
విజయవాడ, ఫిబ్రవరి 19 : రాష్ట్ర విభజన అనివార్యంగా కనిపిస్తున్న తరుణంలో సీమాంధ్రలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంది. ఎక్కడికక్కడ ‘ఇక్కడే రాజధాని’ అని ప్రచారం చేస్తూ స్థలాల ధరలకు రెక్కలు కడుతున్నారు. లోక్‌సభలో బిల్లు ఆమోదం తరువాత కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం అధికంగా కనిపిస్తోంది. మరికొందరైతే ఆయా ప్రాంతాల్లోని తమ ఇళ్ల అద్దెలు ఇబ్బడిముబ్బడిగా పెరగగలవన్న ఆనందంతో ఉన్నారు. విభజన బిల్లును శాసనసభ తిరస్కరించినా రాష్టప్రతి ఆమోదం పొందినప్పటినుంచే ఈ ప్రాంతంలో వివిధ ప్రాంతాలకు చెందిన వాహనాలు ఈ జిల్లాల్లో తిరగడం అధికమైంది. ఖాళీ స్థలాలకు అడ్వాన్సులు ఇచ్చి ‘తమదని’పించుకుంటున్నారు. అయితే ఇప్పటికే సీమాంధ్రకు చెందిన చాలా మంది నాయకులు ఖాళీ భూములను బినామీల పేరిట తమ సొంతం చేసుకున్నారన్న ప్రచారమూ ఉంది. ప్రభుత్వం ఇటీవల లక్షా 30 వేల ఎకరాల అటవీ భూమిని ‘డీ ఫారెస్టరైజ్’ చేసిందని అంటున్నారు. దీని ప్రకారం ప్రకాశం, కర్నూలు జిల్లాల మధ్యలోని నల్లమల అడవులు లేదా రంపచోడవరం అడవుల పరిసరాల్లో రాజధాని నిర్మాణం జరగవచ్చంటున్నారు. గుంటూరు - విజయవాడ మధ్య ఉన్న నాగార్జున యూనివర్సిటీని మరో ప్రాంతానికి తరలించడం ద్వారా అక్కడ రాజధాని నిర్మాణానికి అనువుగా ఉంటుందని, ఇంకా వందలాది ఎకరాల భూమి ఖాళీగా ఉందని కూడా వారు చెబుతున్నారు. ఇక కృష్ణా జిల్లా నూజివీడు ప్రాంతంలో ఆక్రమిత దేవాలయ, వక్ఫ్ భూములు, అటవీ భూములు దాదాపు 30 వేల ఎకరాలున్నాయంట. విభజన బిల్లు ఆమోదం పొందినప్పటినుంచి ఆక్రమణదారులు, కబ్జాదారులు మాత్రం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాజధాని కాకపోయినా భవిష్యత్ అవసరాల కోసం ఈ భూముల స్వాధీనం తప్పదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. వాస్తవానికి విజయవాడ అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్ర, మరోవైపుతెలంగాణకు రహదారుల పరంగా, రైల్వే పరంగా కూడలి ప్రాంతం. ఇప్పటికీ నిత్యం 300 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. సమీపంలో ఎటూ గన్నవరం విమానాశ్రయం ఉంది. బందరు ఓడరేవు ఉంది. చెంతనే కృష్ణా నది ఉండడంతో నీటి సమస్య ఉత్పన్నం కాదని వారు చెబుతున్నారు. ప్రకాశం జిల్లా విషయానికొస్తే తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. జిల్లా కేంద్రం ఒంగోలు వాసులే ఏడాది పొడవునా తాగునీటికి తహతహలాడాల్సి వస్తుంది.
తమిళనాడు నుంచి ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు సమయంలో విజయవాడ రాజధాని ఏర్పాటుకు నాటి కమ్యూనిస్టులు ఎంతగానో పోరాడారు. అయితే నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూను విజయవాడ రాజధాని అయితే రాష్ట్రాన్ని కమ్యూనిస్టుల పరం చేయడమేనంటూ కొందరు తప్పుదారి పట్టించారు. ప్రకాశం పంతులుకు సిఎం పదవి ఎరగా పెట్టి తమిళనాడుకు చెందిన ఐదుగురు తెలుగు శాసనసభ్యులతో అక్రమంగా ఓటు వేయించి ఒకే ఒక ఓటు తేడాతో కర్నూలుకు రాజధానిని నీలం సంజీవరెడ్డి తరలించుకుపోయారు. రాజధాని విషయమై పరిశీలించేందుకు జస్టిస్ కైలాస్‌నాథ్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైనా ఫలితం లేదు. ఇక ప్రస్తుతం రాజధాని విషయంలో ఎన్నివివాదాలు, ఎన్ని పొరపొచ్ఛాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.
బ్యాంకింగ్ అభివృద్ధి వేగవంతం
ఎస్‌బిఐ ఎండి కృష్ణకుమార్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 19 : ఆంధ్రప్రదేశ్ విభజన వల్ల రెండు రాష్ట్రాల్లో ఆర్థిక, బ్యాంకింగ్ లావాదేవీలు పెరిగి అభివృద్ధికి అవకాశాలు పుష్కలంగా ఉంటాయని ఎస్‌బిఐ మేనేజింగ్ డైరెక్టర్ ఎ కృష్ణకుమార్ అన్నారు. బుధవారం ఇక్కడ ఎస్‌బిఐ బ్రాంచి కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, కొత్త రాజధాని గుర్తింపు, ఆదాయం, ఆస్తుల విభజన వీలైనంత వేగంగా జరగాల్సి ఉందన్నారు. రాష్ట్ర విభజనను తాము పాజిటివ్‌గా తీసుకుని అభివృద్ధిపై దృష్టిని కేంద్రీకరిస్తామన్నారు. రాష్ట్రాల విభజన, గతంలో బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా విభజన జరిగినప్పుడు తాము అభివృద్ధి, విస్తరణకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. విభజన అనుకూల, వ్యతిరేక ఉద్యమాల వల్ల బ్యాంకింగ్ కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడిందన్నారు. సిఐఐ రాష్ట్ర అధ్యక్షులు అశోక్‌రెడ్డి , దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యకు కేంద్రం పరిష్కరించినందు వల్ల ఇక రెండు ప్రాంతాల్లో అభివృద్ధి వేగవంతమవుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పన్ను రాయితీ వల్ల పరిశ్రమల స్ధాపన ఉపందుకుంటుందన్నారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల మధ్య ఆదాయం, జలాలు, విద్యుత్ పంపిణీ త్వరితగతిన జరగాలని, వౌలిక సదుపాయాలను పెద్ద ఎత్తున ప్రారంభించాల్సి ఉందన్నారు. ఫ్యాప్సీ అధ్యక్షుడు శ్రీనివాస్ అయ్యదేవర మాట్లాడుతూ, పరిశ్రమలకు అనుకూలమైన విధానాలతో రెండు ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు.