హెన్రీ డూర్లీ జూలో మళ్లీ సుజానే-వాల్టర్ స్కాట్ ఎక్వేరియం సందడి
ఆరంభమైంది. అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రం, ఒమాహా నగరంలోని
ఈ అక్వేరియాన్ని ఇటీవలే ఆధునీకరించారు. అత్యంత అరుదైన
వివిధ జాతుల చేపలు ఇక్కడ సందర్శకులకు కనువిందు
చేస్తాయి. సముద్ర గర్భంలో తప్ప కనిపించని అతి అరుదైన
చేపలను కూడా సుజానే-వాల్టర్ స్కాట్ ఎక్వేరియంలో
చూడవచ్చు. ఆధునీకరణ పనులు పూర్తయిన తర్వాత గురువారం
సందర్శకుల కోసం తెరచిన ఈ ఎక్వేరియంలో ‘కౌనోస్ రే’ తన
ప్రత్యేక ఆకారంతో అందరినీ ఆకట్టుకుంటున్నది. గాలిపటాన్ని
పోలీన ఈ వింత చేపను చూడడానికి చిన్నాపెద్దా అన్న
తేడాలేకుండా సందర్శకులు విరగబడుతున్నారు. ఇక ‘బౌన్‌వౌత్
గిటార్ ఫిష్’ చూడడానికి అచ్చు గిటార్ మాదిరే కనిపిస్తుంది.
అక్టోపస్‌లా ఉండి, వింతవింత రంగుల్లో మెరిసిపోయే ‘సీ నెటల్స్’
ఈ ఎక్వేరియంలో ప్రధాన ఆకర్షణ. చిత్రవిచిత్రమై చేపలతో నిండిన
ఎక్వేరియాన్ని చూడడానికే ప్రత్యేకంగా హెన్రీ డూర్లీ జూకు ప్రజలు
భారీగా తరలివస్తున్నారు. ఇక వీకెండ్స్‌లో ఇక్కడ సందర్శకుల
సందడిని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
.....................................................
సమవుజ్జీ కోసం..
తూర్పు చైనాలోని ఫౌషాన్‌లో నివాసం ఉంటున్న ‘కుంగ్ ఫూ
సిస్టర్స్’ జియావో లిన్, జియావో ఇన్ అంటేనే వరులు
హడలిపోయారు. కుంగ్ ఫూలో ప్రావీణ్యం సంపాదించిన వీరిద్దరూ
తమకు సమవుజ్జీలుగా నిలిస్తేనే పెళ్లి చేసుకుంటామని
భీష్మించుకున్నారు. ఇందుకోసం చైనాలో కొన్ని శతాబ్దాల క్రితం
యువరాణుల వివాహానికి జరిపిన స్వయంవర విధానం ‘బి వూ
జావో కిన్’ను ఎంచుకున్నారు. ప్రత్యేకంగా ఒక టోర్నమెంట్‌నే
నిర్వహించారు. అందులో గెలిచిన వారినే వివాహం
చేసుకుంటామని ప్రకటించి సంచలనం సృష్టించారు. ఈ టోర్నీలో
ముందుగా విలువిద్యలో ప్రావీణ్యం చూపాల్సి ఉంటుంది. ఆతర్వాత
వీపుపై కట్టెల మోపును కట్టుకొని పరిగెత్తాలి. ఈ రెండు అడ్డంకులు
దాటినంత మాత్రాన వారు గెల్చినట్టు కాదట. చివరిగా తమతో
పోరాడి గెలవాలన్నది ‘కుంగ్ ఫూ సిస్టర్స్’ షరతు. ఆయుధాలు
ధరించాలా లేక ఆయుధాలు లేకుండా బరిలోకి దిగాలా అన్నది
తేల్చుకునే అవకాశం పోటీదారులకే విడిచిపెట్టారు. తమ కంటే
బలహీనులను, శక్తిసామర్థ్యాలు లేనివారిని వివాహం చేసుకోవడం
ఇష్టం లేదని, అందుకే ఈ స్వయంవరమని స్పష్టం చేశారు. ఎప్పుడో
రాజుల కాలంలో ఆచరించిన సంప్రదాయాలను వీరు మళ్లీ
వెలుగులోకి తెచ్చారు. రెండేళ్ల క్రితం జరిగిన ఈ పోటీలో ఎవరైనా
గెలిచారా? కుంగ్ ఫూ సిస్టర్స్ పెళ్లి చేసుకున్నారా? అన్న వివరాలు
మాత్రం ఇప్పటికీ అత్యంత గోప్యంగా ఉన్నాయి.