
ఢాకా, జనవరి 5:హింసా విధ్వంస కాండ మధ్య బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. అనేక చోట్ల జరిగిన ఘర్షణల్లో 21మంది మరణించారు. ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎన్‌పి)సహా దాదాపు 20కిపైగా పార్టీలు ఈ ఎన్నికలను బహిష్కరించిన నేపధ్యంలో అధికార అవామీలీగ్ మళ్లీ పగ్గాలు చేపట్టే అవకాశాలు ప్రస్ఫుటమవుతున్నాయి. దేశ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో మెజార్టీ ఓటర్లు బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. ఇతర పార్టీల అభ్యర్థులు ఎవరూ పోటీలో లేకపోవడంతో అక్కడ ఉన్న అవామీ లీగ్ అభ్యర్థులనే గెలిపొందినట్టుగా ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నికల సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు వేల సంఖ్యలో భద్రతాదళాల్ని మోహరించినప్పటికీ అడ్డూఅదుపూ లేని రీతిలోనే హింసా, విధ్వంసకాండ చెలరేగింది. మరోపక్క రేపటి నుంచి 48గంటల బంద్‌కు పిలుపునిస్తున్నట్టు బిఎన్‌పి ప్రకటించింది. పెద్ద సంఖ్యలో బహిష్కరించడం ద్వారా ఈ ఏకపక్ష ఎన్నికలను ప్రజలు తిరస్కరించారని స్పష్టం చేసింది.