
1963లో ‘‘వాల్మికి’’ చిత్రాన్ని అందించిన జూపిటర్ పిక్చర్స్‌వారు, 1964లో నిర్మించిన చిత్రం ‘‘మర్మయోగి’’. తమిళంలో కె.రామనాథ్ దర్శకత్వంలో 1951లో ‘మర్మయోగి’ పేరుతో హిందీలో ‘‘ఏక్‌కా రాజా’’ పేరుతో రూపొందిన చిత్రాన్ని తెలుగులో 1964లో నిర్మించారు.
‘మర్మయోగి’ చిత్రానికి రచన ముద్దుకృష్ణ, నృత్యం వి.జె.శర్మ, కళ- వాలి, ఎడిటింగ్ కె.ఏ.మార్తాండ్, ఫోటోగ్రఫీ పి.దత్తు, స్టంట్స్- సోము, మేకప్ పి.పీతాంబరం, పాటలు- ఆరుద్ర, కొసరాజు, సంగీతం- ఘంటసాల, నిర్మాత- హబీబుల్లా, దర్శకత్వం- బి.ఏ.సుబ్బారావు.
మహేంద్రగిరి మహారాజు (గుమ్మడి) అతనికి ఇద్దరు కుమారులు. అతని బావమరిది, సేనాని పురుషోత్తమవర్మ (ఎ.వి.సుబ్బారావు). అతనికొక కుమార్తె. అనారోగ్యంతో మహారాణి మరణించగా మహారాజు పిల్లలు ముగ్గురిని ఎంతో ప్రేమగా పెంచుతుంటాడు. అనుకోకుండా ఒక నర్తకి చంచల (లీలావతి) అతని జీవితంలో ప్రవేశిస్తుంది. ఆమెను పెళ్ళాడి, ఆమె అనుచరుడు భుజంగం (లంక సత్యం)ను తనకు అంగరక్షకుడిగా నియమించుకుంటాడు మహారాజు. చంచల సలహాపై సేనానికి, రాజ్యబహిష్కరణ శిక్షను విధిస్తాడు. నదీ విహారానికి వెళ్ళిన మహారాజు ప్రమాదానికి గురవటంతో అతను మరణించాడని మహారాణిగా చంచల మహేంద్రగిరిని పాలిస్తూ వుంటుంది. పిల్లలను అడ్డుతొలగించిన భుజంగాన్ని విషప్రయోగంతో అంతంచేస్తుంది. ఆమెకు రాజ్యపాలనలో ఒక యోగి రాజగురువుగా సహాయపడుతుంటాడు. ఇలా 20సం.లు గడిచాక, రాజ్యంలో వార్షికోత్సవ వేడుకలు జరుగుతుండగా సేనాని భాస్కర్ (కాంతారావు) అతని సోదరి ప్రభావతి (కృష్ణకుమారి) తమ ప్రతిభ ప్రదర్శిస్తారు. ఆ సమయంలో ప్రభాకర్ (ఎన్.టి.రామారావు) అక్కడ ప్రవేశించి, సేనానితో తలపడి విజయం సాధించి, మహారాణికి భయం కలిగిస్తాడు. రాజ్యంలో అన్యాయాలు ఎదిరించే తిరుగుబాటు నాయకుడిగా, ప్రభాకర్‌ను గుర్తించిన మహారాణి అతన్ని అంతంచేయాలని కుట్రలు పన్నటం, అందులో భాగంగా ప్రభావతిని అతనివద్దకు పంపటం చేస్తుంది. ప్రభావతి, ప్రభాకర్‌ను కలిసి అతని నిజాయితీ గ్రహించి అతన్ని ప్రేమిస్తుంది. ప్రభాకర్‌ను బంధించి, భాస్కర్ మహారాణి ముందు నిలబెట్టి శిరచ్ఛేదనం చేయబోయే తరుణంలో రాజగురువు వచ్చి, ఈ అనర్ధాలకు కారణం చంచల అని గతం వివరిస్తాడు. అంతేకాక రాజగురువుగా నటిస్తున్నది మహారాజే అని నిజం వెల్లడిచేయటం, ప్రభావతి తన మేనకోడలని, భాస్కర్, ప్రభాకర్‌లు తన కుమారులని తెలియచేస్తాడు. చంచల మరణంతో, అందరూ ఏకంకావటం, దానితో ‘మర్మయోగి’మహారాజే అని అందరూ సంతోషిస్తారు.
