాలు మొత్తం వంశపారంపర్యంగానే సాగుతాయన్న సత్యాన్ని బహిరంగంగా వెల్లడించకపోయినా, చేతల్లో చాలా స్పష్టంగా తెలియజెప్పారు. ఎట్లా అంటే తన తర్వాత రాజకీయ వారసుడిగా రెండో కుమారుడు సంజయ్ గాంధీని పైకి తీసుకొని రావడానికి యత్నించడం ద్వారా. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న సంజయ్‌గాంధీ, ఏమాత్రం జవాబుదారీతనం లేకుం డా, అపరిమితమైన అధికారాలను చెలాయించాడు. దురదృష్టవశాత్తు 1980 జూన్ నెలలో సంజయ్ మరణంతో, ఇందిర తీవ్ర కలవరపాటుకు గురయ్యారు. తర్వాత తన పెద్ద కుమారుడు, రాజకీయాల్లోకి రావడానికి ఏమాత్రం ఉత్సాహం చూపని, రాజీవ్ గాంధీని రాజకీయాల్లోకి..ఒకరకంగా చెప్పాలంటే బలవంతంగా దింపారు.
తర్వాత కొద్దికాలానికే ఇందిరాగాంధీ హత్యకు గురయ్యారు. తక్షణమే రాజీవ్ గాంధీ దేశ ప్రధానిగా పాలనా పగ్గాలు చేపట్టారు. ప్రధానిగా ఆయన ప్రమాణ స్వీకారం కూడా ఎంతో నిరాడంబరంగా జరిగింది. 1989 ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైనా.. 1991లో తిరిగి అధికారంలోకి వచ్చే సూచనలు పొడచూపాయి. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు ప్రభుత్వాలు వెంట వెంటనే పడిపోవడంతో, రాజీవ్‌గాంధీ ఆగమనం అత్యవసరమైంది. పరిస్థితులు కూడా అందుకు అనుకూలిస్తున్న తరుణంలో ఎల్‌టిటిఇ ఉగ్రవాదుల చేతిలో ఆయన హత్యకు గురయ్యారు. రాజీవ్ మరణంతో పెను విచారంలో మునిగిపోయిన సోనియా గాంధీ అధికార పగ్గాలు చేపట్టడానికి సుముఖత వ్యక్తం చేయలేదు.దీంతో వంశపారంపర్య పాలనా శృంఖలం తెగిపోయింది. అయితే 1998లో అమె కాం గ్రెస్ అధ్యక్ష పదవిని స్వీకరించారు. 2004లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొని రాగలిగారు. అయితే ప్రధాని పదవిని స్వీకరించడానికి అంగీకరించలేదు. దీంతో అప్పటినుంచి, అధికార కేంద్రం ప్రధానమంత్రి నుంచి పార్టీ అధ్యక్షురాలికి మారిపోయింది. పార్టీ అధ్యక్షురాలిగా తెర వెనుకనుంచి, జవాబుదారీతనం లేని అపరిమిత అధికారాన్ని చెలాయిస్తున్నారు.
ఇదంతా పరిశీలిస్తే స్వాతంత్య్రోద్యమకాలంనుంచి దేశ ప్రజల్లో అపరిమితమైన పలుకుబడి కలిగిన అత్యంత పురాతన కాంగ్రెస్ పార్టీకంటే..నేడు నెహ్రూ వంశమే ప్రధానమైన పోయిందన్న సత్యం అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ప్రధాని పదవిని కోరే హక్కు వంశానుక్రమం ప్రకారం కేవలం రాహుల్ గాంధీకి మాత్రమే ఉంది. మరొకరు ఆ స్థానాన్ని కోరుకోవడానికి వీల్లేదు. అధికారికంగా ప్రకటించినా ప్రకటించకపోయినా రాహుల్ గాంధీ మాత్రమే కాంగ్రెస్‌కు ప్రధానమంత్రి అభ్యర్థి. ఇందులో ఎటువంటి మీమాంసకు తావులేదు. మరయితే కాంగ్రెస్‌ను లేదా దాని మిత్ర పక్షాలను తొలిచే ప్రశ్న ఒకటుంది. వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టడానికి అవసరమైన స్థానాల్లో గెలుపొందగలమా? లేదా? అన్నదే ఆ ప్రశ్న! ఇదిలావుండగా, ప్రస్తుత దేశ రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థిత్వాన్ని తిరస్కరించే అవకాశమున్నదని చాలా మంది రాజకీయ పండితుల అంచనా. తాను, ‘బయటివాడినే’ అంటూ రాహుల్ చాలా సందర్భాల్లో పేర్కొనడాన్ని తమ అంచనాకు మద్దతుగా వారు చూపుతున్నారు. అంతేకాదు, ప్రధాని పదవిపై పెద్దగా ఆసక్తి కనబరచకపోవడం, పార్లమెంటులో ఆయన వ్యవహారశైలి నిరాశాజనకంగా ఉండటం, తాను ప్రచార బాధ్యతలు నిర్వహించిన రాష్ట్రాల్లో పార్టీ ఓటమి పాలుకావడం వంటివి పరిశీలిస్తే వారి అంచనాల్లో సహేతుకత ఉన్నదనే అనిపిస్తుంది.
ప్రధాని పదవిని రాహుల్ తిరస్కరిస్తే, ప్రత్యామ్నాయావకాశాలపై, కొన్ని టివి చానళ్లలో చర్చలు కూడా జరిగాయి. రాహుల్‌కు ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం హోంశాఖను నిర్వహిస్తున్న సుశీల్ కుమార్ షిండే పేరు ఈ చర్చల్లో ప్రస్తావనకు వచ్చింది. ముఖ్యంగా ‘దళిత’కార్డు ప్రయోగించడానికి షిండే ఎంతో ఉపయోగపడవచ్చని చర్చల్లో పాల్గొన్నవారి అభిప్రాయం. ఇదిలావుండగా కాంగ్రెస్...తొమ్మిది రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న జాట్‌ల ఓటు బ్యాంకుకోసం తీవ్రంగా కృషి చేస్తున్నది. ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓటమి పాలైన దగ్గరినుంచి రాహుల్ ప్రసంగాల్లో చాలా మార్పు వచ్చింది. అవి సారహీనమై ఉంటున్నాయి. తల్లి సోనియాగాంధీ పార్టీ ఓటమిపై ‘లోతైన అంతర్మథనం’ జరగాలని పేర్కొంటే, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళాలంటూ రాహుల్ గాంధీ పేర్కొంటున్నారు. అధికారంపై ఆశలేని వ్యక్తి మాట్లాడే మాటలు కావివి. రాహుల్ గాంధీ ‘మళ్ళీ కార్యరంగంలోకి దిగడానికి’ యత్నిస్తున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇటీవల జరిగిన భారత ‘వాణిజ్య మరియు పారిశ్రామిక మండలి సమాఖ్య’ (ఎఫ్‌ఐసిసిఐ) సమావేశంలో రాహుల్ ప్రసంగించినప్పుడు..గత ఏప్రిల్‌లో జరిగిన భారత పారిశ్రామిక సమాఖ్య (సిఐఐ) సమావేశంలో లేవనెత్తడానికి ఇష్టపడని అంశాలను ప్రస్తావించడం గమనార్హం. లోక్‌పాల్ బిల్లును ఆమోదింపజేయడం తమ పార్టీ ఘనకార్యమేనని చెప్పుకున్నారు. అంతేకాదు అన్నా హజారే అత్యంత గౌరవనీయుడైన కార్యకర్త అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఎఫ్‌ఐసిసిఐ సమావేశంలో పరిశ్రమలు ఎదుర్కొంటున్న కష్టాలను చాలా జాగ్రత్తగా విన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ నేతృత్వలోని యుపిఎ ప్రభుత్వం అనేక ముఖ్యమైన విషయాల్లో సత్వర నిర్ణయాలు తీసుకోకుండా తాత్సారం చేస్తున్నదంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలోని వౌలిక సదుపాయాలను మరింతగా వృద్ధి చేయాలంటే, ఈ భయంకరమైన జాప్యం నుంచి ముందు బయటపడాలంటూ వారు రాహుల్‌కు వివరించారు.
ఎఫ్‌ఐసిసిఐ సమావేశంలో ప్రసంగిస్తున్న సందర్భంగా, పారిశ్రామిక వేత్తలకు అనుమతుల్లో తీవ్ర జాప్యం కేవలం పర్యావరణ, అటవీ శాఖ మంత్రి జయంతీ నటరాజన్ వల్లనే జరుగుతున్నదని చెప్పకనే చెప్పారు. అయితే రాహుల్ ప్రసంగం ముగిసేలోగానే కార్యాచరణ చేసి చూపాలనుకున్నారో ఏమో తెలియదు కానీ, కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి జయంతీ నటరాజన్‌కు అప్పటికప్పుడే ఆదేశాలు వెళ్ళిపోయాయి. ఆమె తన పదవికి రాజీనామా చేసి, పార్టీకోసం పనిచేయడంకోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఇదిలావుండగా పార్టీ కోసం పనిచేయాలంటూ మరికొందరు మంత్రులను కూడా ఆదేశించే అవకాశాలున్నాయని అంటున్నారు. ముఖ్యంగా సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ‘రాహుల్ మార్కు’ మార్పులు చేర్పులు చేపట్టే కార్యక్రమం మొదలైంది.
ప్రస్తుతం రాహుల్ చూపే పరిష్కారాలు చాలా కొద్దివి మాత్రమే. ఈ నేపథ్యంలో ‘వేగంగా తాను వెనక్కు రంగంలోకి వచ్చే ప్రకియ’ అనేది చాలా ఆలస్యంగా చేపట్టిన ‘కొద్ది పాటి’ పనిగా చాలామంది రాజకీయ విశే్లషకులు అభివర్ణిస్తున్నారు. ‘అసలు పనిచేయకుండా ఉన్నదానికంటే కనీసం ఆలస్యంగానైనా ఎంతోకొంత చేసామనపించుకోవడం ఉత్తమం’ అనే సామెత రాహుల్‌కు చక్కగా వర్తింస్తుందనే చెప్పాలి. ఇక్కడ రాహుల్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఒకటుంది. ఆయన చెప్పేదానికి..కేంద్రంలోని, వివిధ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలు చేస్తున్నదానికి అసలు పొంతనే ఉండటం లేదు. ఉదాహరణకు ఎఫ్‌ఐసిసిఐ సమావేశంలో ఆయన పదేపదే చెప్పింది.. దేశం ఎదుర్కొంటున్న అతి ప్రధాన సమస్య ‘అవినీతి’ అని. ‘ప్రాణం పోయే వరకు ప్రజల రక్తాన్ని పీల్చేస్తున్నారు’ అంటూ ఆయ వ్యాఖ్యానించారు. మరి ఆయన ఈవిధంగా వ్యాఖ్యానించి 24 గంటలు కూడా కాలేదు. యుపిఎ ప్రభుత్వంలో సంకీర్ణ భాగస్వామి అయిన నేషనలిస్టిక్ కాంగ్రెస్ పార్టీ....ఆదర్శ కుంభకోణంపై జ్యుడిసియల్ కమిషన్ నివేదికను తిరస్కరిస్తున్నట్టు ప్రకటించింది! కనీసం నలుగులు మాజీ మహారాష్ట్ర ముఖ్యమంత్రులు ఆదర్శ కుంభకోణంలో భాగస్వాములుగా ఉన్నారని నివేది స్పష్టం చేసింది. కాగా, 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం, బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణంపై, ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదంటూ తనను ప్రశ్నించే అవకాశాన్ని భారతీయ జనతాపార్టీకి రాహుల్ ఇచ్చాడు.
రాహుల్ మాట్లాడే మాటలు ఈవిధంగా ఉంటుండగా మరో విచిత్ర సంఘటన ఏంటంటే...కాంగ్రెస్ అధిష్ఠానం, బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ పార్టీతో ఎన్నికల పొత్తు కుదుర్చుకోవడం. బహుశా రాహుల్ గాంధీ కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను చించివేయకుండా ఉన్నట్లయితే, లాలూకు జైలుశిక్ష పడివుండేది కాదు. ఆయన సలక్షణంగా రాబోయే ఎన్నికల్లో పోటీచేసి ఉండేవాడు. మరి ఈ అంశాలన్నీ 2014 ఏప్రిల్ నెలలో జరుగబోయే ఎన్నికల్లో కచ్చితంగా ప్రజలముందుకు ప్రస్తావనకు వచ్చి తీరతాయి. ఎన్ని రాజకీయాలు చేసినా పరస్పరం ఒకరినొకరు నిందించుకున్నా, ఓటర్లు మాత్రమే తుది తీర్పరులు!
ఫీచర్
english title:
feature
Date:
Friday, December 27, 2013