కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ విధానాలను వాణిజ్య వర్గాలు అదుపు చేస్తున్నాయన్న సత్యం మరోసారి ధ్రువపడింది. ఉరుములు లేని పిడుగుపాటు వలె ప్రభుత్వం అకస్మాత్తుగా పత్తి ఎగుమతులను నిషేధించడం ఇందుకు నిదర్శనం. విదేశీయ వాణిజ్య వ్యవహారాల మహా సంచాలకుడు - డిజిఎఫ్‌టి - సోమవారం నాడు జారీచేసిన నిషేధాజ్ఞవల్ల దేశవ్యాప్తంగా వ్యవసాయదారులు గగ్గోలెత్తిపోతున్నారు. ఈ నిషేధం గురించి తమను ఎవ్వరూ సంప్రదించలేదని తనను ‘‘వాణిజ్య మంత్రిత్వశాఖ వారు ‘చీకటి’లో ఉంచారని’’ వ్యవసాయ మంత్రి శరద్‌పవార్ స్వయంగా బహిరంగ ప్రకటన చేయడం అస్తవ్యస్త పరిస్థితికి అద్దం... పవార్ ప్రకటన కేంద్ర ప్రభుత్వపు పనితీరును, వివిధ మంత్రిత్వశాఖల మధ్య సమన్వయ రాహిత్యాన్ని బట్టబయలు చేసింది. నిర్ణయాన్ని జౌళి మంత్రిత్వశాఖ వారు తీసుకున్నారా లేక వాణిజ్య మంత్రిత్వశాఖ వారు తమంత తాముగా నిర్ణయించుకున్నారో కూడా తెలియరావడం లేదు. ఇంతటి ప్రధాన విధాన నిర్ణయాన్ని సంబంధిత మంత్రులెవరైనా ప్రకటించకుండా, రోజువారీ జరిగే సాధారణ వ్యవహారమన్నట్టుగా ‘్ఫరిన్ ట్రేడ్ డైరెక్టర్ జనరల్’ ఆదేశాలను జారీచేయడం సామాన్య రైతులకు మాత్రమే కాదు, శరద్‌పవార్‌కు సైతం ఆశ్చర్యం కలిగించిన వ్యవహారం. పత్తి ఎగుమతులను పెంచాలన్న విషయమై గత ఏడాది జూన్ నుంచి ఆందోళనలు, ఉద్యమాలు జరిగాయి. అలాంటప్పుడు మంత్రివర్గ సమావేశంలో చర్చించకుండా ఈ దుర్నిర్ణయం ఎలా ఆచరణకు వచ్చింది? బృహత్ వాణిజ్య వర్గాలు ఎగుమతుల సంఘాల వారు తెరవెనుక ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారా? ఎగుమతుల నిషేధంపట్ల కొన్ని ఎగుమతి సంఘాల వారు ఆలస్యం లేకుండా హర్షం ప్రకటించిన తీరు ఈ అనుమానానికి బలం కలిగిస్తోంది. గతంలో పత్తి ఎగుమతుల నియంత్రణను, క్రమబద్ధీకరణకు సంబంధించిన నిర్ణయాలన్నీ ప్రధానమంత్రి స్థాయిలోను మంత్రివర్గ ఉపసంఘాల స్థాయిలోను జరిగాయి. మరి ఇప్పుడు ప్రధానమంత్రి దృష్టికి రాకుండానే నిషేధపుటుత్తరువు వెలువడిపోయిందా? ప్రధానమంత్రి అనుమతితోనే ఈ చర్యకు ‘డిజిఎఫ్‌టి’ వారు ఒడిగట్టి ఉన్నట్టయితే పవార్ ఒకవేళ ఆయనకు ఫిర్యాదుచేసి ప్రయోజనం లేదు, ప్రధాని అనుమతిలోనే శరద్‌పవార్‌ను ‘‘చీకటిలో ఉంచారని’’ భావించవలసి ఉంటుంది. ప్రధాని దృష్టికి వెళ్లకుండానే ఎవరో ఒకరు ఏకపక్షంగా నిర్ణయించి హడావుడిగా అమలుజరిపేసి ఉండినట్టయితే అది మరో వైపరీత్యం కాగలదు. నిర్ణయించిన వారు ప్రధానినే చీకటిలో ఉంచి వెక్కిరించారన్నమాట! గత జూన్‌లో మరో పదిలక్షల గట్టా - బేలు -ల పత్తి ఎగుమతికి కేంద్ర ప్రభుత్వం అనుమతించినప్పుడు, ముందుగా పెద్ద చర్చ జరిగింది. అనుమతించాలా వద్దా అన్న