న్యూఢిల్లీ,మార్చి 14: రైల్వే చార్జీల పెంపు వ్యవహారం రాజకీయ దుమారానికి దారితీసింది. సామాన్యులపై భారం వేస్తూ రైల్వే మంత్రి, తృణమూల్ కాణగ్రెస్ నాయకుడు దినేష్ త్రివేది బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కొద్ది గంటల వ్యవధిలోనే ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. వెంటనే పెంచిన చార్జీలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేయడం, అందుకు త్రివేది అంగీకరించకపోవడంతో ఆయనను తొలగించాలంటూ ఏకంగా ప్రధాని మన్మోహన్ సింగ్‌కు లేఖ రాసారు. మమతా బెనర్జీ పట్టువీడని పక్షంలో త్రివేదిని తప్పించేందుకు ప్రధాని మన్మోహన్ సింగ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
రైల్వే చార్జీలు పెంచిన దినేష్ త్రివేదిని తొలగించాలంటూ మమతా బెనర్జీ బుధవారం సాయంత్రం మన్మోహన్ సింగ్‌కు ఒక లేఖ రాశారు. దినేష్ త్రివేది మంత్రివర్గంలో కొనసాగటం తమకు ఇష్టం లేదని మమతా బెనర్జీ ఆ లేఖలో స్పష్టం చేశారని తెలిసింది. పార్టీ అధ్యక్షురాలే తమ పార్టీకి చెందిన త్రివేదిని తొలగించాలని అధికారికంగా లేఖ రాయటంతో ఇరకాటంలో పడిన మన్మోహన్ సింగ్ రాత్రి కాంగ్రెస్ కోర్ కమిటీకి పరిస్థితిని వివరించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన కోర్ కమిటీలో మమతా బెనర్జీ రాసిన లేఖ, రైల్వే శాఖ మంత్రి దినేష్ త్రివేదిని తొలగించే పక్షంలో యుపిఏలో ఏర్పడే సంక్షోభం తదితర అంశాలపై చర్చ జరిపారు. లోక్‌సభ నాయకుడు, ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఎల్లుండి (శుక్రవారం) లోక్‌సభలో 2012-13 సంవత్సరం వార్షిక బడ్జెట్‌ను ప్రతిపాదించిన అనంతరం మమతా బెనర్జీతో చర్చలు జరపాలని కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. యుపిఏ సంకీర్ణ ప్రభుత్వం తరపున ప్రణబ్ ముఖర్జీ 16 లేదా 17 తేదీ ఉదయం కోల్‌కతా వెళ్లి మమతా బెనర్జీతో చర్చలు జరుపుతారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకు దినేష్ త్రివేదిని కేంద్ర మంత్రివర్గంలో కొనసాగించేందుకు అంగీకరించాలని ప్రణబ్ ఆమెను కోరనున్నారు.
రైల్వే బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రతిపాదించిన వెంటనే సంబంధిత మంత్రిని మంత్రివర్గం నుండి తొలగిస్తే యుపిఏ ప్రభుత్వం అప్రతిష్ఠపాలవుతుందని కాంగ్రెస్ కోర్ కమిటీ అభిప్రాయపడింది. ప్రణబ్ ముఖర్జీ ఇదే విషయాన్ని మమతకు వివరించి కొంత సమయం ఇవ్వాలని కోరుతారు. మమత అంగీకరించే పక్షంలో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగిసిన అనంతరం దినేష్ త్రివేదిని మంత్రివర్గం నుండి తొలగిస్తారు. ఒకవేళ మమత ఇందుకు అంగీకరించని పక్షంలో నాలుగైదు రోజుల తరువాత త్రివేదిని మంత్రివర్గం నుండి తొలగిస్తారు. త్రివేదిని మంత్రివర్గం నుండి తొలగించని పక్షంలో యుపిఏ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటామని మమతా బెనర్జీ ప్రధాన మంత్రితోపాటు సోనియా గాంధీకి స్పష్టమైన సందేశం పంపించారని అంటున్నారు. మమతా బెనర్జీ చేసిన ఈ అల్టిమేటం మూలంగానే మన్మోహన్ సింగ్ రైల్వే మంత్రిని మంత్రివర్గం నుండి తొలగించేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు.
అంతకు ముందు పార్లమెంటు లాబీలో తృణమూల్ కాణగ్రెస్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ రైల్వే మంత్రితో చార్జీల పెంపుపై గొడవ కూడా పడ్డారు. చార్జీల పెంపునకు పార్టీ వ్యతిరేకమనే విషయం తెలిసి కూడా ఎందుకు పెంచారంటూ బందోపాధ్యాయ త్రివేదిని నిలదీసారు. అయితే రైల్వేల ఆర్థిక పరిస్థితి బాగా లేదని, చార్జీలను పెంచక పోతే అభివృద్ధి ప్రాజెక్టులను ఎలా పూర్తి చేస్తామని త్రివేది ఆయనతో అన్నట్లు తెలిసింది.
ప్రధానికి మమత లేఖ చార్జీల పెంపుపై ఆగ్రహం కాంగ్రెస్ కోర్ కమిటీ అత్యవసర భేటీ
english title:
trivedi
Date:
Thursday, March 15, 2012