హైదరాబాద్, ఏప్రిల్ 6: హనుమజ్జయంతి సందర్భంగా నగరంలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది. శుక్రవారం శ్రీ ఆంజనేయం, జైశ్రీరాం శరణుఘోషతో నగరం మారుమోగింది. ముఖ్యంగా వివిధ ప్రాంతాల్లోని హనుమాన్ దేవాలయాలు ఉదయం నుంచే భక్తులతో కిక్కిరిసిపోయాయి. విహెచ్‌పితో పాటు పలు హిందూ సంస్థల ఆధ్వర్యంలో చేపట్టిన విజయయాత్ర ప్రశాంతంగా ముగిసింది.
పాతబస్తీలోని వివిధ ప్రాంతాల నుంచి చార్మినార్, గౌలిగూడల వరకు సాగిన ర్యాలీల్లో వేలాదిగా భక్తజనం పాల్గొన్నారు. ఒకప్పుడు బేగంబజార్‌కే పరిమితమైన ఈ పర్విదిన వేడుకలు కొనే్నళ్ళుగా నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాలకూ విస్తరించాయి. విహెచ్‌పి, భజరంగ్‌దళ్, బిజెపి నేతలు గత కొద్ది రోజులుగా ఈ ఉత్సవాలను నిర్వహించడానికి చేసిన కసరత్తు సఫలీకృతమైంది. ప్రధాన కూడళ్ళన్నీ కాషాయ జెండాలతో ధగధగలాడాయి. ముఖ్యంగా విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గౌలిగౌడ నుంచి నిర్వహించిన విజయయాత్ర ఉదయం ప్రారంభమైంది. అంతకు ముందు మంగళ్‌హాట్ కార్పొరేటర్ రాజాసింగ్ ఆధ్వర్యంలో వేలాదిగా కార్యకర్తలు గౌలిగూడకు చేరుకున్నారు. బేగంబజార్, కార్వాన్, గోల్కొండ, లంగర్‌హౌస్ తదితర ప్రాంతాల నుంచి వేలాది మందితో ఊరేగింపులు వీరితో భాగస్వాములయ్యాయి. ఆ తర్వాత విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా ముఖ్య అతిథిగా విచ్చేసి ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి విజయయాత్రను ప్రారంభించారు. యాత్ర సందర్భంగా గౌలిగూడ నుంచి సికింద్రాబాద్ తాడ్‌బండ్ శ్రీహనుమాన్ దేవాలయం వరకు కూడా వివిధ ప్రధాన కూడళ్ళలో పోలీసులు భారీగా మోహరించారు. యాత్రతో సాధారణ ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. గౌలిగూడ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర పుత్లిబౌలి, కోఠి, రామ్‌కోటి, కాచిగూడ, నారాయణగూడ, చిక్కడపల్లి, ఆర్టీసి క్రాస్‌రోడ్డుల మీదుగా సికింద్రాబాద్ తాడ్‌బండ్ హనుమాన్ దేవాలయం వరకు ఘనంగా సాగింది. యాత్ర కొనసాగుతున్నపుడు పలు కూడళ్ళలో భజరంగ్‌దళ్, విహెచ్‌పి, బిజెపి, భాగ్యనగర్ ఉత్సవ సమితితో పాటు పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో స్వాగత వేదికలను ఏర్పాటుచేసి యాత్రకు ఘనంగా స్వాగతం పలికారు. లక్షల్లో జనం పాల్గొని భారీగా ఎత్తున నినాదాలు చేశారు. యాత్ర పూరె్తైన అనంతరం సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్స్‌లో సమావేశాన్ని నిర్వహించారు.
హమ్మయ్య గండం గడిచింది
హైదరాబాద్‌లో తెలంగాణ వాదులు మిలియన్ మార్చ్ చేపట్టడం ఆ తర్వాత వరుసగా ఉద్యమాలు జరగడంతో ఉక్కిరిబిక్కిరైన పోలీసులు గత కొన్నినెలలుగా ఊరట చెందారనే చెప్పాలి. అయితే, శుక్రవారం హనుమజ్జయంతి, గుడ్‌ఫ్రైడేతో పాటు బిజెపి వ్యవస్థాపక దినోత్సవం ఉండడం, ముస్లింలు కూడా శుక్రవారాన ప్రత్యేక పూజలు చేయడంతో ఈ రోజుకు అధిక ప్రాధాన్యం ఏర్పడింది. గత నెలరోజులుగా ఈ గండం గట్టెక్కడానికి పోలీసులు రచిస్తున్న వ్యూహాలు ఫలించి హనుమజ్జయంతి విజయయాత్ర ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. శుక్రవారం హనుమజ్జయంతి ర్యాలీ సందర్భంగా ఈస్ట్‌జోన్ పరిధిలో ఆరుగురు ఏసీలు, 10 మంది ఇన్‌స్పెక్టర్లు, 20 మంది ఎస్‌ఐలు, సెంట్రల్‌జోన్‌లో ముగ్గురు ఏసీపీలు, తొమ్మిది మంది ఇన్‌స్పెక్టర్లు, 14 మంది ఎస్‌ఐలు, నార్త్‌జోన్‌లో ఒక అడిషనల్ ఎస్పీ, ముగ్గురు ఏసీపీలు, 25 మంది ఇన్‌స్పెక్టర్లతో కలిపి 400 మంది సిబ్బంది బందోబస్తు చర్యల్లో పాలుపంచుకున్నారు. అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధుల్లో హిందూయేతర మతాలకు చెందిన ప్రార్థనామందిరాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో ఒక వర్గం వారిని మరో వర్గం వారు రెచ్చగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ దాన్ని ఆదిలోనే భగ్నం చేసి ఘర్షణ వాతావరణం సృష్టించడానికి యత్నించిన కొందరిని అదుపులోకి తీసుకున్నారు. నగర పోలీసులతో పాటు దాదాపు 15 ప్లాటూన్ల అదనపు బలగాలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు భద్రతకు ఉపయోగించారు. సైబరాబాద్ పరిధిలో కర్మన్‌ఘాట్, చంపాపేట, సరూర్‌నగర్, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో అడుగడుగునా పోలీసు బందోబస్తు కనిపించింది. మొత్తానికి హైటెన్షన్ క్రియేట్ చేసిన శుక్రవారం ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. (చిత్రం) శుక్రవారం శ్రీ హనుమజ్జయంతి సందర్భంగా జరిగిన విజయయాత్రలో పాల్గొన్న విహెచ్‌పి, భజరంగదళ్, బిజెపి కార్యకర్తలు
ప్రశాంతంగా ముగిసిన విజయయాత్ర
english title:
vijaya yathra
Date:
Saturday, April 7, 2012