
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19 : విదేశాలనుంచి దిగుమతి చేసుకునే సిఎన్‌జికన్నా చౌకగా లభించే దేశీయ గ్యాస్ ప్రయోజనాలను వినియోగదారులకు అందించేందుకు వీలుగా వినియోగదారులకు తాము సరఫరా చేసే సిఎన్‌జి ధరకు సంబంధించిన వివరాలు (బ్రేకప్‌లు) అందించాలని సిఎన్‌జి రిటైలర్లను పెట్రోలియం శాఖ మం త్రి వీరప్ప మొయిలీ ఆదేశించారు. ఒక వేళ ఈ ఆదేశాలు గనుక అమలులోకి వస్తే వాహనాలకు, గృహాలకు పైప్‌ల ద్వారా సరఫరా చేసే సహజవాయువుకుగాను వినియోగదారులకు ధరలకు సంబంధించిన వివరాలతో కూడిన ఇన్‌వాయిస్‌లు అందించే తొలి ఇంధనం ఇదే అవుతుంది. ఇప్పటివరకు వినియోగదారులకు విక్రయించే పెట్రోలు, డీజిల్, ఎల్‌పిజి, కిరోసిన్‌లాంటి పెట్రో ఉత్పత్తుల ధరలకు సంబంధించి డీలర్లు ఎలాంటి బ్రేకప్‌లు చూపించడం లేదు. గతంలో చాలా రాష్ట్రాల్లో గృహాల్లోని వంటింటి అవసరాలకు పైప్‌ల ద్వారా సరఫరా చేసే సహజవాయువు అవసరాల్లో 80 శాతం మాత్రమే తీరుస్తుండగా, పూర్తిస్థాయి అవసరాలను తీర్చడానికి వీలుగా ఈ సరఫరాలను మొయిలీ గత నెల పెంచారు. దీంతో ఢిల్లీలో వాహనాలకు విక్రయించే సిఎన్‌జి ధర కెజికి 14.90 రూపాయలకు, వంటిటి అవసరాల కోసం పైప్‌ల ద్వారా సరఫరా చేసే గ్యాస్ ధర కిలో 5 రూపాయల దాకా తగ్గిపోయింది. పంపిణీదారులు ఎక్కువ ధర ఉండే సిఎన్‌జిని కాకుండా దేశీయ సహజవాయువు కొనుగోలుకు మళ్లడంతో మహారాష్ట్ర, హర్యానాలో తప్ప మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే విధంగా ధరలు తగ్గే అవకాశాలున్నాయని అంటున్నారు. అయితే అన్ని ప్రాంతాల్లో ఈ ప్రయోజనాలు పూర్తిగా వినియోగదారులకు అందడం లేదని తెలుస్తోంది. అందుకే సిఎన్‌జి స్టేషన్లలో సిఎన్‌జి ధరకు సంబంధించిన బ్రేకప్‌లను,అలాగే పైప్‌ల ద్వారా గృహాలకు సరఫరా చేసే సహజవాయువుకు సంబంధించిన బ్రేకప్‌లను వినియోగదారులకు అందించే రసీదులో చూపించాలని మొయిలీ ఆదేశించారు.