
అన్నవరం, మార్చి 8: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరంలో నూతనంగా నిర్మించిన ప్రధాన ఆలయ ప్రారంభోత్సవ పూజలు గురువారం నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా గురువారం ప్రత్యేక యాగ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి స్వామీజీ రత్నగిరి కొండపై ఏర్పాటుచేసిన యాగశాలలను ప్రారంభించారు. యాగశాలల్లో రుత్విక్‌గ్వరణం, మూలమంత్ర జపాలు, సూర్యనమస్కారాలు, లింగార్చన, చండీ పారాయణ, మహా విద్యాపారాయణ, నవగ్రహ జపాలు, రామాయణ పారాయణం తదితర కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ప్రధానాలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన 11 బంగారు కలశాలకు స్వామీజీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నూతన ఆలయాన్ని ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ రాజా ఐవి రాంకుమార్, ఇఒ కె.రామచంద్రమోహన్ దంపతులు పాల్గొన్నారు. (చిత్రం) రత్నగిరిపై 11 బంగారు కలశాలకు పూజలు నిర్వహిస్తున్న శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి