టాలీవుడ్‌లో స్థబ్ధత ఉందా?
=============
ఏ వ్యాపార రంగంలో అయినా ఒడిదుడుకులు సహజం. ప్రేక్షకుల అభిరుచి మీద, గాలివాటపు గెలుపు ఓటముల మీద ఆధారపడే తెలుగు సినిమా పరిశ్రమ పరిస్థితి మరింత దారుణం. ఏడాదికి వంద సినిమాలు వస్తే, వాటిలో విజయాల శాతం పది, పదిహేను మించదు. అది గత ఏడెనిమిది దశాబ్దాలుగా జరుగుతున్నదే. కాని కొత్త సినిమాలు ప్రారంభించడానికి తటపటాయిస్తుండటం ప్రస్తుత పరిస్థితి. ప్రస్తుతం పేరున్న అగ్ర హీరోలని చూస్తే- ఇప్పటికే ప్రారంభమైన, అంగీకరించిన సినిమాలు తప్పితే- కొత్త సినిమాలకి పచ్చజెండా ఊపడం లేదు. దర్శక-నిర్మాతలు సైతం త్వరపడి కొత్త సినిమాలు ప్రారంభించడం లేదు.
మహేష్‌బాబు, సుకుమార్ ‘నేనొక్కడినే’ చిత్రం పూర్తిచేసి, శ్రీనువైట్ల ‘ఆగడు’ షూటింగ్‌కి వెళ్ళబోతున్నాడు. ఆ సినిమా పూర్తయ్యేటప్పటికి వచ్చే ఏడాది ప్రథమార్థం.
పవన్‌కళ్యాణ్ ‘గబ్బర్‌సింగ్-2’ వచ్చే నెలలో ప్రారంభమవుతుందంటున్నారు. తదుపరి సినిమాల గురించి ఊహాగానాలే తప్ప ఏదీ నిర్ధారణ కాలేదు.
ఇక ప్రభాస్ ‘బాహుబలి’ పూర్తిచేశాకే 2015లో కొత్త సినిమా గురించి ఆలోచిస్తాడన్పిస్తుంది.
రామ్‌చరణ్‌తేజ- కృష్ణవంశీ చిత్రం కొత్త సంవత్సరంలో కాని స్టార్టయ్యే అవకాశాలు లేవంటున్నారు. ఆ తర్వాత మురుగదాస్, బోయపాటి శ్రీను, దశరథ్- ఇలా కొందరు దర్శకులతో ముడిపడి, రామ్‌చరణ్ తేజ ప్రాజెక్ట్ గురించి వార్తలొచ్చినా, ఇంకా ఏదీ ఫైనలైజ్ అయినట్లులేదు.
అల్లు అర్జున్ ‘రేసుగుర్రం’ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా చేస్తాడంటున్నారు. సంతోష్ శ్రీనివాస్ ‘జోరు’ తర్వాత ఎన్‌టిఆర్ పలువురు దర్శకులతో సినిమాలు చేస్తాడని వార్తలొచ్చినా- ఏ ఒక్కటీ కన్‌ఫర్మ్ కాలేదు.
రవితేజ ‘బలుపు’ తర్వాత బాబీ సినిమా చేస్తాడన్నా, ఇంకా ఆ సినిమా ప్రారంభం కాలేదు.
ప్లాప్స్‌లో ఉన్న గోపీచంద్ బి.గోపాల్ సినిమా చేస్తున్నాడు. తర్వాత వీరభద్రమ్ చౌదరితో సినిమా అని వార్తలొచ్చాయి.
‘మసాలా’ నిరాశపర్చిన తర్వాత రామ్ ఇంకా ఏ సినిమాకి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదు. తాత-తండ్రితో నాగచైతన్య కలిసి నటిస్తున్న ‘మనం’ నిర్మాణ దశలో ఉండగా, ‘ఆటోనగర్ సూర్య’ విడుదల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎప్పుడూ నాలుగైదు సినిమాలతో బిజీగా ఉండే అల్లరి నరేష్ కూడా అంబికాకృష్ణ నిర్మిస్తున్న చిత్రంతోనే సరిపెట్టుకున్నాడు. నాని ‘పైసా’ విడుదలయితే గానీ, అతని తదుపరి సినిమా తేలదు. అలాగే మంచు విష్ణు, మంచు మనోజ్ సొంత సినిమాతో బిజీగా ఉన్నారు. నితిన్ ‘కొరియర్ బోయ్ కళ్యాణ్’, ‘హార్ట్ ఎటాక్’ సినిమాలు విడుదలకి రెడీ అయిపోతున్నా, ఆ తర్వాతి సినిమా గురించి ఇంకా వివరాలు బయటికి రాలేదు.
ఒక సినిమా నిర్మాణంలో ఉండగానే మరో సినిమా ఎనౌన్స్‌మెంట్ ఇచ్చే హీరోలు, దర్శక-నిర్మాతలు ఎందుకు ఈ గ్యాప్ తీసుకుంటున్నారు. పైకి స్క్రిప్ట్ రెడీ కాలేదని చెబుతున్నా, లోలోపలి వాస్తవాలు వేరంటున్నాయి సినీ వర్గాలు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా తెలుగు సినిమా జోరుగా నిర్మాణం కొనసాగించడానికి తటపటాయిస్తోంది.
రాష్ట్రం ఒకటిగా ఉంటుందా- రెండుగా అవుతుందా? హైదరాబాద్ పరిస్థితేంటి? యుటి చేస్తారో ఉమ్మడి రాజధాని అయితే ఎంతకాలం ఉంచుతారు? ఇలాంటి ప్రశ్నలు తెలుగు సినిమా ప్రముఖుల్లో కలకలం రేపుతున్నాయి. (కొంతమంది హైదరాబాద్‌ని యుటి చేస్తారనే ఊహాగానాలతో అప్పులుచేసి మరీ రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టారట- భవిష్యత్ ఏంటో అర్థంకాక, భయాందోళనలతో వణికిపోతున్నారట). నిజానికి- రాజకీయ పరిస్థితులు తెలుగు సినిమాని ప్రభావితం చేసేంతటి కావు. కాని బిజినెస్ పరంగా చూస్తే- తెలుగు సినిమా అమ్మకాల్లో అత్యధిక భాగం నైజాం ఏరియానుంచి వస్తుంది. దానిబట్టే అగ్ర హీరోలు, డైరెక్టర్ల పారితోషికాలు నిర్ణయమవుతున్నాయి. నైజాం రైట్స్‌నిబట్టి- తమ రెమ్యునరేషన్ ఫిక్స్‌చేసే హీరోలు లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం రెండుగా విడిపోతే- నైజాం రైట్స్ ఇదివరకటి రేటే పలుకుతాయా? తగ్గుతాయా? రెండు రాష్ట్రాలయినప్పుడు వినోదపు పన్ను ఎలా ఉంటుంది? కొత్తగా ఏర్పడే రాష్ట్రం ఆర్థిక వనరులు పెంచుకోవడానికి సినిమా రంగంపై పన్ను భారం పెంచుతుందా? లేక చిత్ర పరిశ్రమని హైదరాబాద్‌నుంచి సీమాంధ్ర ప్రాంతానికి తరలించడానికి ప్రత్యేక రాయితీలు, స్థలాలు ఇస్తుందా? (కొంతమంది అలా ఇతర ప్రాంతాల్లో స్థలాలు వస్తాయని కర్ఛ్ఫీలు వేసుకుంటున్నారు కూడా). ఒకవేళ రాష్ట్ర విభజనవల్ల బిజినెస్ లెక్కల్లో తేడాలు వస్తే- సినిమా బడ్జెట్ ఏమేరకు తగ్గించుకోవల్సి ఉంటుంది? అగ్ర తారలు, టెక్నీషియన్ల పారితోషికాలు ఏ స్థాయిలో నిర్ణయించాలి? ఇలాంటి ఆర్థికపరమైన అంశాల్లో మరింత స్పష్టత వస్తేగాని కొత్త సినిమాలు ప్రారంభించకూడదని తెలుగు సినిమా రంగం అనధికారంగా నిర్ణయించుకుందని వార్తలు. అందుకే ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేసినా, షూటింగ్ ప్రారంభించడానికి ఆచితూచి అడుగులేస్తున్నారు.
టాలీవుడ్‌లో స్థబ్ధత ఉందా?
english title:
tollywood
Date:
Friday, December 27, 2013