
ఒత్తిడి జీవితం నుండి, అనుదినం ఉండే తప్పనిసరి పనుల నడుమ నిరుత్సాహంగా ఉండే జీవితానికి ‘హాబీ’ అనేది ఒక వరం. ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఎంతో బిజీ జీవితంతో సతమతమవుతూ ఉంటున్నారు. ఇంటా, బయటా కూడా ఆడ మగ తేడా లేకుండా ప్రతి అడుగు ఒత్తిడితో వేయాల్సి వస్తోంది.
ఉద్యోగం చేయని తల్లి ఇంటి ఇల్లాలుగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నా ఆమె జీవితం కూడా పూర్తిగా ఒత్తిడిమయంగానే ఉంటుంది. ఇంట్లో వారంతా వారి పనుల నిర్వహణ కోసం బయటకు వెళ్ళేవరకూ ఆమెకు టెన్షనే. వీరందరిని తయారుచేసి పంపేసరికి ఆమె చాలా అలసిపోతుంది.
ఇంటిదగ్గరే ఉండే తల్లి ఖాళీయేగదా అనుకుని భర్త, పిల్లలు ఆమె సేవలు మరింత ఎక్కువగా వినియోగించుకునే ధోరణిలో ఉంటారు. ‘మధ్యాహ్నం నిద్రపోవడమే కదా?’ అని తేలిగ్గా మాట్లాడే భర్తలు కూడా ఉంటారు.
విశ్రాంతి దొరకదు!
రాత్రి, పగలు అవిశ్రాంతంగా కుటుంబంకోసం ఎంతో చాకిరి చేయాల్సి వస్తోంది. ‘తన కోసం ఒక్క క్షణం కూడా ఉండడంలేదు’ అని ఒక్కొక్కప్పుడు ఆ ఇంటి ఇల్లాలికి అన్పిస్తూ ఉంటుంది. ఆమెకు కొంత ఆటవిడుపు అవసరం. ఆమె కోసం ఆమె వినియోగించుకునే సమయం కొంత కావాల్సి వస్తుంది. ఇటువంటప్పుడు ఆమె మనసు తన ‘హాబీ’ వైపు మళ్లీ ఆ దిశగా పనిచేస్తే ఎంతో సంతోషానికి లోనవుతుంది. అయితే ఎటువంటి ‘హాబీ’ని ఎంచుకోవాలనేది ఒక ప్రశ్న.
పెయింటింగ్, మ్యూజిక్, పాటలు పాడటం మొదలయినవన్నీ ‘హాబీ’లే. అయితే ఈ నైపుణ్యాలు లేనివారు నిరుత్సాహపడనవసరంలేదు. ఏ మంచి ‘హాబీ’ అయినా వారికి ఆనందం కలుగజేస్తుంది.
‘ఏదో ఒకటి చేయాలి! తనేమిటో తెలియజేయాలి!!’- ఈ తపన సరిపోతుంది. ‘రచన’ను ఒక మంచి హాబీగా చేసుకోవచ్చు.
బాగా చదవాలి!
పుట్టుకతో రచనా నైపుణ్యంగల రచయితలు ఉంటారు. ఎందరో గొప్ప రచయితలు మనకు పుస్తకాల ద్వారా పరిచయం అవుతూ ఉంటారు. అయితే దీనిని ఒక హాబీగా జాగ్రత్తగా అలవరచుకోవచ్చు. కాకపోతే రచయిత కాదలచుకున్నవారు విపరీతంగా చదువుతూ ఉండాలి.
పుస్తకాలు మన ప్రియ నేస్తాలు. అనేకమంది పుస్తకాలు చదవడానికి ఇష్టపడి చదువుతూ ఉంటారు. ఆడవారు పుస్తకాలు చదవడం మొదలుపెడితే ఆ అలవాటు వారిని పుస్తకాలకు మరింత చేరువ చేస్తుంది. బిజీ జీవితంలో పుస్తకాలు చదివే అలవాటుకు కొంతమంది దూరం అవుతూ ఉంటారు. విశ్రాంతి సమయాల్లో పుస్తకం చదవం ఒక గొప్ప సంతృప్తిని ఆనందాన్ని కలుగజేస్తుంది.
మంచి పాఠకురాలు రచయిత్రి కావడం ఎలా? అనేది ప్రశ్న. నిరంతర పఠనంవల్ల బోలెడంత విజ్ఞానం తెలుస్తుంది. ఆమెకు ఎనె్నన్నో కొత్త కొత్త విషయాలు పరిచయం అవుతాయి. క్రమంగా ఏ పుస్తకమయినా చదివితే దానిని విమర్శనాత్మకంగా సమీక్షించగల శక్తి వస్తుంది. తన అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పగల్గుతుంది. అవసరమైతే చర్చలో పాల్గొని తన అభిప్రాయాలను సమర్థించుకోగల్గుతుంది.
