హైదరాబాద్, మార్చి 14: వివాదాస్పద ఉత్తర్వుల వెనుక బయటపడుతున్న మర్మంపై మంత్రులు ఆశ్చర్యపోతున్నారు. నాడు అంతా సక్రమంగా ఉన్నట్లు భావించి జారీ చేసిన ఉత్తర్వుల వెనుక ఇంత మర్మమున్నట్లు నేడే తెలుసుకుంటున్నామని వారు అంటున్నారు. వాస్తవానికి ప్రభుత్వ మార్గదర్శకాలు, నిబంధనల మేరకే జీవోలను జారీ చేసినట్లు చెప్పుకుంటున్న మంత్రులు ఇప్పుడు మాత్రం తాము ఇచ్చిన జీవోల పరిస్థితిని తెలుసుకుంటూ ఆశ్చర్యపోతున్నామని వ్యాఖ్యానిస్తున్నారు. ఇచ్చిన జీవోల వెనుక మార్గదర్శకాలు సుస్పష్టంగా ఉన్నప్పటికీ వాటి అమలు తరువాతకాలంలో మారి ఉంటాయన్న భావాన్ని మంత్రులు వ్యక్తం చేస్తున్నారు. ఇలా మార్గదర్శకాలను విస్మరించి అమలు చేసిన జీవోలు, నిర్ణయాలపై తాము బాధ్యత వహించడం సాధ్యంకాదని కూడా వారు అంటున్నారు. ఇదే సమయంలో జగన్ ఆస్తులు కూడబెట్టుకునేందుకు తాము జారీ చేసిన ఉత్తర్వులు ఎంతవరకు దోహదం చేశాయన్నది తాము ఎప్పుడూ ఆలోచించలేదని వారు అంటున్నారు. ప్రభుత్వ బిజినెస్ రూల్స్ మేరకు తాము జీవోలు జారీ చేశామే తప్ప ఎవరికీ అనుచిత లబ్ది అందించాలన్న భావం తమకు లేదని కూడా వారు చెబుతున్నారు. పరిశ్రమల ఏర్పాటు, ఇతర రంగాలద్వారా రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందన్న భావనతోనే తాము నిర్ణయాలు తీసుకున్నామని సీనియర్ మంత్రి గీతారెడ్డి అభిప్రాయపడ్డారు. ఇటువంటి సంస్థలు, పరిశ్రమలకు ప్రభుత్వ విధానాల మేరకు మాత్రమే ప్రోత్సాహకాలు అందించేలా తాము జీవోలు జారీ చేశామని మరికొంతమంది మంత్రులు స్పష్టంచేస్తున్నారు.
ఇదే సమయంలో సుప్రీకోర్టు ఇచ్చిన నోటీసుల అంతరంగాన్ని కూడా వారు విశే్లషించుకుంటున్నారు. సుప్రీంకోర్టు నేరుగా తమకే నోటీసులు ఇచ్చిందా.. లేక సిబిఐ ద్వారా నోటీసులు ఇప్పిస్తూ తద్వారా వివరాలు తెలుసుకోవాలని ఆదేశించిందా! అన్న కోణంలో తమకు స్పష్టత లభించడం లేదని పలువురు మంత్రులు అంటున్నారు. ఇదే సమయంలో పిటిషనర్ కూడా తమపై దర్యాప్తు చేయించాలని కోరలేదని, కేవలం గతంలో హైకోర్టులో తాము వేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించేలా హైకోర్టును ఆదేశించాలని మాత్రమే కోరారని మంత్రులు విశే్లషిస్తున్నారు. అయితే సుప్రీంకోర్టు నోటీసులు నేరుగా మంత్రులకు ఇచ్చినవేనని సీనియర్ న్యాయవాదులు చెబుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పులో ఆరుగురు మంత్రులు, ఎనిమిది మంది ఐఏఎస్‌లతోపాటు పదిహేనవ పేరుగా సిబిఐని చేరుస్తూ నోటీసులు ఇవ్వాలని ఆదేశించినట్లు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఒకరు వెల్లడించారు. అందుకే నోటీసులు అందుకున్న తరువాత వాటిలో అంశాలను నిశితంగా అధ్యయనం చేసి సమాధానాలను నేరుగా సుప్రీంకోర్టుకు అందించాలా, లేక సిబిఐకి అందించాలా! అన్న కోణంలో ఆలోచిస్తామని ఒక సీనియర్ మంత్రి తరఫున నోటీసుల కేసులో వాదించనున్న ఆ న్యాయవాది స్పష్టంచేశారు.
ఇలా ఉండగా, అధికారులు కూడా తమ నోటీసులకు సమాధానాలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. సుప్రీంకోర్టు ప్రస్తావించిన 26 జీవోలకు సంబంధించి నోట్ ఫైళ్లను బయటకు తీసి అధ్యయనం చేస్తున్నారు. వాటిలో ఉన్న వివరాలు ఏమిటి, అందులో తమవంతు పాత్ర ఏ విధంగా ఉందన్నది కూడా తాజాగా అధ్యయనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నోటీసులకు సమాధానం చెప్పడంలో ప్రభుత్వం కూడా కొంతవరకు బాధ్యత స్వీకరించాలని, వాస్తవాలు సుప్రీంకోర్టుకు వివరించడంలో న్యాయ సలహాలను అందించాలని కూడా ప్రభుత్వాన్ని కోరేందుకు వారు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో అటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇటు ఐఏఎస్ అధికారుల సంఘం కూడా 26 జీవోల వెనుక అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. నోటీసులు చేతికి అందిన తరువాత ఐఏఎస్ అధికారులతో సిఎస్ మాట్లాడనున్నట్లు సమాచారం.
మంత్రుల విస్మయం పక్కదారి పట్టిన నిర్ణయాలపై అంతర్మథనం ఎలా సమాధానం చెప్పాలి అధికారుల మల్లగుల్లాలు
english title:
qnta kadha unda?
Date:
Thursday, March 15, 2012