
ప్రతి సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు విడుదలైన చిత్రాల గురించి నిర్మొహమాటమైన సమీక్షలతోపాటు మరెన్నో ఆసక్తికరమైన విశేషాలను అందిస్తున్న ‘వెనె్నల’లో సంవత్సరం చివరన ఈ శీర్షిక చదవాలంటే కించిత్తు బాధగా వుంటుంది. రాసే రుూ కలం కూడా ముందుకు సాగట్లేదు. ఏం చేయగలం కొన్ని విషాదాలు కూడా జీర్ణించుకోవాలి.
2013 తెలుగు సినిమాకు చాలా దురదృష్టకరమైన సంవత్సరం. గత నాలుగు సంవత్సరాల కాలంలో కోల్పోయిన సినీ కళాకారుల కంటే అధికంగా అంటే దాదాపు నాలుగు పదుల సంఖ్యలో కోల్పోయాం. ఒక్కసారి నాలుగు సంవత్సరాలు వెనక్కి తిరిగి నెమరువేసుకుంటే 2009లో పది మందిని కోల్పోయాం. వీరిలో నటుడు, దర్శకుడు నగేష్, జానపద హీరో కాంతారావు, దర్శకుడు గుత్తా రామినీడు, నట గాయని యస్.వరలక్ష్మి వున్నారు. ఇక 2010కి వస్తే సంఖ్య 14కు చేరుకుంది.
వీరిలో గుమ్మడి, పద్మనాభం, వేటూరి, జాలాది, దర్శకుడు కె.బి.తిలక్, నిర్మాత డి.వి.యస్.రాజు, నిర్మాత దర్శకుడు విక్రం స్టూడియో అధినేత బి.యస్.రంగా వున్నారు. ఇక 2011కి వస్తే ఈ సంఖ్య 26 అయింది. వీరిలో దర్శకుడు ఇ.వి.వి., మిక్కిలినేని, ముళ్ళపూడి వెంకటరమణ, యం.యస్.రెడ్డి, నూతన్‌ప్రసాద్, సుజాత వున్నారు.
2012 విషయానికి వస్తే ఈ సంఖ్య 17కి పెరిగింది. వీరిలో అట్లూరి పుండరీకాక్షయ్య, నటి రాధాకుమారి, వెంపటి చినసత్యం, ఈటీవి నటుడు, రచయిత, నిర్మాత, దర్శకుడు సుమన్, నటి అశ్విని, కె.యస్.ఆర్.దాస్ వున్నారు. ఇక 2013 విషయానికి వస్తే పరిశ్రమ భారీగా నష్టపోయింది. దాదాపు నాలుగు పదులు వరకు సినీ ప్రముఖులను కోల్పోయాం. వివరాలలోకి వెళ్తే జనవరి 6న గాయకుడు మురళీధర్‌ను కోల్పోయాం. ఈ గాయకుడు కాకినాడలో ఒక పాట ఇవ్వటానికి వెళ్తూంటే మార్గమధ్యంలో రైలుప్రయాణంలో మరణించారు. జనవరి 21న నిర్మాత సూరపనేని భావనారాయణను కోల్పోయాం. ఈ నిర్మాత గతంలో పద్మాలయా స్టూడియో నిర్మించిన పలు చిత్రాలకు ప్రొడక్షన్ ఇన్‌చార్జిగా పనిచేసారు. నిర్మాతగా శివశక్తి ఖూనీ, కూలీ లాంటి డబ్బింగ్ చిత్రాలను నిర్మించారు. ఫిబ్రవరి 22న నటుడు కొంగర జగ్గారావు మరణించారు. జగ్గారావు యన్.టి.ఆర్ నటించిన పలు చిత్రాలలో విలన్ పాత్రలు పోషించారు. బాపు దర్శకత్వంలో వచ్చిన సాక్షిలో ప్రధాన విలన్.
