ఉత్సాహం ఉండాలేగానీ ఎన్ని అద్భుతాలనైనా ఆవిష్కరించవచ్చని, పట్టుదలతో కృషి చేస్తే అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చని నిరూపించాడు టీనేజ్ యువకుడు బెన్ పోస్ గులాక్. మోటార్‌సైకిల్స్ పట్ల ఆసక్తిగల అతను కొత్త తరహా వాహనాన్ని తయారు చేయాలని అనుకున్నాడు. కానీ, నిపుణులను సంప్రదించడానికి కూడా అతని వద్ద డబ్బు లేదు. దీనితో కొంతమంది మోటార్‌సైకిల్ మరమ్మతు చేసే మెకానిక్కులను కలిసి, వారి సలహాలు తీసుకున్నాడు. రాత్రింబవళ్లు కష్టపడి సెగ్వే మోటార్‌సైకిల్ ‘యూనో’ను కనిపెట్టాడు. సాధారణ మోటార్‌సైకిళ్ల మాదిరే ఈ వాహనానికీ రెండు చక్రాలు ఉంటాయి. అయితే, అవి ముందు, వెనక కాకుండా పక్కపక్కనే ఉండడం విశేషం. ఒక చక్రం ముందుకూ, వెనక్కూ కదలడానికి ఉపయోగపడితే, మరో చక్రం వాహనం దిశను మార్చడానికి పనికొస్తుంది. ఇందులోని బ్యాటరీని విద్యుత్‌తో చార్జింగ్ చేసుకోవచ్చు. వాహనాన్ని ఆన్, ఆఫ్ చేసుకోవడానికి వీలుగా ఒకే ఒక కంట్రోల్ ఉంటుంది. పర్యావరణానికి ఏమాత్రం విఘాతం కలిగించని ఈ వాహనాన్ని శరీరం కదలికల ద్వారా నడపవచ్చు. చిన్న ఆలోచన నుంచి పుట్టిన ఆసక్తి గొప్ప ఆవిష్కరణకు కారణమవుతుందని బెన్ పోస్ గులాక్ నిరూపించాడు.
...............................................
టైమ్ పాస్..
ఏమీ తోచకపోతే కొంతమంది పుస్తకాలు చదువుతారు. మరికొంత మంది సినిమాలు చూస్తారు. పేకాట ఆడేవాళ్లు, చదరంగం బోర్డుపై కుస్తీలు పట్టేవాళ్లూ ఉంటారు. కానీ, ఫిలిప్పీన్స్‌లో టైమ్ పాస్ అంటే కోడి పందాలు నిర్వహించడమే. మనీలా తదితర ప్రాంతాల్లో కోడి పుంజులను పట్టుకొని పందాలు కాసేవాళ్లు ఎక్కువగా కనిపిస్తారు. కోళ్లను చంకలో ఉంచుకొని తిరుగుతూ, తనలాంటి వాళ్లే ఎదురైన మరుక్షణమే పందాలకు సిద్ధమవుతుంటారు. మన దేశంలో లాగా కోళ్ల పందాలపై అక్కడ నిషేధం లేదు. అదొక సంప్రదాయంగా భావిస్తారు. అందుకే ఫిలిప్పీన్స్‌లో ఎక్కడ చూసినా ఇలాంటి దృశ్యాలే కనిపిస్తుంటాయి. జీవకారుణ్య సంస్థల ప్రతినిధులు ఎన్నిసార్లు వినతి పత్రాలు సమర్పించినా, ఎన్ని ఉద్యమాలు చేసినా అక్కడి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కోళ్ల పందాలను నిషేధించడం లేదు.
..........................................
రాక్షస బల్లులకు రెక్కలు!
రాక్షస బల్లులు (డైనొసర్స్) గురించి విన్నాం. సినిమాల్లో చూశాం. టిరనోసర్స్‌పైనా ఎన్నో అధ్యయనాలు ఉన్నాయి. వీటికి భిన్నంగా రెక్కలున్న టిరనోసర్ ‘యుటిరనస్’ అవశేషాలకు సంబంధించిన శిలాజాలాలు చైనాలోని లియానింగ్ ప్రాంతంలో బైటపడ్డాయి. సుమారు 125 మిలియన్ సంవత్సరాలకు పూర్వం యుటిరనస్‌లు చైనా తదితర ప్రాంతాల్లో జీవించేవని, వాటి వంటి నిండా రెక్కలు ఉండేవని ఈ శిలాజాలను అధ్యయనం చేస్తున్న శాస్తవ్రేత్తలు ఒక అభిప్రాయానికి వచ్చారు. ఈ రెక్కలతో యుటిరనస్‌లు ఎగరలేకపోయినా, చలి నుంచి తమనుతాము కాపాడుకునేవని అంచనా. తాజాగా బైటపడిన శిలాజాలను మరింత క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే, ఇప్పటి వరకూ మిస్టరీగా ఉన్న ఎన్నో ప్రశ్నలకు సమాధానం లభిస్తుందని శాస్తవ్రేత్తలు అంటున్నారు. ఎగిరే రాక్షస బల్లులకు సంబంధించి ఎలాంటి వాస్తవాలు వెలుగుచూస్తాయో!
ఉత్సాహం ఉండాలేగానీ ఎన్ని అద్భుతాలనైనా ఆవిష్కరించవచ్చని,
english title:
VINTA AVISHKARANA
Date:
Wednesday, April 11, 2012