
వీడ్కోలు - 2013 -- రౌండప్ -- హాలీవుడ్
======================
2012తో పోల్చుకుని చూస్తే 2013లో హాలీవుడ్ చిత్రపరిశ్రమ వసూళ్ళు నెమ్మదించాయనే చెప్పాలి. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా వసూళ్ళు తగ్గిపోవడం పరిశీలకులను విస్మయపరిచింది. ఈ సంవత్సరం ‘గ్రావిటీ, 12 ఇయర్స్ ఏ స్లేవ్, అమెరికన్ హాసిల్’ లాంటి మంచి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాగానే వసూళ్ళను రాబట్టుకోగలిగాయి. విస్తృత ప్రచారంతో, భారీ బడ్జెట్‌లో తీసిన సినిమాలు సత్తా లేకపోవడం వల్ల బాక్సాఫీస్ వద్ద చతికిలబడ్డాయి. భారీ బడ్జెట్‌లో తీసిన ‘‘ది లోన్ రేంజర్, ఆర్.ఐ.పి.డి., ఆఫ్టర్ ఎర్త్, ది ఇంటర్న్‌షిప్’’ సినిమాలు ఘోర పరాజయం పొందాయి. సైన్స్ ఫిక్షన్ పేరిట తన 15 ఏళ్ళ కొడుకు జెడెన్ స్మిత్‌ను ప్రమోట్ చేయడానికై తీసిన ‘‘ఆఫ్టర్ ఎర్త్’’ వైఫల్యం అందరికీ గుణపాఠం నేర్పింది. 130 మిలియన్ డాలర్లతో తీసిన ఈ సినిమా 60 మిలియన్ డాలర్లను మాత్రమే వసూలు చేయగలిగింది. మానవ తోడేలు, రక్తం పీల్చే పిశాచానికి అందమైన అమ్మాయితో పోరాటాన్ని చిత్రీకరించిన ‘‘ది హోస్ట్’’ ట్విలైట్ సిరీస్‌లో భాగంగా వచ్చింది. 40 మిలియన్ డాలర్లతో తీసిన ఈ సినిమా 26 మిలియన్ డాలర్లను వసూలుచేసి ఈ సీరిస్‌లో పెద్ద ఫ్లాప్‌గా నిలిచిపోయింది. డైనె కీటన్, రాబర్ట్ డినిరో, సుసాన్ సారండాన్, టోపర్ గ్రేస్, అమందా సేప్రైడ్, రాబిన్ విలియమ్స్ లాంటి హేమాహేమీలు నటించిన ‘ది బిగ్ వెడ్డింగ్’ అనే రొమాంటిక్ కామెడీ చిత్రం బాక్సాఫీసు దగ్గర అనూహ్య పరాజయం పొందింది. 35 మిలియన్ డాలర్లతో తీసిన ఈ చిత్రం 22 మిలియన్లు వసూలు చేయగలిగింది. గత దశాబ్దంలో వచ్చిన ‘స్టెప్ అప్’ నృత్య చిత్రాల సిరీస్ ఘనవిజయం సాధించడంతో, దానే్న అనుసరిస్తూ, ‘‘హానీ, యూ గాట్ సర్వ్‌డ్’ అనే సినిమాలు వచ్చాయి. ఇప్పుడు కొత్తగా - అమెరికాలోని ఒక అనామక డాన్స్ టీం, అంతర్జాతీయ పోటీలో పాల్గొని గెలవడం అనే ఇతివృత్తంతో తీసిన ‘‘బాటిల్ ఆఫ్ ది ఇయర్’’ చిత్రం పెద్ద ఫ్లాప్ చిత్రంగా నిలిచిపోయింది. 20 మిలియన్ డాలర్లతో తీసిన ఈ చిత్రం 9 మిలియన్ డాలర్లను మాత్రమే వసూలు చేయగలిగింది. హ్యూజ్ జాక్‌మెన్, కేట్ విన్‌స్లెట్, ఎమ్మాస్టోన్, హాలె బెర్రీ, గెరార్ట్ బట్లర్, ఉమా తుమన్ లాంటి అగ్రనటులతో తీసిన ‘‘మూవీ 43’’ అతి కష్టంమీద మూడు మిలియన్ డాలర్ల లాభాన్ని చవిచూసింది. కార్పొరెట్ మోసాల గురించి హరిసన్ ఫోర్డ్‌తో తీసిన ‘‘పారనోయియా’’ ఈ సంవత్సరంలోని గొప్ప ఫ్ల్లాప్ చిత్రంగా నిలిచిపోయింది. 35 మిలియన్ డాలర్లతో తీసిన ఈ సినిమా 7 మిలియన్ డాలర్లను వసూలు చేయడమే కష్టమైపోయింది. ఇక 18 మిలియన్ డాలర్లతో తీసిన ‘‘గెటావే’’ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. 18 మిలియన్ డాలర్లతో తీసిన ఈ సినిమా 10 మిలియన్ డాలర్లను మాత్రమే వసూలు చేయగలిగింది.
నటుడు మార్గోన్ వయాన్స్ రచయితగా, నటుడిగా, నిర్మాతగా మారి తీసిన ‘‘ఎ హాంటెడ్ హవుస్’’ చిత్రం ఊహించని విధంగా ఘన విజయం సాధించి అందర్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ‘‘పారానార్మల్ ఆక్టివిటీ’’ని అనుసరిస్తూ రెండున్నర మిలియన్ డాలర్లతో తీసిన ఈ సినిమా నలభై మిలియన్ డాలర్లను వసూలు చేసింది. సెక్సీగా, హోమో జోక్స్‌తో పెద్దలకు మాత్రమే అని ముద్ర వేయించుకుని వచ్చిన ఈ చిత్రం ఏమాత్రం ఆసక్తికరంగా లేకపోయినప్పటికీ అధిక వసూళ్లను రాబట్టడం విచిత్రమే. 2010లో ఘనవిజయం సాధించిన ‘‘గ్రోన్ అప్స్’’కు రెండవ భాగంగా తీసిన ‘‘గ్రోన్ అప్స్-2’’, మొదటి భాగంతో పోల్చుకుని చూస్తే ఏమాత్రం బాగా లేదని విమర్శలు వచ్చాయి. దేశీయంగా మొదటి భాగంకంటే తక్కువ వసూళ్ళను రాబట్టినా, మొత్తానికి ఈ కామెడీ సినిమా విజయవంతం కావడం ఆశ్చర్యం. 80 మిలియన్ డాలర్లతో తీసిన ఈ చిత్రం 134 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. హర్రర్ సినిమాలకు పేరడీగా తీస్తున్న ‘‘స్కారీమూవీ’’ సిరీస్‌లో అయిదవ భాగం ‘‘స్కారీ మూవీ-5’’ ఈ సంవత్సరం విజయవంతమైంది. ‘‘ఇన్‌సైడియస్, ది కాబిన్ ఇన్ ది వూడ్స్, మామా’’ లాంటి హర్రర్ చిత్రాలతోపాటు ‘‘ఇన్‌సెప్షన్, 127 హవర్స్’’లాంటి చిత్రాల పేరడీగా ఇది తయారయింది. ఏ మాత్రం ఆకట్టుకోని ఈ పేరడీ చిత్రాన్ని విమర్శకులంతా తిట్టిపోశారు. 20 మిలియన్ డాలర్లతో తీసిన ఈ చిత్రం 32 మిలియన్ డాలర్లను వసూలు చేసింది.
దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఈ సంవత్సరం వసూళ్ళు తగ్గిపోయాయి. 2012లో ‘‘అవెంజర్స్’’ ప్రపంచ వ్యాప్తంగా 891 మిలియన్ డాలర్లు వసూలు చేయగా, 2013లో విడుదలైన చిత్రాలన్నింటిలోకెల్లా ‘‘ఐరన్ మాన్-3’’ మాత్రమే 803 మిలియన్ డాలర్ల వద్దకు రాగలిగింది. అమెరికాలో నెం.2గా వచ్చిన ‘‘్ఫస్ట్ అండ్ ఫ్యూరియస్-6’’ 549 మిలియన్ డాలర్లు వసూలు చేయగా, గత సంవత్సరం విడుదలైన ‘‘ఐస్ ఏజ్-4’’ 718 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. అలాగే ‘‘డెస్పికేబుల్-2’’ 549 మిలియన్ డాలర్లు వసూలు చేసినా, గత సంవత్సరం వచ్చినా ‘‘డార్క్ నైట్ రైజెస్’’ 631 మిలియన్లు వసూలు చేసింది.
విచిత్రకరమైన విషయమేమిటంటే, 2013లో వచ్చిన 8 కామెడీ చిత్రాలే బాక్సాఫీసు వద్ద నూరు మిలియన్ డాలర్లను వసూలు చేయగలిగాయి. హాలీవుడ్ చిత్రాలకు పోటీగా చైనా చిత్రాలు తయారుకావటం విచిత్రం. ఈసారి హాలీవుడ్ టాప్-20 చిత్రాలలో ‘జర్నీ ద వెస్ట్’’ ‘‘లాస్ట్ ఇన్ థాయిలెండ్’’ అనే రెండు చైనా చిత్రాలు చోటు చేసుకోవడం విశేషమే. అమెరికన్ బ్లాక్ బస్టర్ చిత్రాల వసూళ్ళను ఇవి అడ్డుకోగలిగేయి.
2013 హాలీవుడ్ టాప్-20లో మొదటి, నాలుగో స్థానాల్లో నిలిచిన ‘‘ఐరన్‌మాన్-3’’ ‘‘మాన్‌స్టర్స్ యూనివర్సిటీ’’ డిస్నీ వాళ్లవి కాగా, రెండు మూడు స్థానాల్లో వచ్చిన ‘‘్ఫస్ట్ అండ్ ప్యూరియస్-6’’ ‘‘డెస్పికెబుల్ మి-2’’ యూనివర్సల్ వారివి. ఈ జాబితాలో వార్నర్ బ్రదర్స్‌వి మూడు చిత్రాలు వుండగా - పారవౌంట్, ట్వంటీయత్ సెంచరీ ఫాక్స్‌వి మూడు హిట్ చిత్రాలున్నాయి. ఇందులో నాలుగు యానిమేటెడ్ సినిమాలు, నాలుగు సైన్స్ ఫిక్షన్‌లు, మూడు సూపర్‌హీరో సినిమాలు, మూడు కామెడీ చిత్రాలు వున్నాయి. ఇందులో ఉన్న ఏకైక అడల్ట్ చిత్రం ‘‘గుడ్ డే టు డై హార్డ్’’.