విషయాన్ని అధ్యయనం చేయడానికి వీలుగా మన్‌మోహన్‌సింగ్ ఒక మంత్రుల సంఘాన్ని - గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ - జిఓఎం - ఏర్పాటుచేశారు. ఆర్థిక మంత్రి ప్రణబ్‌ముఖర్జీ అధ్యక్షతన ఈ ‘జిఓఎం’ వారు చర్చించి నిర్ణయించారు. ఆ మంత్రుల సంఘంలో శరద్‌పవార్ కూడా సభ్యుడు పది లక్షల ‘బేళ్ల’ అదనపు ఎగుమతుల విషయంలోనే ఇలా మంత్రుల సంఘం ఏర్పడినప్పుడు దాదాపు కోటి బేళ్ల పత్తి ఎగుమతులకు సంబంధించిన వ్యవహారాన్ని ఏకపక్షంగా ‘ఎవరో ఒకరు’ ఎలా నిర్ణయించారు??
రైతుల వద్ద పత్తి ఉన్నంతవరకూ ఎగుమతులను నియంత్రించడం లేదా నిషేధించడం, రైతులు వ్యాపారులకు పత్తిని విక్రయించిన తరువాత నిషేధాన్ని ఎత్తివేయడం అదనపు ఎగుమతులకు అనుమతించడం వంటి చర్యల వెనుకగల లక్ష్యాలు చంటి పిల్లవాడికి సైతం అర్థంకాగలవు. పత్తి రైతుల వద్ద ఉన్నప్పుడు ఎగుమతులను అనుమతించడంవల్ల వారికి గిట్టుబాటు ధరలు లభిస్తాయి. అలాగే పత్తిపంట మార్పిడి పూర్తయి రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకున్న తరువాత ఎగుమతులను నియంత్రించడంవల్ల, లేదా నిషేధించడంవల్ల పత్తి నూలు ధరలు తగ్గి వస్త్రాల ధరలు కూడా తగ్గుతాయి. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడినట్టు కాగలదు! కానీ ప్రభుత్వం నిర్లజ్జగా ఇందుకు పూర్తి వ్యతిరేకమైన విధానాన్ని కొనసాగిస్తోంది. దేశంలో దాదాపు మూడున్నర కోట్ల ‘గట్టా’ల పత్తి సాలీనా ఉత్పత్తి అవుతోంది. మన అవసరాలకు పోను సాలీనా ఎనబయి ఐదు లక్షల నుండి కోటి ‘బేళ్ల’ పత్తిని మనం ఎగుమతి చేసుకోవచ్చు. అందువల్ల ప్రభుత్వం ఎగుమతికి పరిమిత పరిమాణాలను - ‘కోటా’లను - నిర్ధారించవలసిన పని లేదు. కానీ ఎగుమతులను నియంత్రిస్తున్న తీరు వాణిజ్య వేత్తలకు మాత్రమే ప్రయోజనం కలిగిస్తోంది. పత్తి పంట ఇంటికి చేరి రైతుల వద్ద నిల్వలు ఉన్న సమయంలో ఎగుమతులపై ఏడాది కూడా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. గత ఏడాది అరవై లక్షల బేళ్ల పత్తిని మాత్రమే ఎగుమతి చేయాలని-పంట ఇంటికి వచ్చిన కాలంలో- ప్రభు త్వం నిర్ధారించింది. ఫలితంగా స్వదేశ విఫణిలో ధరలు తగ్గిపోయాయి. రైతుల నుండి వ్యాపారులు చౌకగా కొనేశారు. పత్తి మొత్తం వ్యాపారులకు మిల్లర్లకు బదిలీ అయిన తరువాత ఎగుమతులను పెంచాలన్న కోర్కెతో ఆందోళనలు మొదలయ్యాయి. గత మే నెలలో వ్యాపారులు తమ మిల్లులను దేశ వ్యాప్తంగా మూసివేశారు. ఈ ‘బంద్’ తరువాత దశల వారీగా పత్తి ఎగుమతుల పరిమాణాన్ని ప్రభుత్వం పెంచింది. ఫలితంగా మంచి లాభాలకు మిల్లర్లు వ్యాపారులు పత్తిని అమ్మేశారు! మార్చికి ముందే చౌకగా తెగ అమ్ముకున్న రైతులకు ఈ ఎగుమతుల పెరుగుదల ఏమాత్రం లాభించలేదు!
