ఇస్లామాబాద్, మార్చి 8: పాకిస్తాన్ అధ్యక్షుడు జర్దారీపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించి తక్షణం స్పందించాలని ప్రధాని గిలానీకి అత్యున్నత న్యాయస్థానం అల్టిమేటం ఇచ్చింది. జస్టిస్ నజీర్ ఉల్‌మాలిక్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యులు గల సుప్రీం బెంచ్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అధ్యక్షుడు జర్దారీపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించి స్విస్ అధికారులకు తక్షణం లేఖ రాయాలని గిలానీని ఆదేశించింది. కేసును ఈ నెల 21కి వాయిదా వేసిన ధర్మాసనం అప్పట్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అధ్యక్షుడికి రాజ్యంగం కల్పించిన ప్రత్యేక అధికారాల దృష్ట్యా చర్యలకు ఆస్కారం లేదని న్యాయనిపుణులు స్పష్టం చేసినట్టు ప్రభుత్వం అంతకు ముందు కోర్టుకు చెప్పింది. ప్రభుత్వం వివరణతో సంతృప్తి చెందని ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు కోర్టు ధిక్కారణ కింద పరిగణించింది. జర్దారీపై అవినీతి కేసును తిరగదోడాలని ధర్మాసనం ఆదేశించింది. ఇలా ఉండగా ప్రధాని గిలానీ తరపులాయర్ ఐజాజ్ అహసన్ మాట్లాడుతూ ఈనెల 19న లేదా వాయిదా తేదీ 21 నాటికి నివేదిక సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించినట్టు తెలిపారు.
జర్దారీ కేసులో గిలానీకి సుప్రీం అల్టిమేటం
english title:
zardari
Date:
Friday, March 9, 2012