న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న టెలికాం కంపెనీల విలీనాలు, స్వాధీనాలకు సంబంధించిన మార్గదర్శకాలు మరో 10 రోజుల్లో వెలువడనున్నాయి. ‘విలీనాలు, స్వాధీనాలకు సంమంధించిన గైడ్‌లైన్స్ వారం, పది రోజుల్లో వెలువడుతాయి’ అని కేంద్ర టెలికాం కార్యదర్శి ఎంఎఫ్ ఫరూఖి బుధవారం ఇక్కడ సిఐఐ ఏర్పాటు చేసిన బ్రాడ్‌బ్యాండ్ సదస్సులో చెప్పారు. మార్గదర్శకాలను ఆమోదించిన మంత్రుల సాధికారిక బృందం (ఇజిఓఎం) కంపెనీల కన్సాలిడేషన్ టెలికాం లైసెన్స్‌కు సంబంధించిన లాకిన్ పీరియడ్ నిబంధనకు వ్యతిరేకంగా వాటా విక్రయం అవుతుందా అనే విషయంపై న్యాయ నిపుణుల సలహాను కోరింది. మంత్రుల బృందం ఆమోదించిన మార్గదర్శకాల ప్రకారం విలీనమైన కంపెనీ మార్కెట్ వాటా 50 శాతానికి మించకూడదు. అంతేకాకుండా వేలంలో స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసిన టెలికాం కంపెనీలు విలీనం తర్వాత ఈ రేడియో తరంగాల కోసం ప్రభుత్వానికి అదనపు చెల్లింపులు జరపవలసిన పని లేదు. స్పెక్ట్రమ్ కేటాయించిన టెలికాం ఆపరేటర్ల కంపెనీలను స్వాధీనం చేసుకున్న కంపెనీలు మాత్రమే పాత ధరకు, మార్కెట్ ధరకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ‘స్పెక్ట్రమ్ కొనుగోలుకు వేలం ఒక మార్గం. స్పెక్ట్రమ్‌ను దక్కించుకోవడానికి చాలా రకాల మార్గాలను కూడా మేము ఆలోచిస్తున్నాం. విలీనాలు, స్వాధీనాలకు సంబంధించిన గైడ్‌లైన్స్ మరో మార్గంగా ఉపయోగపడుతాయి’ అని ఫరూఖి చెప్పారు. విలీనాలు, స్వాధీనాల గైడ్‌లైన్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్ల (డాట్) స్థాయిలోనే ఖరారు చేయడం జరుగుతుందని, వీటిని మళ్లీ మంత్రిత్వ వాఖల కమిటీ ముందు కానీ, మంత్రుల సాధికారిక బృందం ముందు కానీ ఉంచాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. దేశంలోని రెండున్నర లక్షల గ్రామ పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను అందజేయడానికి వీలుగా జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌ను 2015 సెప్టెంబర్ నాటికల్లా ప్రభుత్వం పూర్తి చేస్తుందని ఫరూఖి చెప్పారు.
టెలికాం కంపెనీల స్వాధీనాలు, విలీనాలకు * టెలికాం కార్యదర్శి ఫరూఖి వెల్లడి
english title:
p
Date:
Thursday, February 20, 2014