
కొద్ది రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతోన్న చిత్ర పరిశ్రమ ఈ ఏడాది మూడువందల కోట్ల రూపాయల పైపెచ్చు నష్టాల్లో కూరుకుపోయిందని సమాచారం. ప్రస్తుత వ్యాపార పంధాకి అనుగుణంగా భారీ చిత్రాల్ని అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తూ- అంతే మొత్తంలో వసూళ్ళను ఆర్జిస్తున్న నిర్మాతలు, కొనుగోలుదారులు విజయాలతోపాటు పరాజయాల్ని చవిచూస్తున్నారు. పెద్ద సినిమాలు తెచ్చుకున్న హిట్ టాక్‌నిబట్టి, సదరు నిర్మాత పరిస్థితి ఆధారపడి ఉంటోంది. ఏమాత్రం కొంచెం అటూఇటూ అయినా ఇక ఇంతే సంగతులు!
‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు’, ‘నాయక్’ సినిమాలతో ఆరంభమైన ఈ ఏడాదిలో ఇప్పటివరకూ సూపర్ అని చెప్పుకుని చూసే విధంగా ఏ సినిమా కూడా లేదు. ఒక్క ‘అత్తారింటికి దారేది’ తప్ప! రామ్‌చరణ్‌తేజ్ చేసిన ‘తుఫాన్’ పూర్తిగా పోయింది. ఇక ఎన్టీఆర్‌తో వచ్చిన ‘బాద్‌షా’ పని కూడా అదే విధంగా ఉంది. ‘రామయ్యావస్తావయ్యా’ సంగతి చెప్పనక్కర్లేదు. కేవలం ప్రారంభ వసూళ్ళకే పరిమితమైన ఈ సినిమా కొనుగోలుదార్లకి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. నాగార్జున ‘గ్రీకువీరుడు’ ఫర్వాలేదనిపించుకున్నా ‘్భయ్’తో నాగార్జునే స్వయంగా నష్టపోయిన దాఖలాలున్నాయి. వెంకటేష్ ‘షాడో’ ఘోరంగా దెబ్బతిన్నది. మల్టీస్టారర్స్ చేస్తే మంచిదనుకున్న ‘మసాలా’ పెద్ద ప్లాప్‌గా మిగిలింది. రామ్-్భస్కర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఒంగోలుగిత్త’ ప్రేక్షకుల్ని దూరం చేయడం ద్వారా కొత్తదనం ఏమాత్రం లేకపోవడంతో జనం విసుక్కున్నారు.
సునీల్ చేసిన ‘మిస్టర్ పెళ్లికొడుకు’ కనీస కలెక్షన్లుకూడా రాబట్టుకోలేకపోయింది. సిద్ధార్థ్ చేసిన ‘జబర్దస్త్’లో సమంత ఉన్నప్పటికీ ప్రేక్షకులకు ఎక్కలేకపోయింది. రామ్‌గోపాల్‌వర్మ తీసిన సత్య-2 ఏ విధంగానూ అతని ఇమేజ్‌ని కాపాడలేకపోగా మంచుగడ్డమీంచి జారిపడినట్లయింది. 3డి టెక్నాలజీ అంటూ జనం మీదకు తోసిన యాక్షన్ 3డి, ఓంత్రీడి చిత్రాలు నరేష్‌ని, కళ్యాణ్‌రామ్‌ని వెనక్కి నెట్టేశాయి. బ్యాక్ బెంచ్ స్టూడెంట్, మహంకాళి, ప్రియతమా నీవచట కుశలమా, జెప్ఫా, అరవింద్-2 చిత్రాలు ప్లాపులుగా మిగిలాయి.
మిర్చి, గుండెజారి గల్లంతయ్యందే, స్వామిరారా, తడాఖా, ప్రేమకథా చిత్రమ్ చిత్రాలు ఫర్వాలేదనిపించుకున్నప్పటికీ కొనుగోలుదారులు ఊపిరి పీల్చుకోగలిగారు. అల్జుఅర్జున్ ‘ఇద్దరమ్మాయిలతో’ జస్ట్ ఓపెనింగ్స్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
అగ్ర కథానాయకులు, భారీ బడ్జెట్‌లతో నిర్మితమైన చిత్రాలు బాక్సాఫీస్‌వద్ద బొక్కబోర్లాపడటం- ఇదే సమయంలో చిన్న బడ్జెట్ సినిమాలు విజయం సాధించడానికి కారణం- కథాకథనాల్లో వైవిధ్యం ప్రేక్షకుల్ని విజయవంతంవైపు నడిపించడమే అసలుసిసలైన కారణం!