ప్రముఖ నటి, నర్తకి, దర్శకుడు సి.యస్.రావు సతీమణి రాజసులోచన మార్చి 5న కన్ను మూసింది. రాజసులోచన యన్.టి.ఆర్, అక్కినేని, కాంతారావు, జగ్గయ్య, శివాజీగణేషన్, యం.జి.ఆర్‌ల సరసన పలు విజయవంతమైన చిత్రాలలో నటించడమే కాకుండా మద్రాసులో పుష్పాంజలి సంస్థను ప్రారంభించి పలువురి నృత్య కళాకారుణిలకు శిక్షణనిచ్చింది. ప్రముఖ మేకప్‌మాన్ అడబాల తిరుపతిరావు మార్చి 14న కన్నుమూసారు. అడబాల నటుడిగా గౌతంఘోష్ దర్శకత్వంలో ‘‘మా భూమి’’, యండమూరి దర్శకత్వంలో ‘స్టువర్టుపురం పోలీస్’’ చిత్రాలలో కూడా నటించాడు.
బాల నటుడిగా ఇప్పుడిప్పుడే గుర్తింపుపొందుతున్న మాస్టర్ తేజ గంగానదిలో ప్రమాదవశాత్తు మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఇది కూడా మార్చినెలలోనే సంభవించింది. తేజ మురారి, రామదండు చిత్రాలలో నటించాడు.
సినీ పబ్లిసిటీ రంగంలో పబ్లిసిటీ డిజైనర్‌గా పేరొందిన బ్రహ్మానందరావు మార్చి 15న పరిశ్రమకు దూరమయ్యాడు. తెలుగులోనే కాకుండా తుళు, కన్నడ చిత్రాలకు టైటిల్ లోగోలను సృష్టించటమేకాకుండా ఈ రంగంలో పబ్లిసిటీ ఫాంట్స్ సృష్టికర్తగా అక్షరబ్రహ్మ అని పేరొందాడు. పద్మశ్రీ సుకుమారి 26 మార్చిన పూజామందిరంలో దీపారాధన చేస్తూ దీపం అంటుకొని ప్రమాదవశాత్తూ మరణించారు. దర్శకుడు భీంసింగ్ సతీమణి అయిన సుకుమారి పద్మశ్రీతో మూడుసార్లు జాతీయ స్థాయిలో నటిగా అవార్డులు పొందారు. సుకుమారి శబరి పాత్రద్వారా చిరపరిచితురాలు. నిర్ణయం, మాంగల్యబలం, పల్లెటూరి బావ ఈనాటికీ గుర్తింపు తెచ్చిన చిత్రాలు. కుదిరితే కప్పుకాఫీ ఆఖరి చిత్రం సుకుమారికి.
రచయిత, గాయకుడు, సంగీత దర్శకుడు పి.బి.శ్రీనివాస్ ఏప్రిల్ 14న మరణించారు. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, హిందీ చిత్రాలలో శ్రీనివాస్ పలు హిట్ సాంగ్స్‌ను ఆలపించారు. విజయా సంస్థ నిర్మించిన పలు చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేసిన కళాధర్ మే18న మరణించారు. యన్.టి.రామారావు ‘‘మన దేశం’’ చిత్రం ద్వారా తెలుగు సినిమా రంగానికి పరిచయం కావటంలో కళాధర్ పాత్ర ఎంతో వుంది. పాతాళభైరవి, మాయాబజార్, మిస్సమ్మ, గుండమ్మకథ, షావుకారు, పెళ్ళిచేసి చూడు చిత్రాలు కళాధర్ సృష్టికి మచ్చుతునకలు.
తమిళ ఘంటసాలగా పేరొందిన పద్మశ్రీ టి.యమ్.సౌందర రాజన్ మే 25న మరణించారు. తమిళ చిత్రాలలో నెంబర్ 1 స్థానంలో వుంటూ కన్నడ, మళయాళ, హిందీ చిత్రాలలో కూడా పాడారు. తెలుగులో జయభేరి, శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న, మనుషులుమారాలి, గోపాలుడు భూపాలుడు చిత్రాలలో పాటలు సూపర్‌హిట్ అయ్యాయి. సంగీత దర్శకుడు, గాయకుడిగా ‘పెళ్ళిసందడి’ చిత్రంలో బైటో బైటో పెళ్ళికొడుకా, కృష్ణార్జునయుద్ధంలో ‘‘అంచెలంచెలు లేని మోక్షం చాలా కష్టమే భామినీ’’లాంటి పాటలు పాడిన జె.వి.రాఘవులు జూన్ 7న మరణించారు. సంగీత దర్శకుడిగా ‘ఇంట్లోరామయ్య వీధిలో క్రిష్ణయ్య’, ‘బెబ్బులిపులి’, ‘జీవన తరంగాలు’ రాఘవులు సంగీతం సమకూర్చిన చిత్రాలలో కొన్ని మచ్చుతునకలు. కె.వి.మహదేవన్ సంగీత దర్శకులుగా వున్న ప్రేమనగర్ చిత్రంలో సూపర్‌హిట్ సాంగ్స్ ‘‘ఎవరికోసం ఈ ప్రేమమందిరం’’, ‘‘మనసుగతి ఇంతే’’ పాటలకు మాత్రం రాఘవులు ట్యూన్స్ సమకూర్చినట్లు పరిశ్రమ వర్గాల వారికే తెలిసిన నగ్నసత్యం.
ప్రఖ్యాత దర్శకుడు యల్.వి.ప్రసాద్ మనవడు అక్కినేని రవిశంకరప్రసాద్ జూలై 8న అనుమానాస్పద స్థితిలో మరణించారు. పంపిణీదారుడుగా, ఔట్‌డోర్ షూటింగ్‌లకు ఉపయోగపడే ‘ఆనంద్ సినీ సర్వీస్’ అధినేతగా సినీ పరిశ్రమతో అనుబంధంగల రవిశంకరప్రసాద్ నిర్మాతగా అంతఃపురం, శంకర్‌దాదా ఎంబిబిఎస్, శంకర్‌దాదా జిందాబాద్ చిత్రాలను నిర్మించారు. నిర్మాత, చలనచిత్ర హీరో, కమలాకర్ జూలై 13న మరణించారు. నిర్మాతగా సన్ని, అభి, హాసిని చిత్రాలు నిర్మించారు. ‘బ్యాండ్‌బాలు’ చిత్రం విడుదలకు సిద్ధంగావుంది. దర్శకుడు బి.యల్.వి.ప్రసాద్ జూలై 13న మరణించాడు. దర్శకుడిగా విష్ణు, బందిపోటు రుద్రయ్య, మాయగాడు, మాయదారి మరిది చిత్రాలను అందించాడు. నిర్మాత నల్లూరి రాజశేఖర్ ఆగస్టు 2న మరణించాడు. నిర్మాతగా ‘యమగోల మళ్ళీమొదలైంది’, సయ్యాట చిత్రాలను నిర్మించారు. అక్కినేని, యన్.టి.ఆర్, శోభన్‌బాబు, కృష్ణలతో సహా పలువురు ఇతర హీరోలతో నాయికగా నటించిన మంజుల జూలై 21న మరణించారు. నేపధ్య గాయకుడు రఘునాథ్ పాణిగ్రహి ఆగస్టు 25న మరణించాడు. ఒరిస్సాకు చెందిన పాణిగ్రహి తెలుగులో అక్కినేని నటించిన ఇలవేలుపు, జయభేరి చిత్రాలు కాకుండా అమర సందేశం, సంఘం, సంతోషం చిత్రాలలో కూడా పాడారు. జయభేరిలో ‘మది శారదాదేవి మందిరమే’ పాటలో అక్కినేని సరసన నటించారు కూడా.
సాంస్కృతిక రంగంలో ఘనాపాఠి ఆర్.వి.రమణమూర్తి సెప్టెంబర్ 8న కన్నుమూసారు. పంపిణీదారుడిగా అపారమైన అనుభవంతో నిర్మాతగా మారిన వై.హరికృష్ణ సెప్టెంబర్ 13న కన్నుమూసారు. హైదరాబాద్‌లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ తరలిరావటానికి అలాగే సారథీ స్టూడియో నిర్మాణానికి కృషిసల్పిన తమ్మారెడ్డి కృష్ణమూర్తి సెప్టెంబర్ 19న కన్నుమూసారు. నిర్మాతగా లక్షాధికారి, బంగారుగాజులు, ధర్మదాత, లవ్‌మారేజ్, సిసింద్రి చిట్టిబాబు, దత్తపుత్రుడు మొదలగు చిత్రాలను నిర్మించారు.
