
రావణుడితో యుద్ధం మానుమని బ్రహ్మ యముణ్ణి పలికి యమధర్మరాజు కాలపాశము, ఘోరముద్గరములతో దుర్దముడై వెలుగుతూ, కాలదండాన్ని విస్ఫులింగములు చిమ్మత్రిప్పుతూ రాక్షస సైనికులందరూ భీతిపొంది పారిపోవ- ఆ రావణుడి మీద ప్రయోగింప ఊహించగా, బ్రహ్మదేవుడు శీఘ్రంగా ఏతెంచి ‘‘యమధర్మరాజా! ఈ భీకర కాలదండాన్ని రావణుడిపై ప్రయోగింపతగదు. నీ క్రోధాన్ని విడు.
రావణుడు చిరకాలం తపం ఆచరింపగా దేవతలచే మరణించకుండ అతడికి నేను వరం ప్రసాదించాను. కైకసి పుత్రుడైన ఈ రావణుడు చావకుండినా, చనిపోయినా ఎన్నడూ తప్పని నా మాట తప్పుతుంది. కనుక నా మాట పాటించు’’ అని వచించి ఇంకా ‘‘దుష్ట దనుజుల్లో ఎవ్వడైన నా వాక్కు తప్పునట్లు చేస్తే అవిచారంగా లోకాలన్నింటిని బొంకింపదలచినవాడు అవగలడు. కావున నువ్వు ఉజ్జ్వల కాంతులతో విలసిల్లే నీ చేతనున్న ఈ భీషణ కాలదండాన్ని ఉపసంహరించు’’ అని నుడువగా అంతకుడు చతుర్ముఖుడితో ‘‘నువ్వు నాయకుడివి. నీ మాటకి సమ్మతిస్తున్నాను. నీ వరబలంవల్ల ఈ రావణుడు అవధ్యుడు. అరసి చూడ ఇంక ఈ సంగరం ఏమిటికి?’’ అని పల్కి బ్రహ్మదేవుని వీడ్కొని దండధరుడు తన గృహానికి అరిగాడు. అంత దశకంఠుడు యముణ్ణి గెలిచాను. నాకు సరివాడు ఎవడు?’’ అని ఆత్మలో తలచి, మంత్రులు కీర్తింప, పుష్పక విమానారూఢుడయాడు.
రావణుడు పాతాళానికి దండెత్తిపోవుట
అనంతరం రావణుడు పాతాళ లోకంపైకి దండెత్తి వెళ్ళాడు. భోగవతీ పురంలో వున్న భోగీంద్రులు తన్ను కాంచి సకల మర్యాదలు సలుప హర్షించాడు. పిమ్మట మణిపురమునకు అరిగి ఆ పురిలో వున్న నివాత కవచ వీరవరులను కయ్యం సల్పకోరాడు. ఆ నివాత కవచులు కుపితులై పురము వెలువడి వివిధాయుధాలు తాల్చి, నాల్గు మాసాలు పట్టుదలతో అనిచేశారు. అంత పద్మసంభవుడు ఏతెంచి ఆ సమరాన్ని వారించి, మీకు మత్సరం వలదు. మదిని విచరించగా రావణుడితో కయ్యములాడి దేవదానవులు గెలువజాలరు. మీరు అజేయులు. మీకు ఈ రావణుడికి పోరేల? మీరు సమాన బలులు. మీరు పొత్తుతో మనుటలగ్గు’ అని వచించి బ్రహ్మ ఆ ఇరుపక్షాలవారికిన్ని అగ్నిదేవుడు సాక్షిగా సఖ్యం కుదిర్చాడు. ప్రియవాదులు అయన నివాత కవచులతో కలసి రావణుడు మణిపురంలో ఒక ఏడాది కాలం నిలిచిపోయాడు. అక్కడ వారిచే ఒక్కటి తప్ప నూరు మాయలు నేర్చాడు. అనంతరం కాలకేయుల నగరమైన అశ్మపురంపై దాడి వెడలాడు. విపుల పరాక్రములు వేల సంఖ్యలో కల కాలికేయుల్ని కడతేర్చాడు. ఇంకా నానాస్త్రాలతో తన చెలియలు శూర్పణఖ భర్త అయిన విద్యుజ్జిహ్వుణ్ణి వధించాడు. అనంతరం అందందు కల నాల్గు నూరుల దైత్యనాయకులని విధించాడు. అంతతో ఆగక అనర్ఘ నవరత్న వివిధ చిత్రములతో పొలుపారు వరుణుడి పురం మీద కన్ను పెట్టి కదలాడు. శ్రీలక్ష్మి అందు జనించింది. చంద్రుడు ఉదయించాడు. సుధ అక్కడ పుట్టింది. ఆ కడలి నిండుగా అధికంగా దుగ్ధములే. ఈ పురంలో వుండే ఈ ధేనువు సురభి సామర్థ్యం అరుదు అంటూ ఆ గోవుకి ప్రదక్షిణం కావించాడు. చేతులెత్తి ప్రణమిల్లాడు. కడు తెంపు వహించి ఆ వీడు చొచ్చి, అక్కడి బలరక్షకుల్ని కఠినుడై గెలిచి, ఆ రక్షకులతో ఎలుగెత్తి ఈ గతి వచించాడు. ‘‘మీరు వైళమ చని మీ రాజుకి నా రాక తెలియచెప్పండి. నాతో అని సల్పమని చెప్పండి. లేకున్న ఆజికి చాలనని తొలగిపొమ్మనండి’’ అని ఉరిమాడు.
అంత వరుణపుత్రులు, పౌత్రులు పుష్కరుడు అనే వీరవరుడితో అరుదారగా తీరు తియ్యాలతో అలరారి, క్రుద్ధుడై దశగ్రీవుడి సేనతో తలపడ్డారు. రావణుడి మంత్రుల్ని విక్రమంలో తలదన్నారు. ఆశుగాలతో నొంచి రథాలతో వినువీధికి ఎగసే దశగ్రీవుడిని చటుల సాయకాలతో అతడి మర్మములంట వేశారు. అంత రావణుడు వ్యథ చెందడం చూసి, మహోదరుడు కోపించి గదాపాణి అయి అధిక బల ఘాతాలతో రథ హయముల్ని స్రుక్కించాడు. రథాల్ని క్రుంగించాడు.
- ఇంకా ఉంది