Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

శరీరము - సాధన

$
0
0

‘‘శరీరమాద్యం ఖలు ధర్మసాధనమ్’’ అనే ఆర్యోక్తిని అనుసరించి ఈ శరీరము లేకపోతే ఆత్మ, పరమాత్మలను తెలుసుకొనడం అసాధ్యం. ఎనుబది లక్షల జీవరాశులలో మానవజన్మ పరమోత్కృష్టమైనది. ప్రారబ్దమును అనుభవిస్తూ సంచితములో చేసుకున్న పుణ్యకర్మలవలన శుభగామిగా లభించేదే మానవజన్మ. సంచిత కర్మాచరణలో పరిపక్వము కాని ధర్మాచరణను సంపూర్ణముగావించుటకు లభించేదే మానవజన్మ. ఈ యజ్ఞంలో మనకు లభించిన ముఖ్యమైన సాధనమే మానవదేహం.
గుణత్రయ విభాగ యోగములో శ్రీకృష్ణ్భగవానుడు త్రిగుణాత్మకమైన జగత్తులో రజోగుణమధికముగానున్నపుడు మరణించినచో కర్మాసక్తిగల మానవునిగా పుట్టునని, తోమోగుణ ప్రకోపమందు మృతి చెందినచో హీనయోనులయందు పుట్టునని, సత్వగుణ వృద్ధిలో మరణించినపుడు ఉత్తమమైన పుణ్యలోకములు పొందునని తెలియజేసినాడు. ఈ త్రిగుణాలను అధిగమించినవాడు అంతిమ సమయంలో ననే్న స్మరించి మోక్షమును పొందునని కృష్ణ్భగవానుడు అభయమిచ్చినాడు.
ఇక ఈ త్రిగుణాత్మక ప్రకృతి నిరంతర జీవకోటిపై ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటుంది. మానవ జన్మ లభించింది మొదలు తెలిసో తెలియకో అనేక అకర్మలు చేస్తూనే ఉంటారు. మానవుడు శైశవదశలో భగవత్ స్వరూపుడై ఉంటాడు. బాల్యదశలో చేసిన కృత్యాకృత్యాలకు బాధ్యత పూర్తిగా తల్లిదండ్రులు వహించాలి. కౌమారదశలో చేసిన అకృత్యాలకు తల్లిదండ్రులు మరియు గురువు కూడా బాధ్యత వహించాల్సి యుంటుంది. వన దశ నండి చేసిన కర్మాకర్మలకు స్వయముగా ఎవరికివారే బాధ్యత వహిచవలసి యుంటుంది.
వివిధ దశలలో వారి వారి సంచిత కర్మలననుసరించి అనేక పాపాలు చేయడం, చేయించడం మానవ నైజం. ఇక్కడే తల్లిదండ్రుల, గురువుల పర్యవేక్షణ అత్యంత అవశ్యం. పర్యవేక్షణా లోపాలవల్ల, స్వయంకృతంవల్ల జరిగిన అధర్మ కార్యాలు మానవుణ్ణి ఒక దశలో బుద్ధి యొక్క విచక్షణ వలన కృంగదీస్తూ ఉంటాయి. సింహభాగం జనులు అయినదేదో అయినదని, విచక్షణా నేత్రం తెరుచుకొనక అదే అధర్మమార్గములో పయనిస్తూ నిరంతర వ్యధను అనుభవిస్తూ ఉంటారు. అశాంతితో అవసానదశను చేరుకుంటారు.
కాని ఉత్తములు విచక్షణా నేత్రాన్ని తెరచి స్వానుభవంతో సమాజాన్ని పరికించి ఏది సవ్యము? ఏది అపసవ్యము? అనేది గ్రహించి తమ జీవన పథాన్ని మరలించుకుంటారు. దీనికి ఒక సద్గురువు అవసరం ఉంటుంది. ఆ సద్గురువు గ్రంథ రూపంలోనైనా ఉండవచ్చు. అశాంతితో చింతిస్తూ చేసిన తప్పులనే మరలా మరలా చేస్తూ తమ జీవితాలనే కాకుండా ఋణానుబంధువులను కూడా కష్టపెట్టడం ఒక అజ్ఞాని, అవివేకి లక్షణం. ఇక్కడే మనసు అనే పదార్థాన్ని సున్నితంగా స్వాధీనం చేసుకుని ఉపయోగించాలి. ఏదో తప్పు చేశామన్న భావన మనస్సులో నిరంతరం మననం చేస్తూంటే మనస్సు మన స్వాధీనమవదు. కాబట్టి అటువంటి భావాలను మనలోంచి పూర్తిగా తొలగించాలి. కాని ఎలా? మొదట మనసును స్వాధీనం చేసుకుంటేనే గాని ప్రయోజనం ఉండదు.
పశ్చాత్తాపము ఒక గొప్ప ఉన్నత స్థితి. మానవునికి ఇది ఒక గొప్పవరం. పశ్చాత్తాప మనసు పునీతమయినది. ప్రస్తుత యువతకు ఇది ఒక గొప్ప సాధనం. చెడును వీడి మంచిని ఆశ్రయించడానికి ఒక వాహనం. ఇది మాత్రమే మానవులకు ఆధ్యాత్మిక విలువలను అనే్వషించడానికి కావలసిన సమయం, మానసిక శక్తిని ఇవ్వగలదు. గతమే వర్తమానంగా చేసుకోకుండా ఎప్పుడైనా జరిగిన ఉంటే ఆ తప్పిదగతాన్ని నెమరువేసుకుంటూ చింతించకుండా పశ్చాత్తాపంతో సుపథంలో యువత పురోగమించాలని తద్వారా భరతమాత ఔన్నత్యాన్ని చాటాలని కోరుకుందాం.
దానివల్లే భారతదేశం ప్రపంచంలో సాటిలేని దేశంగా అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తుంది.

మంచిమాట
english title: 
man
author: 
-వారణాసి వెంకటసూర్య కామేశ్వరరావు

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>