న్యూఢిల్లీ, మార్చి 14: రైల్వే మంత్రి దినేష్ త్రివేది బుధవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత తొలిసారిగా అన్ని తరగతుల ప్రయాణికుల చార్జీలను స్వల్పంగా పెంచారు. అయితే త్రివేది తన బడ్జెట్‌లో భద్రతకు, ప్రయాణికుల సదుపాయాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం విశేషం. ప్రయాణికుల సదుపాయాలు, రైల్వేల భద్రత కోసం వివిధ ప్రాజెక్టుల అమలుకు తగినన్ని నిధులను కేటాయిస్తూ గతంలో ఎన్నడూ లేనంతగా అత్యధికంగా 60,100 కోట్ల రూపాయలు బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ‘సబర్బన్, సాధారణ ప్రయాణికులనుంచి అదనంగా కిలోమీటరుకు 2 పైసలు అడుగుతున్నాను. అలాగే మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో కిలోమీటరుకు 3 పైసలు పెంచుతున్నాను’ అని రైల్వే మంత్రిగా తొలిసారిగా 2012-13 సంవత్సరానికి గాను లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ చేసిన 105 నిమిషాల ప్రసంగంలో త్రివేది చెప్పారు. ‘స్లీపర్ క్లాసు ప్రయాణికులనుంచి కిలోమీటరుకు కేవలం 5 పైసలు మాత్రమే అడుగుతున్నాను. ఎసి చైర్‌కార్, త్రీ టైర్‌లలో కిలోమీటరుకు పది పైసలు, ఎసి టూటైర్‌లో కిలోమీటరుకు 15 పైసలు, ఎసి ఫస్ట్‌క్లాస్‌లో కిలోమీటరుకు 30 పైసలు మాత్రమే పెంచుతున్నాను’ అని త్రివేది బడ్జెట్ ప్రసంగంలో తెలియజేసారు. 2002-03 తర్వాత రైల్వే ప్రయాణికుల చార్జీలను పెంచడం ఇదే మొదటిసారి. పెంచిన చార్జీల ప్రకారం సబర్బన్, ఆర్డినరీ సెకండ్‌క్లాస్‌లో వంద కిలోమీటర్ల ప్రయాణానికి 2 రూపాయల మేర చార్జీ పెరుగుతుంది. స్లీపర్ క్లాస్‌లో 5 రూపాయలు, ఎసి చైర్‌కార్, త్రీటైర్‌లో 10, ఎసి టూటైర్‌లో 15 రూపాయలు, ఎసి మొదటి తరగతిలో 30 రూపాయలు పెరుగుతుంది. ప్రతిపాదిత పెంపు ప్రభావం చార్జీలపై స్వల్పంగానే ఉంటుందని త్రివేది చెప్తూ, గత ఎనిమిదేళ్లలో చమురు ధరల్లో పెరుగుదల ప్రభావాన్ని కూడా ఇది పూర్తిగా భర్తీ చేయడం లేదని చెప్పారు.
అయితే ప్రయాణికుల చార్జీల పెంపుపై వివిధ రాజకీయ పక్షాలు వెంటనే తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. త్రివేది సొంత పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ సైతం రైలు చార్జీల పెంపును తీవ్రంగా వ్యతిరేకించడం గమనార్హం. సామాన్య ప్రయాణికులపై భారం మోపుతున్న చార్జీల పెంపును ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించేది లేదని, పెంచిన చార్జీలను తక్షణం ఉపసంహరించుకోవాలని తమ పార్టీ ఇప్పటికే డిమాండ్ చేసిందని ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ స్పష్టం చేసారు. అయితే ప్రధాని మన్మోహన్ సింగ్ మాత్రం త్రివేది రైల్వే బడ్జెట్‌ను మెచ్చుకుంటూ చార్జీలను స్వల్పంగా పెంచడం సరయిన దిశలో తీసుకున్న నిర్ణయమని అన్నారు. ‘రైల్వే మంత్రి తివేది ముందుచూపుతో కూడిన బడ్జెట్‌ను సమర్పించారు. భారతీయ రైల్వేల భద్రత, ఆధునీకరణకు బడ్జెట్ ప్రాధాన్యత ఇచ్చింది’ అని ఆయన అన్నారు. పారిశ్రామిక వర్గాలు కూడా రైల్వే బడ్జెట్‌ను సమతౌల్యతతో కూడిన బడ్జెట్‌గా అభివర్ణించారు. దాదాపు పదేళ్ల తర్వాత చార్జీలను స్వల్పంగా పెంచడంపై దేశవ్యాప్తంగా ప్రజల్లో కూడా పెద్దగా నిరసన వ్యక్తం కాకపోవడం గమనార్హం.
