హైదరాబాద్, మార్చి 8: దక్షిణ మధ్య రైల్వేలో ప్రయాణికుల రైలుకు తొలి మహిళా లోకో పైలెట్‌గా సత్యవతి గురువారం బాధ్యతలు చేపట్టారు. ఆమె సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి వరకు మాతృభూమి మహిళల ప్రత్యేక రైలు (ఎంఎంటిఎస్)ను నడిపి తొలి మహిళా లోకో పైలెట్‌గా నమోదయ్యారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె పైలెట్‌గా బాధ్యతలు స్వీకరించడంతో రైల్వే సిబ్బంది, అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఆమెకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో శుభాకాంక్షలు తెలిపారు. 1999లో సికింద్రాబాద్ డివిజన్‌లో అసిస్టెంట్ లోకో పైలెట్‌గా ఉద్యోగంలో చేరి గూడ్సు రైళ్ళలో పని చేశారు. పదోన్నతి ద్వారా లోకో పైలెట్ అయ్యారు. శిక్షణ పూర్తికాగానే లోకోపైలెట్‌గా గూడ్సురైళ్లలో పని చేశారు. హైదరాబాద్, తాండూరు సెక్షన్‌లో ట్రాక్‌కు సంబంధించి కూడా ఆమె పలు అంశాలను నేర్చుకున్నారు. అనంతరం దక్షిణ మధ్య రైల్వేలో తొలి లోకో పైలెట్‌గా పాసింజర్ రైలుకు నియమితులయ్యారు. మరో నలుగురు మహిళా లోకోపైలెట్‌లు పాసింజర్ రైళ్లను నడిపేందుకు త్వరలో రాబోతున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. మహిళాదినోత్సవం సందర్భంగా ఈ బాధ్యతలు చేపట్టడం తనకు ఎంతో ఉత్సాహాన్ని కలిగించిందని ఆమె ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. తాను ఈ ఉద్యోగంలో చేరేటప్పుడు ఏమాత్రం భయపడలేదని, మొదట్లో కొన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని అధిగమించగలిగానని చెప్పారు. ఇప్పటి వరకు లోకోపైలెట్‌గా గూడ్సురైళ్లలో పని చేసింది వేరని, తాను తొలిసారి పాసింజర్ రైలును నడపడం సంతోషంగా ఉందని అన్నారు. కానీ ఎన్నో జాగ్రత్తలు తీసుకుని పాసింజర్ రైలును నడపాల్సి ఉంటుందని చెప్పారు. వందలాది మంది జీవితాలు రైలు డ్రైవర్ మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి అనుక్షణం జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని అన్నారు. కుటుంబపరంగా తనకెంతో ప్రోత్సాహం అందిందని చెప్పారు. రాజధాని ఎక్స్‌ప్రెస్ నడపాలని ఆశగా ఉందని అన్నారు. తనకు శిక్షణ సమయం నుంచి సీనియర్ అధికారులు ఎంతో సహకరించారని వారికి కృతజ్ఞతలు తెలిపారు. సీనియర్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, సిపిఆర్‌వో తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. (చిత్రం) హైదరాబాద్‌లో గురువారం మాతృభూమి మహిళల ప్రత్యేక రైలును నడిపిస్తున్న లోకో పైలెట్ సత్యవతి
ద.మ.రైల్వేలో తొలి మహిళా లోకో పైలెట్ సత్యవతి
english title:
woman loco pilot
Date:
Friday, March 9, 2012