ఇప్పుడు మళ్లీ పంట ఇంటికి చేరే సమయం వచ్చింది! అందువల్ల వాణిజ్య వర్గాల ఒత్తిడి మొదలైందని శరద్ పవార్ మాటలలోనే ధ్వనించింది. ఎగుమతుల నిషేధంవల్ల పత్తి గుట్టలు దేశంలోనే పేరుకొనిపోతాయి. ధరలు తగ్గిపోవడానికి ఇది దోహదం చేస్తుంది. ఫలితంగా రైతులు ప్రభుత్వం నిర్ధారించిన మద్దతుధరల వంటి తక్కువకు వ్యాపారులకు అమ్ముకోవలసి వస్తుందన్న ఆందోళన మొదలైంది. బాచిరలస్ తురెంజెనిసిస్-బిటి-రకం పత్తిని పండించడంవల్ల భూసారం క్షీణించి పోతోంది. ఇలా ‘బిటి’ పత్తిని ప్రతి ఏడూ పండించడంవల్ల క్రమంగా దిగుబడులు తగ్గిపోతున్నాయన్న భయం ఈ ఏడాది నిజమైపోయింది! రైతుల ఆత్మహత్యలకు ‘బిటి’ పత్తి కారణమన్న వాస్తవం గత ఐదేళ్లుగా అంతర్జాతీయంగా ప్రచారమవుతున్న నేపథ్యంలో పంటకాలంలో ధరలను తగ్గించడానికి ప్రభుత్వం యత్నించడం దుర్భిక్షానికి అధిక మాసం వంటిది! సోమవారం నిషేధపుటుత్తర్వును వెలువడగానే ఒకేరోజులో పత్త్ధిరలు కిలోకు ఐదారు రూపాయలు తగ్గిపోయాయి. బుధవారం మరింతగా దిగజారాయి. నిషేధాన్ని వెంటనే రద్దుచేయాలని వివిధ రాష్ట్రాలలోని రైతుల ప్రతినిధులు మాత్రమేకాక, అధికార కాంగ్రెస్ ప్రతినిధులు సైతం కోరుతున్నారు. గుజరాత్ కాంగ్రెసు ప్రతినిధి బృందంవారు ప్రధానిని కలిసి నిషేధాన్ని తొలగించమని కోరడం ప్రభుత్వ నిర్ణయంపట్ల పెల్లుబుకుతున్న వ్యవసాయ ఆగ్రహానికి ప్రబల ప్రమాణం. తొందరపాటు నిర్ణయాన్ని తక్షణం రద్దుచేసుకున్నట్టయితే తప్పుదిద్దుకున్నారన్న కీర్తయినా దొరతనం వారికి దక్కుతుంది, ‘చేన్లో పత్తి చేన్లోనే’ మిగిలి పోకుండా విపణివీధులవైపు కదులుతుంది...
కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ విధానాలను వాణిజ్య
english title:
cotton
Date:
Friday, March 9, 2012