ఆమె భావాలు ఎవరు విన్నా, వినకపోయినా వాటిని కాగితంమీద పెట్టాలనే కోరిక మొదలవుతుంది. తొలి దశలో తన అభిప్రాయాలను ఒక మాగ్జయిన్‌కు సంబంధించినవి రాసి ఎడిటర్‌కు పంపుతుంది. ఈ ఉత్తరం రచనే ఒక హాబీగా అలవాటు చేసుకునేందుకు తొలి ప్రయత్నం అవుతుంది. ఈ అనుభవం ‘రచన’ ఒక హాబీగా చేసుకోవాలనుకునేవారికి గొప్ప థ్రిల్‌గా ఉంటుంది.
‘నా ఉత్తరం ప్రచురించారు... చూడండి’ అని అంతులేని సంతోషంతో ఆ మాగ్జయిన్‌ను అందరికీ చూపించుకుంటుంది. రచనవైపు ఆమె కలం దౌడు తీయడానికి వెనుకాడదు.
క్రమంగా ఆమెకు ఇష్టమైన ‘అంశం’పై చిన్న కథ లేదా వ్యాసం రాసే ప్రయత్నం మొదలుపెడుతుంది. మెల్లిగా ఆమె ఒక రచయిత్రిగా పాఠక లోకంలో మద్ర వేసుకుంటుంది. ‘రచన’కు హద్దులు ఉండవు. అంతులేని అవకాశాలు ఉంటాయి. ఏ రచయిత తను చేసిన రచనలతో సంతృప్తిచెందదు. ఇంకా, ఇంకా రచనలు చేయాలనే కోరికతో ఉంటాడు. రచనలో మరింత అభివృద్ధి సాధించాలనుకుంటాడు.
గొప్ప రచయిత్రి అవుతారు
సాధారణంగా మహిళలకు ఊహాశక్తి బాగుంటుంది. ఏమి జరిగింది? ఎందుకు జరిగింది? అనే విషయాలపై ఆరాతీయడమే గాక మంచి విశే్లషణా చాతుర్యత కల్గి ఉంటారు. నిజానికి తన ఆలోచనలన్నీ భర్తకు చెప్పి పంచుకుందామనుకుంటుంది. కాని భర్త అన్యమనస్కంగా ఆమె మాటలు వినీ విననట్లు ఉంటాడు. ఆమె నిరుత్సాహపడుతూ ఉంటుంది.
కొంతమంది భర్తను నిలదీసి తమ మాటలు వినిపిస్తూ ఉంటారు. మరికొంతమంది భర్త వినడంలేదని సణుక్కుంటూ వెళ్లిపోతారు తమ పనుల్లోకి. పిల్లలపట్ల, భర్తపట్ల, కుటుంబం పట్ల బాధ్యతగా ఉండడమే కాదు ప్రేమానురాగాలు కురిపిస్తుంది ఆమె. అల్లుళ్లు, కోడళ్ళు గురించి కూడా ఆలోచిస్తంది. ఆమెలోని అనుభవాలు, ఇష్టాలు, అయిష్టాలు, జయాపజయాలు, ఇవన్నీ ఆమెను రచనవైపుకు ప్రేరేపిస్తాయి.
ఎంత ప్రేరణ పొందినప్పటికి తన అనుభవాలను కాగితంమీద పెట్టేసరికి ఎన్నో ఇబ్బందులు. అంత సులువయిన పని కాదనిపిస్తుంది. అయినా ఆందోన చెందనవసరంలేదు.
ఏ విషయంపైనైనా రచన చేయవచ్చు. ముందు టాపిక్‌ను ఎంపిక చేసుకోవాలి. దానిని మూడు భాగాలుగా విభజించుకోవాలి. పరిచయం, అసలు విషయం, ముగింపు ఈ విభాగాలతో రచన పూర్తిచేసుకోవాలి. రచన పూర్తి అయిన తరువాత ఒకసారి మళ్లీ చదవాలి. కొన్ని పదాలు మార్చేస్తారు. ఈ విధంగా అయిదారుసార్లు చదివేసరికి చక్కని వ్యాసంగా దానిని మార్పు చేయగల్గుతారు.
కథలు రాయాలనుకుంటే కుటుంబ నేపథ్యంలో వారికి ఎదురయ్యే అనుభవాలను ప్రధాన అంశాలుగా చేసుకుని కొంచెం ఊహాశక్తి జోడించి చక్కని మలుపులతో రాయడం మొదలుపెడితే అద్భుతమైన కథలు రాయగల్గుతారు. ఎంతటి కల్పిత గాథలయినా అందులో వాస్తవికత ఉన్నప్పుడే అవి పాఠకులను ఆకర్షించగల్గుతాయి.
ఇద్దరు ప్రేమికుల నడుమ నడిచే సమస్యలు, భార్యాభర్తల మధ్య తలెత్తే అభిప్రాయ భేదాలు, అత్తా-కోడళ్ల కీచులాట, పిల్లవానికి స్కూల్లో ప్రవేశం.. ఇలా ఏ అంశంపైనైనా వ్యాసాలు వ్రాయవచ్చు. కథలు సృష్టించవచ్చు.
రచయిత్రిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించడమేగాక, తమ ముద్రను ప్రత్యేకతతో సమాజంలో ప్రతిబింబించుకోగల్గుతారు ‘రచన’ను హాబీగా చేసుకుంటే. రచన మనిషికి మానసిక ప్రశాంతతను, గొప్ప సంతృప్తిని తెచ్చిపెడతాయి.