హైదరాబాద్, ఏప్రిల్ 6: ఎండలు మండిపోతున్న తరుణంలో హైదరాబాద్ మహా నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్నట్టుండి ఒక్కసారిగా వడగళ్ల వాన కురిసింది. శుక్రవారం సాయంత్రం సమయంలో దాదాపు ముప్పై నిమిషాల నుంచి గంట సేపు కురిసిన ఈ వడగళ్ల వానతో నగరంలోని పలు ప్రాంతాల్లో మంచు మేటలు ఏర్పడి కాశ్మీర్‌ను తలపింపజేశాయి. వర్షం కురిసినంత సేపు నగరంలోని పాతబస్తీతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిల్చిపోయింది. ముఖ్యంగా నగరంలోని అంబర్‌పేట, రామంతాపూర్, ఉప్పల్, నారాయణగూడ, చాదర్‌ఘాట్, పాతబస్తీ, రాజేంద్రనగర్, శంషాబాద్, సరూర్‌నగర్, నాగోల్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో అకస్మికంగా వర్షం కురిసింది. అంతేగాక, ఈ వడగళ్ల వానకు బలమైన గాలులు తోడు అవటంతో నగరంలోని పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి పడగా, మరికొన్ని ప్రాంతాల్లో హోర్డింగ్‌లు కూడా నేలకొరిగాయి. హయత్‌నగర్, సరూర్‌నగర్, ఇబ్రహీంపట్నం, కందుకూరు, మహేశ్వరం మండలాల పరిధుల్లోని పలు ప్రాంతాల్లో కూడా ఈ వడగళ్ల వాన కురిసింది. అయితే మహానగరంలోని పలు ప్రాంతాల్లో వర్షానికి ముందు రాళ్ల వర్షం కురిసింది. ఫలితంగా పలు చోట్ల కొందరు స్వల్ప గాయాలపాలైనట్లు తెల్సింది. దీంతో రోడ్లపై రాకపోకలు సాగించే వారు ఒక్కసారిగా పరుగులు తీయటంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఇక కోర్ సిటీలో పరిస్థితి గమనిస్తే రామంతాపూర్, నారాయణగూడ, చాదర్‌ఘాట్ ప్రాంతాల్లో కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సుమారు 50 గ్రాముల నుంచి 200 గ్రాముల వరకు బరువు కల్గిన వడగళ్లు కురవటంతో జనజీవనం పలు ఇబ్బందుల పాలైంది. సాయంత్రం వడగళ్ల వాన ఒక్కసారిగా ప్రారంభం కావటంతో ముఖ్యంగా కార్లలో ప్రయాణించే వారు కొంత ఆందోళనకు గురయ్యారు. వడగళ్ల దెబ్బకు అద్దాలు పగిలిపోతాయోమోనన్న భయంతో కొందరు కార్లను రోడ్ల పక్కనే నిలిపివేసుకున్నారు. వర్షం కురిసిన తర్వాత పాతబస్తీలోని చార్మినార్, చాదర్‌ఘాట్ ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వర్షపు నీరు నిల్చిపోయింది.
-- ఈదురు గాలులు * పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం * నేలకొరిగిన చెట్లు, హోర్డింగ్‌లు --
english title:
hailstorm
Date:
Saturday, April 7, 2012