ప్రధాన రైల్వే స్టేషన్లలో ఎసి ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేయడం, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా బుక్- ఎ- మీల్ పథకాన్ని ప్రవేశపెట్టడం, 200 రైళ్లలో బయో టాయిలెట్ల ఏర్పాటు, టికెట్ వెండింగ్ మిషన్లను ప్రవేశపెట్టడం లాంటి అంశాలను కూడా త్రివేది తన బడ్జెట్‌లో ప్రతిపాదించారు.
మంత్రి రైల్వే బడ్జెట్‌లో రైల్వేల ఆధునీకరణకు, వౌలిక సదుపాయాల కల్పినకు పెట్టుబడులను పెంచే ప్రయత్నం చేసారు. రైల్వే భద్రతకు బడ్జెట్‌లో అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. కాకోద్కర్ కమిటీ సిఫార్సుల మేరకు ఒక స్వయంప్రతిపత్తిగల రైల్వే సేఫ్టీ అథారిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అంతర్జాతీయ ప్రమాణాలు, ప్రయాణికులకు భద్రతకు అనుగుణంగా ఈ సంస్థ పని చేస్తుందని మంత్రి తన ప్రసంగంలో తెలియజేసారు. రైల్వే భద్రత పట్ల తాను పూర్తిగా సంతృప్తి చెందడం లేదని చెప్పిన మంత్రి రైలు ప్రమాదాలను తగ్గించేందుకు 2011 సంవత్సరంలో ఇచ్చిన హామీలను తమ శాఖ నిలబెట్టుకుందని తెలిపారు. రైల్వే భద్రతను మరింతగా పెంచడానికి రైల్వే బోర్డులో ఒక కొత్త సభ్యుడిని(సేఫ్టీ/రిసెర్చ్) నియమిస్తున్నట్లు మంత్రి తెలిపారు. బెంగళూరు, ఖరగ్‌పూర్, లక్నోలలో ‘సేఫ్టీ విలేజ్’లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
వచ్చే అయిదేళ్ల కాలంలో సుమారు 19 వేల కిలోమీటర్ల రైల్వే లైన్లను ఆధునీకరించాలని రైల్వే శాఖ ప్రతిపాదించింది. అందులో భాగంగా 11,250 వంతెనలను పటిష్ఠ పరుస్తారు. వెయ్యి రైల్వే గేట్ల వద్ద సౌర విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. 2012-13 సంవత్సరంలో లక్షకు పైగా ఉద్యోగాల నియామకాలు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, ఒబిసి పోస్టుల బ్యాక్‌లాగ్‌ను పూర్తిగా భర్తీ చేస్తారు.
రైల్వే మంత్రి తన ప్రసంగంలో భద్రత అనే మాటను పదే పదే వాడడాన్ని బట్టి భద్రతకు బడ్జెట్‌లో అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం స్పష్టమవుతుంది. నిజానికి రైల్వే ప్రమాదాల కారణంగా ఒక్క మరణం కూడా జరక్కుండా చూడాలన్నది తన లక్ష్యమని ఆయన స్పష్టం చేసారు. రైల్వేలో నిర్వహణ వ్యయాన్ని క్రమంగా తగ్గిస్తామని, 12 వ ప్రణాళిక ముగిసే సంవత్సరం నాటికి దీన్ని ఇప్పుడున్న 90 శాతంనుంచి 74 శాతానికి తగ్గించాలన్నది లక్ష్యమని మంత్రి తెలిపారు.
తొమ్మిదేళ్ల తర్వాత తొలిసారిగా పెంపు రూ.60,100 కోట్లతో భారీ బడ్జెట్ మమత రూటు మార్చిన త్రివేది జనరల్‌నుంచి ఎసి ఫస్ట్‌క్లాస్ దాకా చార్జీల పెంపు ప్లాట్‌ఫామ్ టికెట్ రూ. 5కు పెంపు భద్రతకు, ప్రయాణికుల సదుపాయాలకు పెద్ద పీట స్వతంత్ర ప్రతిపత్తితో రైల్వే సేఫ్ట
english title:
chargeela koota
Date:
Thursday, March 15, 2012