హిందీ చిత్రంలో నటించటానికై బొంబాయి వెళ్ళిన నటుడు శ్రీహరి అకస్మాత్తుగా అక్టోబర్ 9న మరణించారు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ‘బ్రహ్మనాయుడు’ చిత్రం ద్వారా పరిచయమైన శ్రీహరి హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ నిర్మాతగా కూడా చిత్రాలను నిర్మించే స్థాయికి ఎదిగారు. పోలీస్ అయోధ్య రామయ్య, భద్రాచలం చిత్రాలను నిర్మించాడు.
కన్నడ, మళయాళ, హిందీలో 50పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన డి.రాజేంద్రబాబు నవంబర్ 3న కన్నుమూసారు. ఈ దర్శకుడు తెలుగులో నాగార్జున, అమల నటించిన ‘ప్రేమయుద్ధం’ చిత్రానికి దర్శకత్వం వహించాడు.
నటుడు రచయిత, జర్నలిస్టు, నిర్మాత దర్శకుడు ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం (ఏవియస్) నవంబర్ 8న మరణించారు. తెలుగు హాస్య నటులలో నిర్మాతలు దర్శకులు వున్నారు. ఏ.వి.యస్. రచయితగా, జర్నలిస్టుగా కూడా ప్రత్యేకతను నిరూపించుకొన్నాడు. బాపు దర్శకత్వం వహించిన శ్రీనాధకవి సార్వభౌమ, మిస్టర్ పెళ్ళాం చిత్రాల ద్వారా తెలుగు సినిమాకు పరిచయమైన ఏ.వి.యస్. రామానాయుడు చిత్రం సూపర్ హీరోస్ ద్వారా దర్శకుడయ్యారు. సీనియర్ నిర్మాత వడ్డే రమేష్ నవంబర్ 21న మృతి చెందారు. విప్లవ గీతాల రచయిత మండే సత్యం నవంబర్ 26న గుండెపోటుతో మరణించారు. ఆర్.నారాయణమూర్తి నిర్మించిన చీమలదండు, దళం, ఎర్రసైన్యం చిత్రాలకు విప్లవ గీతాలను రాసారు. సీనియర్ నిర్మాత సరిపల్లె నాగరాజు నవంబర్ 29న మరణించారు. 1959లో విడుదలైన ‘బాలనాగమ్మ’ (యన్.టి.ఆర్, అంజలీదేవి) ఈ నిర్మాత మొదటి చిత్రం. తెలుగుతోపాటు హిందీ, బెంగాలీ చిత్రాలకు నృత్య దర్శకుడిగా పనిచేసిన రఘురాం నవంబర్ 30న కన్నుమూసాడు. రఘురాం అక్కినేని, యన్.టి.ఆర్‌తోపాటు కమల్‌హాసన్, నాగార్జున, చిరంజీవి, అల్లు అర్జున్ నటించిన చిత్రాలకు నృత్య దర్శకుడిగా పనిచేసాడు. స్వాతిముత్యం, ఇంద్రుడు చంద్రుడు, ప్రేమ, విక్రమ్, పీపుల్స్ ఎన్‌కౌంటర్ చిత్రాలు మచ్చుకి చెప్పుకోవచ్చు. పీపుల్స్ ఎన్‌కౌంటర్‌లో విప్లవ గాయకుడిగా కూడా నటించాడు. హాస్య నటుడు ఏ.వి.యస్ లేని లోటును మరవకముందే సరిగ్గా నెల తర్వాత డిసెంబర్ 7న ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఇక లేడు అన్న విషాద వార్త వినవలసి వచ్చింది. ఏ.వి.యస్. లాగానే ధర్మవరపు సుబ్రహ్మణ్యం కూడా బహుముఖ ప్రజ్ఞాశాలి. బుల్లితెర నుంచి కెరీర్‌ను ప్రారంభించి వెండి తెరను ఆక్రమించాడు. అనేక మంది నటీనటులను, సాంకేతిక నిపుణులను తనలో ఇముడ్చుకున్న కాలచక్రం ప్రేక్షకులకు ఈసారి వినోదం కాకుండా, విషాదానే్న మిగిల్చింది.