‘‘మర్మయోగి’’ చిత్రంలో స్టంట్ మాస్టర్ సోము అద్భుతమైన ఫైట్స్ కంపోజ్ చేశారు పోటీల్లో నిప్పులతో కూడిన ముళ్ళ పరికరంతో కాంతారావు, ఎన్.టి.ఆర్.ల మధ్య పోరాటం, రాజ్యసభలో ఎన్.టి.ఆర్ ష్లాండియర్స్ పట్టుకొని ఒకచోట నుంచి ఒకచోటికి దూకుతూ చేసే ఫైట్స్. కొండల మధ్య స్థావరాల మధ్య పోరాటాలు థ్రిల్లింగ్‌గా తీశారు. చంచలను భూతం భయపెట్టే సన్నివేశాలు, నది విహారంలో ప్రకృతి దృశ్యాలు ‘దత్తు’్ఫటోగ్రఫీలో అద్భుతంగా రూపొందాయి. ఎన్.టి.ఆర్. హీరోగా పలు చిత్రాలు రూపొందించిన బి.ఎ.సుబ్బారావు ఈ చిత్రంలోనూ చక్కని ప్రతిభను చూపారు. ఎన్.టి.ఆర్.కు తిరుగుబాటు నాయకునిగా ఛత్రపతి శివాజీ గెటప్‌లో చూపటం. విశేషం. కృష్ణకుమారి పలు పోటీల్లో ప్రతిభ చూపటం, స్ర్తిలకు లభించే గౌరవాన్ని ప్రతిబింబించటం దర్శకుని విశే్లషణకు తార్కాణం.
‘‘మర్మయోగి’’ చిత్రం సంగీతపరంగా గుర్తుంచుకోదగ్గ బాణీలు, నేపథ్య సంగీతంతో అలరించారు శ్రీ ఘంటసాల. లీలావతి, గుమ్మడిలపై చిత్రీకరించిన ఆహ్లాదకరమైన యుగళ గీతం (లీల, ఘంటసాల ఆలాపన- రచన ఆరుద్ర)- ‘‘నవ్వుల నదిలో పువ్వుల పడవ కదిలె ఇది మైమరపించే రేయి’’, లీలావతిపై చిత్రీకరించిన పాట ‘‘ఈ తీయనైన హృదయంతో తేనేలూరు సమయం’’ (పి.సుశీల- ఆరుద్ర) కృష్ణకుమారిపై చిత్రీకరించిన గీతం ‘‘చోద్యం చూశావా ఓ చుక్కల నెలరాజా’’ (పి.సుశీల- ఆరుద్ర) ప్రభాకర్ అనుచరులు చదలవాడ, బాలకృష్ణ, మీనాకుమారిలపై చిత్రీకరించిన పాట ‘‘నాజూకైన గాడిద నా వరాల గాడిద’’(ఘంటసాల, కె.జమునారాణి- కొసరాజు) కృష్ణకుమారి, ఎన్.టి.ఆర్ బృందంపై చిత్రీకరించిన పాట ‘‘పాలోయమ్మ పాలు’’(ఘంటసాల, సుశీల- ఆరుద్ర) లంక సత్యం, నర్తకీమణులపై చిత్రీకరించిన పాట ‘‘ఎందుకు పిలిచావో రాజా(ఘంటసాల, జమునారాణి, ఎ.పి.కోమల, ఆరుద్ర) లీలావతి, కృష్ణకుమారిలపై చిత్రీకరించిన పద్యం ‘‘కడగంటి చూపుతో కవ్వించి, కవ్వించి- కె.జమునారాణి- ఆరుద్ర) ‘మర్మయోగి’ చిత్రంలోని మరో హిట్ సాంగ్ కృష్ణకుమారి, ఎన్.టి.ఆర్‌లపై చిత్రీకరణ ‘‘రావాలి రావాలి రమ్మంటే రావాలి రకరకాల రసికతలెన్నో రాణిగారు చూపాలి’’ (ఘంటసాల, కె.జమునారాణి- ఆరుద్ర). ఈ పాట ట్యూన్ 1958లో వచ్చిన ‘పెళ్ళినాటి ప్రమాణాలు’ చిత్రంలో నేపథ్యంగా అక్కినేని, జమునలపై చిత్రీకరించటం, అదే ట్యూన్‌తో ఎన్.టి.ఆర్, కృష్ణకుమారిలపై పాటగా రూపొంది విజయం సాధించటం ఓ విశేషం. (రెండు చిత్రాలకు ఘంటసాలే సంగీత దర్శకులు).