హైదరాబాద్, మార్చి 8: తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసే అంశంలో టిఆర్‌ఎస్ పార్టీకి, తెలంగాణ రాజకీయ, ప్రజాసంఘాల ఐక్యకార్యాచరణ కమిటి (టిజెఎసి)కి మధ్య తలెత్తిన విభేదాలకు ఈ ప్రాంతంలో జరుగుతోన్న ఉప ఎన్నికలు మరింత ఆజ్యం పోశాయి. తెలంగాణలో ఉప ఎన్నికలు జరుగుతోన్న ఆరు స్థానాలకుగాను ఐదు స్థానాల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థులకు మద్దతు ఇస్తోన్న బిజెపికి, మహబూబ్‌నగర్ స్థానం వదిలిపెట్టాలని టిజెఎసి చేసిన ప్రతిపాదనను టిఆర్‌ఎస్ బేఖాతర్ చేసిన సంగతి తెలిసిందే. తమ సూచనను ఖాతరు చేయకుండా ఏక్షపక్షంగా మహబూబ్‌నగర్ స్థానం నుంచి బరిలోకి దిగిన టిఆర్‌ఎస్ అభ్యర్థికి కాకుండా బిజెపి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని టిజెఎసి నిర్ణయించడం పట్ల టిఆర్‌ఎస్ మండిపడుతోంది. టిఆర్‌ఎస్, టిజెఎసి మధ్య అంతర్గతంగా కొనసాగుతోన్న విభేదాలకు మహబూబ్‌నగర్ ఎన్నిక వేదికగా మారింది. టిజెఎసి మహబూబ్‌నగర్ జిల్లా కమిటీ బాహాటంగా తమ మద్దతు బిజెపి అభ్యర్థికేనని ప్రకటించడాన్ని టిఆర్‌ఎస్ జీర్ణించుకోలేకపోతోంది. టిజెఎసి నిర్ణయానికి తోడు తెలంగాణ విద్యార్థి జెఎసి కూడా బిజెపి అభ్యర్థికే మద్దతు ప్రకటించింది. దీంతో మహబూబ్‌నగర్‌లో టిఆర్‌ఎస్ అభ్యర్థికి తెలంగాణవాదుల మద్దతు కరువై ఎదురీదుతున్నారన్న సమాచారం టిఆర్‌ఎస్ నేతలను ఆందోళనకు గురిచేస్తోంది. టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తోన్న మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానానికి కేంద్రమైన మహబూబ్‌నగర్ శాసనసభా నియోజకవర్గంలో ఫలితం ఏమాత్రం అటు, ఇటు అయినా తమ అధినేత పరువుపోయే ప్రమాదం ఉందని టిఆర్‌ఎస్ నేతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఉప ఎన్నికలు జరుగుతున్న ఆరు స్థానాలలో మహబూబ్‌నగర్ స్థానంపైనే టిఆర్‌ఎస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. కెసిఆర్ తన కూతురు కవితను, టిఆర్‌ఎస్ శాసనసభా పక్షం నాయకుడు ఈటెల రాజేందర్, మాజీ ఎంపి ఎపి జతేందర్‌రెడ్డిని మహబూబ్‌నగర్‌లోనే మోహరించి ఎప్పటికప్పుడు పార్టీ అభ్యర్థి విజయావకాశాలను సమీక్షిస్తున్నారు. ఈ నెల 15న ఎన్నికల ప్రచారం ముగిసాక, ఎన్నికలు జరిగేవరకు కెసిఆర్ మహబూబ్‌నగర్‌లోనే మకాం పెడతారని ఆ పార్టీ వర్గాల సమాచారం. ఈ స్థానంలో టిఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో దిగిన వ్యక్తి మైనార్టి వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో, అక్కడ గెలుపు ఓటములను ప్రభావితం చేయగలిగిన స్థాయిలో ఉన్న ముస్లిం ఓట్లపైనే టిఆర్‌ఎస్ గంపెడాశ పెట్టుకుంది. ఇక్కడ పార్టీ అభ్యర్థి గెలుపు ఓటములకంటే, టిజెఎసి ఆదేశాలకంటే, ఈ లోక్‌సభా స్థానంలో గణనీయంగా ఉన్న ముస్లిం ఓట్లకు గాలం వేయడమే తమ అధినేత వ్యూహంగా ఆ పార్టీ నేతలు మరో కోణాన్ని విశే్లషిస్తున్నారు. మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి కెసిఆర్ విజయం సాధించడానికి ముస్లిం ఓటర్లే కారణమయ్యారు. అయితే ఫలితాలు రాకముందే కెసిఆర్ ఢిల్లీకి వెళ్లి బిజెపి నేతలను కలవడంపై ముస్లింలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఒక దశలో మహబూబ్‌నగర్‌లో కెసిఆర్‌ను అడుగుపెట్డనీయకుండా అడ్డుకున్నారు కూడా. మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానంలో గెలుపు ఓటములను ప్రభావితం చేయగలిగిన స్థాయిలో ఉన్న ముస్లింల ఆదరాభిమానాలు పొందడానికే అక్కడ పార్టీ అభ్యర్థి గెలిచినా ఓడినా ఒక్కటేనన్న తెగింపుతోనే టిజెఎసి, బిజెపి మాటను కాదని మైనార్టి వర్గానికి చెందిన అభ్యర్థిని వ్యూహాత్మకంగా కెసిఆర్ బరిలోకి దించారని ఆ పార్టీ నేతలు విశే్లషిస్తున్నారు. మహబూబ్‌నగర్‌లో టిఆర్‌ఎస్ అభ్యర్థి ఇబ్రహీంపై నువ్వా, నేనా అన్నట్టుగా గట్టి పోటి ఇస్తోన్న యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, గతంలో టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. అలాగే కొల్లాపూర్‌లో టిఆర్‌ఎస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావుపై గట్టి పోటీ ఇస్తోన్న కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్ధన్‌రెడ్డి కూడా గతంలో ఈ నియోజకవర్గానికి టిఆర్‌ఎస్ ఇంచార్జిగా పని చేసిన వ్యక్తే. మహబూబ్‌నగర్, కొల్లాపూర్ రెండు స్థానాల్లోనూ టిఆర్‌ఎస్ పాత కాపుల నుంచే గట్టి పోటీని ఎదుర్కొంటోంది.
టిఆర్‌ఎస్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్న కొల్లాపూర్, మహబూబ్‌నగర్ పాతకాపులు
english title:
mahaboobnagar
Date:
Friday, March 9, 2012